నదిలోకి దిగినవాడు గొంతు వరకు మునిగి నప్పుడు కూడా మాట్లాడగలడుగాని, నీటిలో పూర్తిగా మునిగిన తరువాత మాట్లాడటానికి వీలుకాదు. అదేవిధంగా, దివ్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నవాడు, దివ్యత్వంలో పూర్తిగా మునిగినవాడు ఏమీ మాట్లాడడు. మీరు దివ్యమైన భావాల్లో మునగాలి. దివ్యమైన ప్రేమలో మునగాలి. వేదాంతము "నిన్ను నీవు తెలుసుకో అని బోధించింది. కానీ మీరు ఎవరెవరివో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. "మీరెవరండీ? ఎక్కడి నుండి వచ్చారండీ?" అని ఎంక్వైరీ చేసేవాడు ప్రవృత్తి మార్గంలో జీవించేవాడు."నేనెవరు? ఎక్కడి నుండి వచ్చాను?" అని విచారణ చేసేవాడు నివృత్తి మార్గంలో జీవించేవాడు. తాను ఇతరుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం నెగెటివ్ లక్షణం,తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించడం పాజిటివ్ లక్షణం. మీలో నెగెటివ్ ఆలోచనలను నింపుకొని పాజిటివ్ ఫలితం రావాలంటే ఎలా వస్తుంది? దోసకాయ తింటే మామిడి పండు త్రేపు వస్తుందా? కనుక మొట్టమొదట మీలో పాజిటివ్ ఆలోచనలను నింపుకోండి. పాజిటివ్ఆలోచనలంటే దైవత్వమునకు సంబంధించినవి. నెగెటివ్ ఆలోచన లంటే ప్రాపంచిక విషయాలకు సంబంధించినవి. ప్రేమ, సత్యము, సహనము, శాంతము మున్నగు పాజిటివ్ గుణములు హృదయం నుండి వస్తున్నాయి; ప్రాపంచిక సంబంధమైన నెగిటివ్ ఆలోచనలు తల నుండి వస్తున్నాయి. మానవునికి హెడ్ (తల), హార్ట్ (హృదయం) చాల ప్రధానమైనవి. సైన్సు, టెక్నాలజీ తలకు సంబంధించినవే. కానీ ఈనాడు టెక్నాలజీ అనేది“ట్రిక్ నాలెడ్జ్ గా మారిపోతున్నది. ఎందుకంటే మానవుడు పాజిటివ్ వైపుకు ప్రయాణం చేయడం లేదు..
(స .సా.3.5.99 పు.61)