భగవంతుని అవతారములకు అంతులేదు. లెక్కలేనన్ని అవతారములు, అందులో కళావతారములు కొన్నియు, అంశావతారములు కొన్నియు. ఆవేశావతారములు కొన్నియు, యుగావతారములు కొన్నియూ ఈ విధముగ మొదలుకొని వివిధ నామములతో అవతరించుచుండును.యుగావతారము యొక్క కథా శ్రవణమునకే, భాగవత సేవ అని అందురు. భక్తుల యొక్కయు, భగవంతుని యొక్కయు, లీలా నాటకమైనది భాగవతము.కనుక అట్టి శ్రవణము ఆత్మసాక్షాత్కారమునకుమూలాధారమని భావించి, అనేకమంది మహాఋషులు భాగవతశ్రవణమునకు ఇంతటి పవిత్ర స్థానమును భావసారమును కలిగించిరి అందించిరి. (భా.వా. పు. 3)
అవే కాక ఆదేశావతారములు కూడా కలవు. వారే నారద, సనత్కుమారులవంటి మహాత్ములు. ఈశ్వర సమస్తగుణములూ వారలకు లేవు. కనుక వారలను ఆరాధించరు. జీవుడు స్వభావము చేత నిత్యుడు గా అద్యంతరహితుడు. జనన మరణములు లేనివాడు. స్వప్రకాశకుడు, జ్ఞానమును, జ్ఞాతయును, భోక్తయును, కర్తయునుఅతడే. బంధమోక్షములరెండింటి యందును ఈగుణములు జీవునకుండును.ఏమైననూ జీవుడు ఈశ్వరునివలె స్వతంత్రకర్త కాడు. ప్రతి కర్మమునందూ ఆత్మ, శరీరము, నానా ప్రకారములగు శ్రోత్రాదులగు ఇంద్రియములు ప్రాణాపాదులైన వివిధ చేష్టలు, దైవమును కలిసియున్నవి. ఏమైననూ జీవుడు సంకల్పరహితుడుగా వ్యవహరించు యంత్రము వంటివాడు కాడు. పూర్వజన్మమందలి కర్మములు ప్రస్తుత జన్మమందలి కర్మములనూ నిర్ణయించునట్లు ప్రస్తుత కర్మల వలన కర్త యగు జీవుడు భవిష్యత్తును రూపొందించుకొనగలడు. ఈశ్వరుడు వాని స్వభావానుసారముగా నిర్ణయించును. వాని స్వభావాలను మార్చుశక్తి ఈశ్వరునికున్ననూ, తానట్లు చేయడు. జీవుని స్వతంత్రేచ్చకే ఈశ్వరుడు వదలును. శిలాశకలము, శిలయందు భాగమైనట్లుజీవుడు ఈశ్వరుని యందు భాగము కాడు. ఒక విషయమున జీవ జగుత్తులు రెండును బ్రహ్మముకంటె భిన్నములు. మరొక విషయమున బ్రహ్మముతో అభిన్నములు. ఈ భేదాభేదసంబంధము బుద్ధికి తోచునది కాదు. శ్రుతుల వలన మాత్రమే వేద్యమగు చున్నది. ఇది పరమార్థవాహిని ప్రధాన సారము. (స.సా.న.78పు 196)
మీరందరూ అవతారులే రక్తమాంసములతో కూడిన ఈ శరీరమును కవచమును ధరించినదివ్యతత్వములే. అయితే అది మీకు తెలియదు. జన్మాంతర కర్మల ఫలితముగా ఈ శరీరములలో మీరు తరించేరు. అయితే నేను నా సంకల్పముతో ఈ శరీరము స్వీకరించినాను. మీరు మీ శరీరములతో త్రిగుణములను త్రాళ్ళలో బంధింపబడ్డారు. నేను గుణాతీతుడను. బంధ రహితుడను. మీరు కోరికలతో ఇటూ అటూ చలిస్తారు. మిమ్మల్ని కోరికలు లేని నిశ్చల స్వభావులను చేయవలెనని కోరిక తప్ప నాకు కోరికలు లేవు.
