జీవరాసులు అన్నింటికినీ తమతమ బిడ్డలపై, తలిదండ్రుల పై, మిత్రుల పై, వస్తు వాహనాదులపై, తిండి తీర్థాదులపై, పరిపరివిధముల ప్రేమ ప్రవహించుచుండును. దీనిని పట్టి, తగిన నామములు నియమములగు చున్నవి. అన్నింటికిని భక్తి అని చెప్ప వీలు లేదు. అది సరయైనది కాదు. తమ ప్రేమ, తమ తమ బిడ్డలపై మరలినప్పుడు, అట్టి ప్రేమ వాత్సల్యమని పిలువబడును. అదే ప్రేమ దాయాదులపై తిరిగినపుడు, మోహమని పిలువబడును. అటులనే దీనులపై పడినపుడు కరుణ అనియు, సమామలపై చూపునపుడు మైత్రి అనియు, వస్తు వాహనముల పై పడినపుడు ఇచ్ఛ ఆనియు, వాంఛ అనియు అందురు. అయితే పూజనీయులయిన తల్లిదండ్రులపై, విద్యాగురువులైన ఆచార్యులపై ఈ ప్రేమ ప్రవహించిన, దానిని గౌరవమనియూ, వినయమనియూ, విధేయతనియూ అందురు.
కానీ ఒక భగవంతుని పై మాత్రము ప్రవహించిన ప్రేమయే భక్తి అని పిలువబడును.చాలా చీలికలుగ యేర్పడి, క్షీణించి యెందుకూ కొరకాక, అశాంతి, దుఃఖములకు చిక్కుకొని విలపించుటకంటే, యేక ముఖమున తనప్రేమ ప్రవాహమున భగవత్ అను గ్రహమమును సాగరమున చేరునట్లు చేయు సాధననే భక్తి అందురు. సంసార సాగరమున చేరి, నిస్సారమగుటకన్న, సర్వేశ్వరానుగ్రహ సాగరమును చేరి సార్థక మగుట, సచ్చిదానందమును పొందుట యెంత పవిత్రము! జన్మ ధన్యము : అదేఆనందము: ఈ విధమైన ప్రయత్నములతో సాధించి సంతసించినవారే గోపికలు, తరించినవారే గోపికలు. గోపికల యొక్క మనోవాక్కాయ కర్మలన్నియు సర్వకాల సర్వావస్థలయందునూ కృష్ణ చరణారవిందములందు, అర్పితము లగుచుండెడివి. కనుకనే గోపికలు యోగులని పిలువబడెను, కృష్ణపరమాత్మయే గోపికలను యోగులని పిలువవలెనన్న వారలది యెంతటి పవిత్ర హృదయమో యోచించుడు!
(గీ.పు.193/194)
ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము
ప్రేమ ప్రేమతో సంథింపనీయమగును
కాన ప్రేమను గట్టిగ కల్గియున్న
అద్వితీయము చెందగ వరుడగును
(స. సా. ఏ. 2001 పు. 111)
ప్రేమయే దివ్యత్వానికి మార్గం. ఏ పని చేసినా ప్రేమతో చేయాలి. ప్రేమ ఏమాత్రము తరిగేది కాదు, క్షణక్షణమునకూ పెరిగేదే. మీ ప్రేమను పదిమందికి పంచాలి. పంచే కొద్దీ ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. ఇది తరగనిది, అమృతం కంటే మధురమైనది. ప్రేమను వర్ణించడానికి భాష లేదు. "అనిర్వచనీయం ప్రేమ" అన్నాడు నారదుడు. నారదుడనగా కలహ ప్రియుడని అనుకుంటారు చాలమంది. చాల పొరపాటు. నారదుడు కలహ ప్రియుడు కాదు. అయితే, పూర్వం ఆవిధంగా ఉండేవాడు. కానీ తరువాత తన దోషాలను పరిహారం గావించుకొని గొప్ప బోధకుడుగా తయారయ్యాడు. జ్ఞాన బోధకుడు నారదుడు, అజ్ఞాన నాశకుడు నారదుడు. "యల్లబ్థో పుమాన్ ఇచ్చారామో భవతి తృప్తో భవతి మత్తో భవతి ఆత్మారామో భవతి", అంతా ఆ మధురమైనప్రేమలోనే ఉన్నది. ఒకానొక సమయంలో నారదుడు నారాయణుని వద్దకు వెళ్ళి "అమృతంకంటే మధురమైనది ఉన్నదా స్వామీ?" అని అడిగాడు. "ఓ పిచ్చివాడా! ప్రేమ అమృతంకంటే చాల మధురమైనది. అమృతమునైనా అధికంగా త్రాగితే కొంత వెగటు పుట్టవచ్చు గాని, ప్రేమనుఅనుభవించే కొలది ఆనందం అభివృద్ధి అవుతుంది" అన్నాడు నారాయణుడు. ఇలాంటి ప్రేమతత్య్వాన్ని మీయందుంచు కొని ఎందుకింత ఆశాంతిని పొందటం? ఎందుకిన్ని కష్టములను అనుభవించటం? నిజంగా కష్టములే లేవు మనకు. అంతా ఆనందమే, ఆనందమే. ఎప్పడీ ఆనందం లభ్యమవుతుంది? ప్రేమను అనుసరించి నప్పుడే ఆనందము లభిస్తుంది.
