మానవునికి ప్రధానమైనవి రెండు. ఒకటి తల, రెండవది హృదయము, తలనుండి ఆవిర్భవించేవి ప్రవృతి లక్షణాలు. చదవడం, వ్రాయటం, తినటం, తిరగటం, సంపాదించడం, కూడబెట్టడం, ఇవన్నీ ప్రవృతి లక్షణాలు. హృదయము నుండి ఆవిర్భవించేవి నివృతి లక్షణాలు.దయ, ప్రేమ, సహనం, సానుభూతి - ఇవన్ని నివృత్తి లక్షణాలు. ఈ నివృత్తిని ఆధారంగా చేసుకోవాలి.ఈ ప్రవృత్తి నివృత్తుల తత్వాన్ని సరిగ్గా గుర్తించడమే సత్యాన్వేషణ. మన కన్నులు తల్లిని చూస్తున్నాయి. భార్యను చూస్తున్నాయి. కూతుర్ని చూస్తున్నాయి. కోడల్ని చూస్తున్నాయి. అయితే ఎవరిని ఏ దృష్టితో చూడాలి? అన్న విచారణే సత్యాన్వేషణ. ఒక వృక్షమున్నది. కొందరు శాఖలే ప్రధానమని వాటి నుండి లభించే ఫలపుష్పములే ప్రధానమని విశ్వసిస్తారు. కాని వాటన్నిటికీ ఆధారమైన వేర్లను చూసేవాడు వేదాంతి. సైంటిస్టుకు తెలియనిది వేదాంతము బోధిస్తుంది. వేదాంతికి తెలియనిది సైన్సు బోధిస్తుంది. అయితే, సైన్సు వేదాంతముల సమ్మిళత స్వరూపమే సత్యాన్వేషణ అన్నారు. వేర్లు లేక శాఖలు లేవు. శాఖలు లేక వేర్ల వల్ల ప్రయోజనం లేదు. ఈ రెండూ అన్యోన్యాశ్రయమైనవి. అవినాభావ సంబంధం కలవి. కనుకనే, ప్రతి వ్యక్తి ఆంతర్ బహిర్ తత్వములు రెండింటిని గుర్తించడానికి ప్రయత్నించాలి.
(శ్రీ భ.. ఉ. పు.182/183) |