ప్రతి మానవుడు తన మనస్సునందు, మాటలందు, కర్మలందు పవిత్రతను కల్గియుండాలి. దీనినే ... అన్నారు. మానవత్వ మంటే ఏమిటి? హృదయము, వాక్కు, పని ఈ మూడింటి ఏకత్వము కావాలి. హృదయములో ఏది ఉద్భవిస్తున్నదో దాన్ని వాక్కులో చెప్పాలి. ఏది వాక్కులో చెప్పావో అది చేత్తో చేయాలి. ఈనాడు హృదయములో ఉద్భవించేది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, చేత్తో చేసేది మరొకటి.
మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనామ్
మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనామ్
మీరందరు మహాత్ములు కావాలి. మీకు మహత్తరమైన మానవ జన్మ లభించింది. ఈ జన్మ చాలా పవిత్రమైనది. “జంతూనాం నరజన్మ దుర్లభం’ అన్నారు. ఈ జన్మకున్న విలువ మరి దేనికీ లేదు. మానవ జన్మకున్న కీర్తి మరొక దానికి లేదు. మానవ జన్మకున్న స్థాయి మరొక దానికి లేదు.
(ద.స.1998 పు.60)