(స.సా..ఏ.99పు. 100/101)
ప్రేమ అనేది స్వార్థ రహితముగా యుండడము చేత దానికి ఏనాడు కూడా భయముండదు. అది నిరంతరము సత్యము కొరకు ఫైటు(fight) చేసేదిగా యుండాలి. ఇది నిరంతరము హృదయాన్ని ఆధారము చేసుకొనేటటు వంటిది దీనినే నేను అప్పుడు అప్పుడు చెప్పుతూ ఉంటాను.
Follow the master
Face the devil
Fight to the end
Finish the game.
ఈ విధముగా మనము జీవితాన్ని ఆర్పణ చేసినప్పుడే ప్రేమ తత్త్యాన్ని మనము చక్కగా అనుభవించిన వాళ్ళమౌతాము. ప్రేమ యిచ్చుకునేదే కాని, పుచ్చుకునేది కాదు.
(స సా.నం॥పు.314/315)
ప్రేమమయుండు శ్రీధరుడు ప్రేమయె అతని దివ్య రూపమౌ
ప్రేమయె సర్వ మానవుల ప్రీతికి తారక మంత్ర మట్టి
సత్ప్రేమరవంతయైన వివరింపగ లేక జగంబు నందు
తత్కామిత సత్పదార్థమెటు గాంచగ నేర్తురటయ్య మానవా!
(స సా.ప.3.1.99పు.301)
ఏ ప్రేమశక్తిచే ఈ ధారుణీ చక్ర
మిరుసు లేకుండగా తిరుగుచుండు
ఏ ప్రేమశక్తిచేనెల్ల నక్షత్రాలు
నేలరాలక మింట నిలిచియుండు
ఏప్రేమశక్తిచే ఈ పుడమి బడక
కడలిరాయడు కాళ్ళుముడుచుకొనియె
ఏ ప్రేమశక్తిచే ఈరేడు లోకాలు
గాలిదేవుడు సురిటీలు విసరె
ఆ మహా ప్రేమశక్తియే ఆత్మశ క్తి
అద్భుతమనంత మద్వితీయమగుశక్తి
నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల
ఈ మహాసృష్టియంతయు ప్రేమమయమె
(స. సా .ఆ.2000 పు. 225)
ప్రేమను, భగవత్తత్వాన్ని పరిపూర్ణంగా విశ్వసించాలి. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. ఈ ప్రేమ లోనే మనం జీవించాలి. పరమాత్మ ప్రేమ పరిశుద్ధమైనది, స్వార్థరహితమైనది. దీనినే ప్రాచీన మహర్షులు"నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, నిర్మల స్వరూపిణమ్" అని వర్ణించారు.
ప్రేమ దూరస్థాన్ని కూడా సమీపానికి చేరుస్తుంది. వియోగమును సంయోగముగా మారుస్తుంది. నరుని నారాయణునిగా మారుస్తుంది.
(దే.యే.పు.6)
ప్రేమస్వరూపులారా: మీరు ముఖ్యంగా పెంచుకోవలసింది ప్రేమ ఒక్కటి ఉంటే ద్వేషానికి అవకాశమే ఉండదు. ఆనాడు గోపికలు కూడా చెప్పారు.
ప్రేమరహిత మరుభూములలో
ప్రేమాంకురములు పెంపొంద
ప్రేమావేశముతో
ప్రేమసుధా వర్షము వర్షింపగ
ప్రేమనదులు ప్రవహింపగ
మురళీ గానము సేయగదే!
కృష్ణా! గానము సేయగదే!