కాలకరణ వ్యవధానములను శృంఖలములచేత బంధించబడిన దైవత్వమే మానవుడు –“నీవు నీ ఆత్మతత్వమును ప్రకటించిన క్షణమందే నీవు భగవంతుడవయ్యెదవు మీరు ప్రతి ఒక్కరూ ప్రత్యగాత్మను పరమాత్మలో లీనము చేయగలిగినపుడు భగవత్స్వరూపు లగుదురు. (స.శి.సు.తృ,168/169)
ప్రతి అవతారమునకురెండు కారణాలు వుంటున్నాయి.ఒకటి భక్తుల ప్రార్థనలు, రెండవది దుర్మార్గుల యొక్క చేష్టలు. ఈ రెండింటి ఏకత్వము అక్కడ చేరాలి. ఇప్పుడు చిన్న ఉదాహరణము:ప్రహ్లాదుడు నిరంతరము హరినామము చింతస్తూ వచ్చాడు. హరి ప్రీతి కల్గినవాడు ప్రహ్లాదుడు. అతని తండ్రి హరిద్వేషి. దుర్మార్గుని ద్వేషము, సన్మార్గుని భక్తి చేరికవలననే నరసింహుని అవతారము వచ్చింది. మంచి చెడ్డలు రెండూ ఏకం కావాలి. కేవలం ప్రహ్లాదుడు "ఓం నమో నారాయణాయ" ఆంటే అతనినే రక్షిస్తూ వచ్చాడు. అయితే అతనిని రక్షించడానికి కారణం ఏమిటి? అతడిని ఏ చిక్కులలో ఉంటే రక్షించాడు. తండ్రి పెట్టే బాధలే భరించుకోలేనప్పుడు భగవంతుడు రక్షిస్తూ వచ్చాడు. తండ్రి పెట్టే బాధలు ప్రహ్లాదుని రక్షగా మారిపోయాయి. అతని ద్వేషమే ఇతనికి భగవంతుని యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యము, కూర్చినది. దైవత్వములో అనేక రహస్యాలు కూడి ఉంటాయి. (భసమ, పు. 42)
అవతార పురుషులకు జన్మాంతర పుణ్యపాప కర్మలు లేవు. సామాన్యమైనమానవ దేహములకుకలిగినకారణములు అవతార పురుషులకు లేవు. పాపాత్ముల పాపములు పుణ్యాత్ముల పుణ్యములు రెండునూ చేరే లీలా జన్మకు కారణమగును.ఉదాహరణమునకు ఒకటి చూడుడు. నరసింహావతారమునకు కారణమేమి? హిరణ్యకశిపుడు చేసిన పాపకర్మ, ప్రహ్లాదుడు చేసిన పుణ్యకర్మలే కదా! ఈ రెండూ చేరే కదా నరసింహుడు అవతరించుటకు తోడ్పడినది. అటులనే, అవతార పురుషుల జన్మలకు కారణములను వెదుకనక్కరలేదు. అవతార జన్మముల ద్వారా ధర్మాత్ములు సుఖపడుదురు. పాపాత్ములు దుఃఖపడుదురు. తన జన్మకు, ప్రత్యేకించిన పుణ్య పాపకర్మలు కారణములు కావు. తనకాయములో తనకు దుఃఖము కాని సుఖము కాని లేదు. అవతార జన్మలకు వెనుకజన్మకారణముకాదనియూ, దానికి పంచ భూతముల యొక్క వికారములు లేవనియూ, ఇది చిన్మయస్వరూపమే కాని మృణ్మయము కాదనియు, అహంకార మమకారములు అందులో లేశమాత్రమయినా నిలువలేవనియు, అవిద్యావరణము అవతారములందు కానరాదనియు, సామాన్య మానవులవలె లోకులు తరించిన అది కేవలము అజ్ఞాన దోషమేననియు, కృష్ణుడు చెప్పెను. (గీపు. 63)
మానవుని జన్మము ఎన్నో జన్మలపై ఆధారపడి యుంటుంది. అయితే దైవము మానుషాకారము ధరించటానికి ఏ కర్మ ఆధారము? దైవమునకు ఎట్టి కర్మలు లేవు. అవతారమునకు దుష్టులు చేసికొన్న దుష్కర్మలు - సజ్జనులు చేసికొన్న సత్కర్మలు ఆధారము. సజ్జనులు చేసికొన్న సత్కర్మలే కారణము. ఈ యిరువురి వలన అవతారము వస్తుంది. నృసింహావతారమునకు కారణము హిరణ్యకశ్యపుడు చేసిన దుష్కృత్యములు.
