దండకారణ్యమునకు బయలు దేరుటకు ముందుగా, ఒక చెట్టుపైన ఒక పెద్ద పక్షి కనిపించింది. ఇది ఒక రాక్షసేమోనని సీత సందేహించింది. అప్పుడు రాముడు నీవెవరని అడిగాడు. అప్పుడు ఆ పక్షి “రామచంద్రా! మీ తండ్రిగారి స్నేహితుడను. నా పేరు జటాయువు. నేను ముసలిదాననైనాను. నేను యిక్కడనే ఉంటున్నాను. మీరు యిక్కడ పర్ణశాలను నిర్మించుకోండి. మీరు ఇంట్లో లేనప్పుడు సీతయొక్క మంచి చెడ్డను నేను చూసుకుంటాను. మీ సేవలో నన్ను పాలుపంచుకొనే టట్లుగా అనుగ్రహించండి. ఇది నా అదృష్టంగా భావిస్తాను” అన్నది. ఇప్పుడు సీతను రావణుడు తీసికొని వెళుతుంటే, జటాయువు అనేక విధముల అడ్డు తగిలింది. అడ్డము వచ్చిన జటాయువు యొక్క రెక్కలు నరికి సీతను తీసికొని వెళ్ళిపోయాడు రావణుడు.రామలక్ష్మణులు సీతను వెదుకుతూ పోతున్నారు. దారిలో జటాయువు రెక్కలు విరిగి పడిఉన్నది “రామా! రామా!” అని అరుస్తున్నది. రాముడు జటాయువు దగ్గరకు వెళ్ళి, దాని తలను తన తొడమీద పెట్టుకొని నిమురుతూ జరిగినది చెప్పమన్నాడు. జరిగినదంతా చెప్పింది. లక్ష్మణుని పంపించి, జలమును తెప్పించి దానినోట్లో పోశాడు. దాని ప్రాణం రాముని తొడపైనే పోయింది. అడిగినటువంటి దశరథునికి ఈ ప్రాప్తం చిక్కలేదు. అడగనటువంటి జటాయువుకు లభించింది (బృందావనంలో రామసుధా స్రవంతి పు52)