ప్రేమరహిరమైన హృదయం క్షేత్రాలలో మీరు ప్రేమ బీజమును నాటాలి.దానికి ప్రేమజలమును పోయాలి. ప్రేమవర్షమును కురిపించాలి. ప్రేమ ప్రవాహమును ప్రవహింపజేయాలి. మీ ప్రేమను అందరికీ పంచాలి. ఈ నూతన సంవత్సరంలో మీరు చేయవలసిందేమిటంటే - నిర్మలమైన నిశ్చలమైన, నిస్స్వార్థమైన ప్రేమనుపెంచుకోవాలి. మీరు మీ ప్రేమను లౌకికమైన విషయాలలో ప్రవేశపెట్టడం చేతనే అనేక చిక్కులకు గురి అవుతున్నారు. ప్రేమ ఇస్తుంది, క్షమిస్తుంది; స్వార్థం స్వీకరిస్తుంది, మరచిపోతుంది. కనుక, స్వార్టపూరితమైన ప్రేమ (Selfish love) మనకు వద్దు. Selfish love (స్వార్థపూరితమైనప్రేమ fish(చేప) యొక్క దుర్గంధమువలె భరించడానికి వీలుకానిది. కనుక, Selfless love (నిస్స్వార్థ ప్రేమ) ను పెంచుకోవాలి. అందరినీ ప్రేమించాలి. ఎవరేమనుకున్నా మీరు వెరువనక్క ర్లేదు. మీ ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి, చాలు. అప్పుడు జగత్తంతా పవిత్రమవుతుంది.
(స. సా. జ .2000 పు.6/7)
స్వార్థ ప్రేమ, అన్యోన్య ప్రేమ, పరార్థ ప్రేమ అని మూడు విధములుగా ప్రేమ మనకు గోచరిస్తున్నది. ఎవరేమై పోయినా, ఫరవాలేదు, నేను మాత్రం క్షేమంగా ఉండాలని ఆశించడం స్వార్థ ప్రేమ. తనతోపాటు తన బంధు మిత్రులు కూడా క్షేమంగా ఉండాలని ఆశించడం అన్యోన్యప్రేమ, ఇంక "లోకాస్స మస్తాస్సుఖినో భవంతు" అందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించడం పరార్థ ప్రేమ. స్వార్థ ప్రేమ అనేది ఒక గదిలో వేసిన బల్బు వంటిది. ఆ బల్బునుండి వచ్చే వెలుతురు ఆ గదికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అన్యోన్య ప్రేమ చంద్రకాంతి (Moon Light) వంటిది. ఇది అన్ని వైపులా కూడా ప్రసరిస్తుంటుంది కాని అంత స్పష్టంగా ఉండదు. ఇందులో కొంత సందేహానికి కూడా అవకాశ ముంటుంది. వెన్నెలలో త్రాడును పాముగాను, మొద్దు చెట్టును మనిషిగాను భ్రమించడం జరుగుతుంది కదా! అదే విధంగా అన్యోన్య ప్రేమలో మంచిని చెడ్డగా, చెడ్డను మంచిగా భావించడం జరుగుతుంది. చెడ్డవారి మాటలు అతి తీయగా ఉంటాయి. మంచి వారి మాటలు కొంత కఠినంగా అనిపిస్తాయి. నిర్మల, నిశ్చల, నిస్వార్ధమైన దైవత్వం పైన కూడా సందేహాన్ని కలిగిస్తుంది. ఈ అన్యోన్య ప్రేమ. ఇంక పరార్థ ప్రేమ అనేది సూర్యకాంతి వంటిది. ఇందులో ప్రతి ఒక్కటి మనకు సుస్పష్టంగా గోచరిస్తుంది. ఇది అందరికీ సుక్షేమాన్ని చేకూర్చుతుంది.
(శ్రీ భ.ఉ.పు.213)
మానవుని హృదయము సింగిల్ చైర్ not double sofa, not musical chair. కనుక హృదయములో ప్రేమ ఒక్కటి ఉంటే ఏ పిచ్చి భావాలూ అందులో ప్రవేశించవు. ప్రేమలో - సర్వమూ లీనమై ఉన్నది. అన్నింటికీ ప్రాణసమానమైనదిప్రేమతత్వము. ఇలాంటి ప్రేమను మర్చిపోయి లౌకికమైన ప్రేమను పెంచుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఇదంతా కేవలం ప్రాకృతమైన ప్రేమ. తల్లి ప్రేమను వాత్సల్యమంటున్నారు. భార్య ప్రేమను మోహమంటున్నారు. బంధు ప్రేమను అనురాగమంటున్నారు. పదార్థ ప్రేమను ఇచ్ఛ అంటున్నారు. కేవలం భగవంతుని ప్రేమను మాత్రమేప్రేమ అన్నారు. మరి దేనికి ప్రేమ అనే పదం ఉపయోగించటం లేదు. ప్రేమ అనే పదమును ఒక్క దైవస్వరూపానికి తప్ప మరొక దానికి ఉపయోగించు కోటానికి అధికారమే లేదు.