ప్రహ్లాదుడు చేసిన సత్కర్మలు.కాని దైవ భౌతిక కాయమునకు కర్మలు ఆధారము కాదు.దైవము తన కాయమును ఏవిధముగానైనా మార్పు చేసికొనవచ్చును. దీనిని నిర్ణయించడ మనేది ఎవరితరము కాదు.ఇదిఅంతా సంకల్ప బలము. దైవత్వమును అర్ధము చేసుకోటానికి కేవలము మానవత్వమును ఆధారము చేసికోవడం వలన సాధ్యము కాదు. ఇటువంటిపవిత్రములైన ప్రబోధములు హృదయానికి హత్తుకునేటట్లుగా బోధించి దివ్యాత్మజన ఆత్మతత్త్వాన్ని సందర్శింపచేసి కొనుటకు గురువు అత్యంత అవసరము.నిజముగా గురువన్నవాడు, కంటి డాక్టరు వంటి వాడు. కంటి డాక్టరు కంటి పొరను తీసివేసి పూర్వపు దృష్టిని తీసుకువస్తాడు. అదే విధముగా ఆజ్ఞానము అనెడి పొరను తొలగించి పూర్వమున్న సహజజ్ఞాన దృష్టిని కలిగించాలి. ఇదే యీనాడు చేయవలసిన పని. "గురు" అనే పదములో "రు" కారము అంధకారమును తెలియ చేస్తుంది. "గు" కారమనగా అజ్ఞానముమ దూరము చేస్తుంది. అది అర్థము.అజ్ఞానము దూరముచేసి ప్రజ్ఞానమును ప్రకటింపచేసేవాడు గురువు.చంద్రుడు పూర్ణముగా ప్రకాశించినపుడు పూర్ణిమ అని చెప్పుకుంటున్నాము. అదేవిధముగామనస్సు పూర్ణత్వాన్ని పొందిన రోజు గురుపూర్ణిమ.పూర్ణిమ కొంతకాలము వుంటుంది. కాని బ్రహ్మజ్ఞానం అట్లు కాదు. మానవుడు ఈ 3 విధములైన తత్త్యాలు అర్థం చేసికోవాలి.(1) అజ్ఞానం - ఒకతూరి పోయెనా మరలరాదు. (2) బ్రహ్మజ్ఞానము - ఒకసారి వచ్చినా మరలపోదు. (3) ఆత్మతత్త్వమే పూర్ణత్వము - రాదు - పోదు. (సా పు 520, 521)
"అవతారము యొక్కకార్యక్రమంలో ప్రతి అడుగూ ముందే నిర్ణయింపబడి ఉంటుంది. రాముడు సత్యధర్మాల వేళ్ళను పోషించడానికి వచ్చాడు. కృష్ణుడు ప్రేమను శాంతిని పెంపొందించడానికి వచ్చాడు. ఇప్పుడా నాలుగూ ఎండి పోయే ప్రమాదం సంభవించింది. అందుచేతనే ఈ ప్రస్తుతావతారం వచ్చింది. అరణ్యాలకు పారిపోయిన ధర్మాన్ని తిరిగి పల్లెల్లోకి పట్టణాల్లోకీ తీసుకొనిరావాలి. అంటే, పల్లెలను పట్టణాలనునాశనం చేస్తున్న అధర్మపరులను అడవులకు తరిమివేయాలి." (లో పు.89)
రామావతారమునందు మానవ ధర్మం నిమిత్తమై తాను అనుభవించి, ఆచరించి అన్యులకు అందిస్తూ వచ్చాడు. సామాన్య మానవునివలె ప్రవర్తిస్తూ తన ఆచరణ ద్వారా దైవత్వాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. కృష్ణుడు అట్లా కాదు. ఆదేశంగా తాను తీసికొని, బోధించడంలో మానవత్వానికి తగినట్లు విశిష్టతను కల్పించాడు. కనుకనేరాముడు చేసినట్లు చెయ్యి", "కృష్ణుడు చెప్పినట్లు విను” రామునకు పనిముందు, నవ్వు వెనుక, కృష్ణునకు నవ్వు ముందు పని వెనుక. అందుచేత కృష్ణుడు స్త్రీలను ఏడిపించాడు. రాముడు స్త్రీల నిమిత్తము పరితపించాడు. అందుచే వారి చర్యలు విరుద్ధంగా కనిపిస్తాయి.దేశకాల ప్రభావములను పురస్కరించుకొని, వారు అవతరించడం జరిగింది.