ప్రేమ రెండక్షరముల పదము. ఈ రెండక్షరములే సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. వాల్మీకి నూరుకోట్ల రామాయణ శ్లోకాలు వ్రాసాడు. ఈ రామాయణము వలన మానవత్వము సార్థక మవుతుందని, దీనిని ఎవరు చదువుతారో, ఎవరు స్మరిస్తారో, ఎవరు జపిస్తారో, ఎవరు ధ్యానము చేస్తారో అట్టివారికి జన్మరాహిత్యమవుతుందని అన్నాడు. ఈ వార్త విన్నంతనే దేవతలు, రాక్షసులు, మానవులు ముగ్గురూ బ్రహ్మ చెంతకు వెళ్ళి, “స్వామి!మాకు రామాయణములో భాగము ఇవ్వమ"న్నారు. బ్రహ్మ చెప్పాడు. నాకు ఎవరిపైనా పక్షపాతం లేదు. నాకు అందరూ సమానులే. కనుక నూరుకోట్ల శ్లోకములను మూడు లోకములకూ సమానంగా పంచి పెడతానన్నాడు. అందరూ చాలా సంతోషించారు. భేద రహితుడైనవాడు బ్రహ్మ, వాంఛారహితుడైనవాడు బ్రహ్మ. అతడు రామాయణాన్ని మూడు భాగములు చేసి ఒక్కొక్క లోకానికి 33, 33,33, 333 శ్లోకాలను పంచాడు. ఒక్క శ్లోకం మిగిలింది. ఈ శ్లోకాన్ని ఎట్లా పంచేది? ఈ శ్లోకములో ఎన్ని అక్షరాలున్నాయి? అని విచారించాడు. శ్లోకములో 32 అక్షరాలున్నాయి. దేవతలకు పది అక్షరములు, మానవులకు పది అక్షరములు, రాక్షసులకుపది అక్షరములు ఇచ్చాడు. ఇంక రెండక్షరాలు మిగిలాయి. అప్పుడు చెప్పాడు. నాయనా! ఈ రెండక్షరములే రాము, కృష్ణ, సాయి, శివ, హరి, బాబా అనే దివ్య నామములు. వీటిని నిరంతరము స్మరించుకోండి." అన్నాడు అన్నింటికి మూలాధారమైన తత్వము ప్రేమయే. ఇది ఒక్కటే ప్రతి హృదయమందు పర్మనెంటుగా ఉండేది. మిగిలిన వన్నీ మార్పు చెందేవే. భగవంతుడు "మమైవాంశో జీవలోకే" అన్నాడు. “మీరందరు నా అంశమే" అన్నాడు. దీనిని మనస్ఫూర్తిగా విశ్వసించాలి, అనుసరించాలి. ప్రేమచేతనే మనం జగత్తును శాంత పరచాలి; విశ్వాన్ని ధర్మమయంగా మార్చాలి: అహింసను పాటించాలి.
(ద.య.స.98 పు. 92/93)
ప్రేమను యుండు శ్రీధరుండు ప్రేమయే ఆతని దివ్యరూపము
ప్రేమయే సర్వభూతముల ప్రీతిగ తారకమంత్రము,
తత్ప్రేమ రవంతయైన, వివరింపగలేక జగంబునందున
త్కామిత సత్పదార్థము ఎటు కాంచక పోవుదురయ్య (నేర్తురటయ్య) మానవా||
(సా.పు.17)
ప్రేమయందే పుట్టెను సౌఖ్యంబు
సత్య త్యాగ శాంతులబ్బు
ప్రేమలేక యున్న లేదయా|
సత్యమైన బాట సాయి మాట||
((సా. పు. 422)
ప్రేమను ఎట్లా పెంచుకోవటం? దీనికి రెండు పద్ధతులు. 1.ఇతరులలో యున్న తప్పులు - ఎంత పెద్దవి అయినా వాటిని విస్మరించరు. 2. నీతప్పులు ఎంత చిన్నవైనను అతి పెద్దవిగా ఎంచి, పశ్చాత్తాపపడుము. నీవు ఏపనిచేసినా అదంతా భగవంతుడు చూస్తాడు. వింటాడు. తెలుసుకుంటాడు.