రామావతారము సత్యధర్మములు తాను ఆచరించి యితరులను ఆచరింప చేయుటకు వచ్చింది. కృష్ణావతారం, ప్రేమ శాంతులను ఉద్దరించుటకు వచ్చింది. అసలు అవతారాలు ఎందుకు వచ్చాయి? భాగవతం సప్తమ స్కంధంలో శుకమహర్షి పరీక్షితునకు బోధించాడు. వైకుంకుడు దేవతలను ఎందుకు రక్షించాలి. రాక్షసులను ఎందుకు శిక్షించాలి? విష్ణుమూర్తి వ్యక్తుడు గాడు, గుణములు లేవు. ప్రకృతికి చెందడు. భావముల నొందడు. కాని పరమేశ్వరుడు తన మాయవలన ఆయన గుణముల నాదేశించి, బాధ్య బాధకత్వముల నొందును. అతడు గుణరహితుడు. సత్వరజ, తమములు ప్రకృతి గుణములు, ఆ గుణములకు ఒక్కొక్క కాలమున హానివృద్ధులు గలవు. ఆ ఈశ్వరుడు సత్యమున దేవ ఋషులను, రజోగుణమువలన అసురులను, తమోగుణము వలన యక్షరక్షోగణములను విభజించెను. ఆ విభుడు సర్వగతుడయ్యెను. భిన్నుడు గాడు. జీవాత్మకు పరుడైన సర్వమయుడు. తన మాయచేత విశ్వమును సృజింపగోరి, రజమును క్రీడింపగోరి, సత్యమును నిద్రింపగోరి తమమును నుత్పాదించి, చరాచరమైన కాలమును సృజించును. ఆ కాలమున సర్వదర్శనుడైన ఈశ్వరుడును కాలహ్వయుండునున్నై, హరి సత్వగుణమైనవృద్ధియు, రజస్తమో గుణంబులైన రాక్షసులకు హాని చేయుచుండును.తత్త్వ విదులైన పెద్దలు, తమలో పరమాత్మ స్వరూపములో వున్న ఈశ్వరుని, సర్వగతుండయ్యును భిన్సుడు గాడని ఎరుగుదురు. హరిద్వేషుడైన శిశుపాలుని కృష్ణుడు చక్రముచే చంపగనే అతని తేజస్సు కృష్ణునిలో చేరెను. ఆశ్చర్యమే!దూషణ భూషణ తిరస్కారములు శరీరమునకు గాని పరమాత్మకు లేవు.శరీర అభిమానము చేత వాక్పారుష్యములు శరీరమునకు గాని పరమాత్మకు లేవు. శరీర అభిమానము చేత వాక్పారుష్యములు హింసయై తోచు తెరంగుము నేను నాయది యనియెడు వైషమ్యమును భూతములకు శరీరమునందు సంభవించును.సర్వభూతాత్మకుడైన ఈశ్వరునికి వైషమ్యము లేదు. అందుచే హరిని చేరేటందులకు అలుకనైనా,చెలిమినైనా,కామంబునైనా,బాధమునునైనా,భీతినైనా,అఖిలాత్ముడైన హరిని చేరవచ్చును. హరి కాదనడు.అందుచేతనే గోపికలు కామముతోను, కంసుడు భయముతోను, విరోధముతో శిశుపాలుడును, బంధువులై వృష్ణులు, ప్రేమతో పాండవులు, భక్తితో మునులు, సేవాతిరేకముగల చిత్తము చేత ఎవ్వరైనను హరిని చేరవచ్చును. ఎతావాతారామ, కృష్ణ అవతారములు వేరువేరుగా కనబడినప్పటికి, వారు చేసిన కర్తవ్యము ఒక్కటే. వారిలో చేర్చుకొవడమే. (సా. పు 79, 80)
దేహధారి అయిన నేను అవతరించి ఈ లోకమున ఆచరించు కృత్యములు యేవో చెప్పెద విను అన్నాడు. అవి సాధువులను రక్షించుట, దుష్టశిక్షణ, ధర్మోద్ధరణ. సాధువులనగా సామాన్య మానవుల దృష్టియందుండు సాధుసన్యాసులు కారు. సాధుగుణము ప్రతి ప్రాణి యందునూ అనగా క్రిమి కీటకములందు సహితము కలదు. సూక్ష్మముగా చెప్పవలెనన్న, సత్యగుణపోషణే సాధుసంరక్షణ. ఇట్టి పవిత్రగుణము పరమపురుషుల యందు ప్రధాన పాత్ర వహించియుండును. కనుక సాధురక్షణ అనగానే సామాన్యముగా సన్యాసుల రక్షించుట కని తలంతురు. సత్వగుణాభివృద్ధికియెవరుప్రయత్నింరురో సదాచార పరాయణులయి, సత్సీల వంతులై, సత్యవాక్పరిపాలకులయి, సర్వేశ్వర సాన్నిధ్యాభి మానులై, సద్ధర్మ పరాయణులై, సర్వజన సమాన ప్రేమ కలవారయి యందురో అట్టి వారందరూ సాధుసంతతివారు.ఆట్టి సాధుత్వము పశువునందునూ పక్షియందునూ మృగము నందున కలదు. అందువలననే రామాయణ మందు జటాయువునురక్షించెను; గజరాజును కాపాడెను; కోతులను అనుగ్రహించెను ఉడుతను ప్రేమించెను.ఇవన్నియూ సాధుత్వము కలిగినవే కదా!కంఠమాల ధరించి కాషాయము కప్పి దండము పట్టినంత మాత్రమున సాధువు కాజాలడు.వేషభాషలకంటె సుగుణ స్వభావమే సాధుత్వమునకు ముఖ్య లక్షణము, సమస్త జీవులందునూ సాధుత్వమనుగుణము కలదు. కనుక లోకసంరక్షణే, ప్రధాన సాధుపోషణ అని తలంచవలెను.
ఇక, దుష్టశిక్షణ యెవరిని? యేయే జాతి జీవులకు నియమించిన హద్దులను దాటి అక్రమ ప్రవర్తనలతో అన్యాయ అనాచార ఆలోచనలతో, అహంకార ఆవేదనలతో క్రమమును తప్పి సంచరించుదురో అట్టివారిని శిక్షించుట అనగా రజో తమోగుణ బలిష్టులను. దయా ధర్మ దమములు లేనివారలను శిక్షించుట.ఇక ధర్మరక్షణ. ఈ మూడు విధములైన ఆచరణలే తన అవతార లక్షణమని శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార ధర్మమును అర్జునునకు చెప్పెను. (పు.63/64)
ప్రతి అవతారమునకు కొన్ని నియమనిబంధనలుంటాయి. వాటిని ఆ అవతార పురుషుడు అతిక్రమించడు. మానవమాత్రులు భగవంతుని లీలలను అర్థము చేసికొనలేరు". (దై. ది. పు. 319)
ప్రదర్శించే మహిమలు, అద్భుతాలు సహజంగా వాటంతట అవి వ్యక్తమయ్యే అవతారాల చిహ్నాలు :
"రమయతీతి రామ" రమింప చేసేవాడు అనగా ఆనందాన్ని కలుగ చేసేవాడు రాముడు. అందరినీ ఆకర్షించేవాడు కృష్ణుడు.ప్రతి హృదయాన్ని ఆనందింపచేయటానికి, ఆకర్షింప చేయటానికి నేను ప్రతి పనిని మీ పరిభాషలో అద్భుతాలు, మహిమలు అంటున్నారు.మానవాళిని సంస్కరించి, పునర్నిర్మాణం చేయటం అవతారం యొక్క ముఖ్యలక్షం. నేను చేసే ప్రతి చర్య, ప్రతి మహిమ ఈ లక్ష్యాన్ని నెరవేర్చి ఫలితాన్ని సాధిస్తుంది. “చమత్కారము" యొక్క లక్ష్యము మానవ జాతి సంస్కారము.ఈ మానవ జాతిని సంస్కరించుట అనబడే లక్ష్యమును ఈ అవతారం ఏ విధంగా సాధిస్తున్నది?
అద్భుతాలకు, మహిమలకు ఆకర్షించబడిన ప్రజలు నా పట్ల ప్రేమతో సన్నిహితులౌతారు. నేను పంచే ప్రేమతో వారు జీవులన్ని ఒక పరమాత్మ అంశాలన్న విషయాన్ని గుర్తించి అందరికీ తమ ప్రేమను పంచటం గురించి తెలుసుకుంటారు. ఆ ప్రేమ పరోపకారంగా మారుతుంది. ఫలితంగా వారి మనస్సులు ప్రక్షాళనమై, పవిత్రమై, వారి బుద్ధి వికసించి హృదయం నిర్మలమవుతుంది. అప్పుడు వారు తమ నిజతత్త్వమైన ఆత్మతత్త్వమును గుర్తించుతారు. విశ్వసృష్టికర్తయైన పరబ్రహ్మ మనబడే సాగరంలో తాము అలలవంటి వారమని, ఆ పరమాత్మ అంశమే తామని గుర్తించి మానవ జీవిత చరమలక్ష్యము, పరమ లక్ష్యము అయిన "సాక్షాత్కారమును" పొందగలుగుతారు. (స.శి.సు.నా. పు. 56/57)
నేను ధర్మోద్ధరణకై వచ్చాను కాబట్టి సాధారణంగా నేను ఎప్పుడూ ధర్మం గురించే మాట్లాడతాను. నాకు ఇక్కడ వేరే పని ఏమీ లేదు.నేను అజ్ఞానులకు పానకం, జ్ఞానులకు అమృతం ఇస్తాను. భగవంతుడు అవతారములను ఎత్తినది ఇక్కడ అయినప్పటికీ ధర్మం ఒక్క భారతదేశంలోనే తగ్గిపోతున్నదే అని భావించకండి. ధర్మం ఇక్కడ ఉన్నది కాబట్టే, ధర్మం గురించి ఇంకా అధ్యయనం జరుగుతున్నది. కాబట్టే ధర్మానికి ఇక్కడ విలువ ఉన్నది కాబట్టి అవతారపురుషులు ఇక్కడ అవతరించటం జరుగుతున్నది. మిగిలిన ప్రపచంమంతా ఈ మహావృక్షపు శాఖలు మాత్రమే.నాకు స్వదేశమని, పరదేశమనిలేనే లేదు.
మానవాళి మొత్తాన్ని ధర్మమార్గంలోకి తీసుకు రావాలి. వేదములు అపౌరుషేయములు. అవి మానవమాత్రులచే రచింపబడినవి కావు. వేదపురుషుడు ఒక దేశానికి మాత్రమే సంబంధించినవాడు కాదు. ఎక్కడ నుండి మీరు ఆర్తి పొందితే అక్కడ వేదం ఆవిర్భవిస్తుంది. అన్ని మతములు, ధర్మములు వేదసత్యముల నుండి ఆవిర్భవించినవే. (వ. 61-62 పు. 214/215)
నేను సరిగ్గా చేస్తున్న పని ఇదే. లోనున్న దైవత్వాన్ని మేలుకొలిపి భూకంపాలు, వరదలు, కరువులు, అంటువ్యాధుల జాడ్యాల నుండి బయట పడేటట్లు చేస్తున్నాను. అవతార మూర్తులు రెండు రకాలుగా సహాయం చేయగలరు. ఒకటి తాత్కాలిక సహాయం, రెండవది దీర్ఘకాల ప్రణాళిక.
తాత్కాలిక సహాయం ప్రకృతికే విరుద్ధం. కార్యకారణాల మీద నడిచే ఈ ప్రకృతికే వ్యతిరేకం. చాల మంది మానవులు వారి కోర్కెల అహంకార పూరితమైన ప్రపంచంలో నివసిస్తుంటారు.వారి కార్యాలను బట్టి ఫలితాలను అందుకొంటారు. వారు పురోగతి కాని తిరోగతి కాని దీని మీద ఆధారపడి ఉంటుంది. అవతారమూర్తి వెనువెంటనే వారి సమస్యలను పరిష్కరిస్తే, కర్మ, పురోగతి, ఆధ్యాత్మిక అభివృద్ధి ఆగిపోతుంది. సృష్టిమూల సూత్రాలకే ఇది విరుద్ధం.కాబట్టి దీని సంగతి విస్మరించవచ్చు.
ఇంకొక సత్ఫలితాల నిచ్చే మార్గం దీర్ఘకాల ప్రాతిపధిక, అవతార మూర్తి ప్రజలను ఉన్నత మానసిక స్థితిలోనికి నడిపించి, ఆధ్యాత్మిక సూత్రాలను అర్థం చేసుకొని సత్ప్రవర్తనతో పరిస్థితులను బాగు చేసుకొనేటట్లు చేయడం సృష్టి, కర్మ సిద్ధాంతాలను ఈ పని విశదీకరిస్తుంది. అప్పుడు కార్య కారణాల చక్రం నుండి అధిరోహించి, ఇప్పుడున్న దైన్యస్థితికి గురియైన వారే ప్రకృతిని అదుపాజ్ఞలలో పెట్టుకొని మీరు చెప్పే బాధల నుండి విముక్తి కలుగజేస్తారు. మానవాళి మనస్సును భగవంతుని దశకు ఎదిగేటట్లు చేసి, వారి భవిష్యత్తును వారే నిర్ణయించు కొనేటట్లుచేస్తున్నాను
.
నా ఇచ్చా శక్తిలో భాగస్వాములవుతారు. వారి ద్వారా నా పని సాగించాలి. వారిలో దైవశక్తిని మేల్కొలిపి ప్రకృతిలో చట్టాలను, శక్తులను బాగా అర్థం చేసుకొని వాటిపై ఆధిపత్యం వహించాలి. తక్షణం వారి అవసరాలు తీరుస్తుంటే వారు ఇప్పటి మానసికస్థితిలోనే ఉండి, అన్నింటిని కలగా పులకం చేసి, ఒకరిగొంతు లొకరు కోసుకోవడానికి సిద్ధమవుతారు. ఫలితంగా అల్లకల్లోల పరిస్థితి ఏర్పడుతుందీ ప్రపంచంలో.
బాధ, వ్యధ భగవంతుని నాటకంలో తప్పనిసరి అంకాలు, దైవం ఈ కష్టాలను వాళ్ళ మీద రుద్దడు. తన దుష్కృత్యాలను దిద్దికోనేందుకు మానవుడే వానిని ఆహ్వానిస్తాడు. ఈ సరి చేసే శిక్ష చెడు మార్గం వీడి, -సన్మార్గంలోకి ప్రవేశించి, దైవం వంటి సత్ చిత్ ఆనందాన్ని అనుభవించడానికి, విజ్ఞత పొంది, శాంతి చేకూరడానికి - దోహద పడుతుంది. ఇదంతా చెడ్డ మంచిని పైకి లేవడానికే ఈ రమ్యమైన ద్వంద్వాల మేలు కలయిక. అదేవిధంగా మృత్యువు అమరత్వాన్ని అవివేకం జ్ఞానాన్ని, బాధ శాంతిని, రాత్రి పగలును కాంతివంతం చేస్తాయి.
ఆఖరిగా చెప్పేదేమిటంటే అవతార మూర్తి మీరు చెప్పిన కష్టాలను వెనువెంటనే ఆపుచేస్తే నాటకీయమైన సృష్టిలోని కర్మ సిద్ధాంతాలు కుప్ప కూలతాయి. అత్యవసర పరిస్థితులలో నేను ఆ బాధను ఆపగలను, ఆపుతున్నాను. ఇవి భగవంతుడు మనుష్యులకు కల్పించినవి కాదని జ్ఞాపకముంచుకో, మానవుడు మానవుడి కోసం చేసినది.
ఒక్క మాటలో చెప్పాలంటే సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ప్రేమ సిద్ధాంతం ద్వారా నెలకొల్పడమే. మరింకేమీ ఈఅణు విధ్వంసక అగ్ని నుండి ప్రపంచాన్ని కాపాడుతుంది? రాబోయే ఆ భయానక ప్రళయాన్నే సూచిస్తున్నాయి. నా సంకల్పం ఆ అగ్ని జ్వాలలను నిరోధించడం, ధర్మాన్ని పునః ప్రతిష్ఠ చేయడం, భగవంతునిఆధ్యాత్మిక చట్టాలను తిరిగి ప్రవేశ పెట్టడం, ఒకే భగవంతుడు, ఒకే మతం, మానవాళి నంతటిని కౌగిలించుకోనే ఒకే భాషను నెలకొల్పడం.
నేను ఒకే ప్రేమ మతాన్ని మానవులందరిని అన్నదమ్ములుగ, భగవంతుని తండ్రిగా సంఘటిత పరచేటట్లు, బోధిస్తాను.నాకు తెలిసిన ఒకే భాష-హృదయ భాష, ఇది మెదడును తెలివిని దాటి మనిషికి మనిషికి మధ్య, మానవునికి దైవానికి మధ్య ఒకరినొకరు అర్థం చేసుకోనేటట్లు, సహాయం చేసుకొనేటందుకు, సమాజము సుఖ సంతోషాలతో గడిపేందుకు ఉపకరిస్తుంది. ఈ ప్రాతిపదికపై మతం, కులం లేని సమాజాన్ని నిర్మించి, విశ్వమానవ ప్రేమతో నా భక్తులు ప్రపంచంలోని ప్రజలంతా వారి కుటుంబం అనుకొనేటట్లు చేయ సంకల్పించాను. హిందూ మతం ప్రాతి పదికగా గలది, మిగిలిన సుస్థిర ఇతర మతాలతో విభేదించడం ఎన్నటికీ జరగదు.ఎందు చేతనంటే నేను నిర్మంచబోయేది సనాతన ధర్మం - అన్ని మతాల స్థాపకులు నమ్మిక ఒకే దైవం అన్న సిద్ధాంతం పై నిర్మించింది. అందు చేత ఎవ్వరూ కూడా వారి మతాన్ని కాని నమ్మిన మూర్తిని గాని విడవాడ నక్కరలేదు. వాని ద్వారా అందరిలో ఉన్న ఏకైక దైవాన్ని పూజంచనియ్యండి. నేను ఉన్న నమ్మకాలను ఛిన్నాభిన్నం చేయడానికి కాని, నాశనం చేయడానికి కాని రాలేదు. ప్రతి ఒక్కరిని వారి నమ్మకాన్ని స్థిరీకరించడానికి నిర్దోషమని నిరూపంచడానికి వచ్చేను.
ఉన్న కరాణాలు ఉత్పన్న మయ్యే చోట్ల, అడ్డులు, జాతి, కుల, మత తారతమ్యాలను తొలగించి, పగ, దౌర్జన్యం స్థానంలో ప్రేమ, అహింసలను ప్రతిష్ఠించడం ద్వారా అణుయుద్ధాన్ని నివారణ జరుగుతుంది. ఒకరి నొకరు చంపుకొనే విధానంకు బదులుగా మానవాళికి శాంతి, సౌఖ్యాలలో పరస్పర సహకారంతో నింపాలని ఆశిస్తున్నాను. (నా.నే.పు.102/105)
మూర్ఖత్వము, దుష్ట ప్రవృత్తి ప్రతి హృదయంలోను గూడు కట్టుకొని ఉన్నాయి. అందువలన ప్రతిఒక్కరినీసంస్కరించవలసి యున్నది. ప్రతి ఒక్కరూ సన్మార్గములో నడిచేటట్లు బోధించి, వారిని ఆ మార్గములో నడిపించవలసిన అవసరమున్నది.అవతారపురుషులు చేసే ప్రతి అడుగున, వారు చేసే ప్రతి ఒక్క పనిని, కార్యక్రమమును గమనించండి. లోకమునకు ఆదర్శమును నిరూపించుటకై అవతరించిరి. అవతార పురుషుల జీవితములను గమనించి తదనుగుణంగా నడుచుకోండి.వారి దివ్య ప్రేమను, కరుణమజ్ఞానమును గుర్తించి వాటిని మీ మీ జీవితాలలో అనుభవమునకు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మానవజాతిని సన్మార్గములో నడువమని హెచ్చరించడానికి, వారికి మార్గదర్శకత్వము నెరపడానికి, వారికి వెలుగుబాటను చూపించడానికి, వారిపై ప్రేమకాంతిని ప్రసరింప చేయడానికి ఈ అవతారము వచ్చింది.అయితే, మానవులు ఆయన బోధలను భక్తి విశ్వాసములతో ఆలకించి, వాటిని అర్థము చేసుకుని, ఆచరించడానికి సిద్ధముగా ఉండాలి. ప్రపంచమనే రంగస్థలము పై నిర్వహింపబడేఈ దివ్యలీలా నాటకములో జీవులందరి పాత్రను ఆ పరమాత్ముడే ప్రత్యక్షంగా దర్శకత్యము వహించి నడిపిస్తున్నాడు. ఆధునిక జీవితమును పౌరాణిక కాలమునాటి జీవితముతో పోల్చి చూచి మధ్యగల తేడాను మీరే స్వయంగా గమనించండి. (దై. ది. పు. 292)
ఏ వతారము ఈ విధముగా చేయలేదు. గ్రామసీమలలోని ప్రజల మధ్యకు వెళ్ళుట, నిద్రావస్థలో వున్న వారిని మేల్కొల్పుట, స్తబ్దులైనవారిని ఉత్తేజపరచుట, ఆపదలో వున్నవారిని కాపాడుట, లక్షలాది మందికి అనుగ్రహము ప్రసాదించుట, సత్యధర్మ శాంతి ప్రేమ పథములలో నడిపించుట, ముందెన్నడూ జరుగలేదు. నేను గురువును కాను, దైవము కాను, నేను సముద్రమును, మీరందలి అలలు. మీరే నేను. మీరు గమ్యమును చేరునప్పుడు, ఈ సత్యమును గ్రహించ గలరు". (స.శి.సు.తపు.167)
భగవదవతారమునకు ఆరు విధములైనటువంటి శక్తులుంటున్నాయి.ఒకటి సమగ్రమైనఐశ్యర్యము, రెండవది ధర్మము, మూడవది కీర్తి, నాల్గవది సంపద, ఐదవది జ్ఞానము, అరవది వైరాగ్యము.ఈ ఆరు గుణములతో కూడినటువంటి షడైశ్యర్య సంపన్నుడు భగవంతుడు. ఆ ఆరు గుణములను ఒకదాని వెంట నొకటి అనుసరించి సమత్వమైన స్వరూపమును ధరించిన వాడు శ్రీరామచంద్రమూర్తి. ఏ యుగము నందుకాని, ఏ జగమునందు కాని ఈ అవతారములు ఈ పడైశ్యర్యముల స్వరూపములను ధరించియే భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. (స,సా.జూ. 1989, పు 142)
మనిషికి అవతారమునకు మధ్య ఉన్న తేడా ఇది. పదునైదు అంశములను అనుభవించును. కాని వాటిపై అతనికి ఆధిపత్యము లేదు. వాటి దోవ వాటిదే. మానవుని ఆధిపత్యము పెరుగుతున్నకొలది అతడు పదునారవ అంశమునకు సన్నిహితుడగును. పదునారవ అంశమే సర్వ జ్ఞుడైన పరమాత్మ .కర్మేంద్రియములు, జ్ఞానేంద్రిములు, పంచభూతములు కలసి పదునైదు అంశములగును. ఇక పదునారవ అంశము సర్వ జ్ఞుడైన పరమాత్మ. (ప.ప్ర. పు. 134 )
అవతారములుకూడ మాయాశక్తికి లొంగినట్లు నటించును. మానవ ప్రక్రియలను బహిరంగముగా ప్రదర్శించక అవతార కార్యక్రమములు జరగవు. బాలకృష్ణుని తొట్టిలో పరుండబెట్టి యశోదాదేవి జోలపాట పాడుతూ, కథలు చెప్పుతూ నిద్రింపజేయుట అలవాటు. ఒక దినము, అనగనగ అని ప్రారంభించి దశరథ మహారాజుకు నలుగురు కుమారులు పుట్టుట, రాముని పట్టాభిషేకము నిలచిపోవుట, సీతాలక్ష్మణులతో ఆయన అరణ్యానికి పోవుట, బంగారు లేడి వచ్చుట, దానిని సీతమ్మవారు కోరుట, అన్నీ బాగా వివరించిన తరువాత, రావణాసురుడు వచ్చి సీతాదేవిని అపహరించినాడు అనే సరికి, తొట్టిలో పరుండియుండిన పసిపాప, ‘లక్ష్మణా! అంబెక్కడ అని కేకలు వేసెను. అప్పుడు యశోద మాత్రము, ఏమిటి ? ఈ పిల్లవాడు కలవరించెనే! అని ఆశ్చర్యపడినది. మరొక దినము తానే తాను కల్పించుకొని, అన్న బలరామునిపై దూరు చెప్పినాడు, నన్ను నల్లనివాడని గేలి చేయుచున్నాడు అని. అది నిజమే! అని తల్లి చెప్పగా, సర్వులలో ఉన్న దోషముల నపహరించుటవల్ల నాకీ నల్లదనము అని తన స్వభావ స్వరూపములను కొద్దిగా వివరించినాడు. (దివ్య జ్ఞాన దీపికలు ద్వితీయ భాగం పు 8-9)