(సా.పు.430)
నీ హృదయాన్ని ప్రేమతో నింపుకో. అది అందరికి పంచు. పంచిన కొద్ది ప్రేమ పెరుగుతుంది. నీ హృదయం అప్పుడుప్రేమతో నిండుగానే యుంటుంది. భగవంతుడు అక్కడనే యున్నాడు. ప్రేమ స్వరూపుడు ఇప్పుడు నీవు భగవంతుని ఇతరులలో అనుభవిస్తున్నాడు అంతే.
( సా.పు,579)
పలువిధ సంపదలు ఆస్తులు, అధికారాలు, పేరు, ప్రఖ్యాతులు అంత విలువైనవికావు. ప్రేమ అనే అమూల్యమైన ఐశ్వర్యం మానవుని జీవితంలో సర్వస్వం.ప్రేమ శూన్యమైన హృదయం నిడాంధకారమైన శిధిల మందిరం. అందులో దుశ్చింతలనే గబ్బిలములు నివసించును. అశాంతి అను దుర్వాసనకు అది ఆలవాలము. ప్రేమ యను జ్యోతి హృదయము నిండెనా దుశ్చింతలు మాయమై కాంతి నెలకొనును.
( సా పు.651/652)
ప్రేమ+కోరిక = సత్యము
ప్రేమ+కర్మ = ధర్మము
ప్రేమ+భావన = కాంతి
ప్రేమ+ అర్థము చేసికొనుట = అహింస
(సా.పు.604)
ప్రేమ అంటే ఏమిటి? "త్రికాల భాధ్యం ప్రేమ" Past Present Future లో కూడా మార్పు చెందనటువంటిదిప్రేమ. కనుక, అట్టి ప్రేమ ఒక్క భగవంతునికి, భక్తునికి మధ్యనున్నటువంటి సంబంధమే కాని వీరందరికీ ఉన్న సంబంధమును ప్రేమ అని చెప్పకూడదు. కనుక క్షణములో పెరిగి క్షణములో తరిగేటటువంటిది ప్రేమకాదు. ఎప్పటికీ స్థిరమైనటువంటిదిగా ఉండేటటువంటి ప్రేమ. అదియే భగవంతుడు, అదియే Love is God Live in Love. ఇలాంటి ప్రేమ తత్త్వమును మనం సరియైనటువంటి మార్గములో ప్రవేస పెట్టుకోవాలి.
(శ్రీ.పి.1955.పు.26)
ప్రేమ ఉన్నచోటు అసూయద్వేషాలకు అవకాశం లేదు. మానవ హృదయం "సింగిల్ చైర్" వంటిది. ఇందులో ఇద్దరు కుర్చోవడానికి వీల్లేదు. ఈ హృదయంలో ప్రేమ కూర్చున్నప్పుడు ఇంక ఇతర గుణములు. ఇందులోప్రవేశించుటకు వీలుకాదు. ఇట్టి హృదయాన్ని మానవుడు "మ్యూజికల్ చైర్ గా మార్చుకుంటున్నాడు. అనగా హృదయంలో ఈనాడు ఒక స్వామి రూపు మరొక స్వామి కొన్నాళ్ళ తరువాత ఇంకొకస్వామి, ఈనాడు ఒక జపము, రేపు ఇంకొక జపము ఈ విధంగా మార్చుకుంటున్నాడు. హృదయం నిండుకు ప్రేమ ఉన్నది. కాని దానిని వదలుకుంటున్నాడు, దాహము తీర్చే గంగా ప్రవాహము ప్రక్కనే ఉండగా దానిని వదిలి పెట్టి మంచు బిందువులను ఆశించినట్లుగా, తన యందే ఉన్న ప్రేమను విస్మరించి లౌకిక విషయాలకై ఆరాటపడు తున్నాడు. దైవానికి అర్పితమైన హృదయానికి అశాంతిగాని, అననుకూలముగాని, దుఃఖముగాని ఎన్నటికి ప్రాప్తించవు.
(స.పా.డి.96పు.31)
సకల శాస్త్రపురాణ సంగ్రహవేత్తయై వేదాంత వేద్యుడే విబుద్ధుడైన
రక్తి ఏపారగ రమ్యహర్మ్యంబుల రమియించు రాజు చంద్రముడైన
రణరగమందు పరాభూతరిపుడౌచు వెల్గొందు జగదేకవీరుడైన
దారిద్ర్యదేవతా దాక్షిణ్యమున కుందు దౌర్భాగ్య విభుడగు దాసుడైన
ప్రేమలేనిచో ఎందుకు పనికి రాడు
ప్రేమరహిరుడగు జగద్భర్తకన్న
ప్రేమ పరుడగు దాసుడే వంద్యుడగును
ఇంత కన్నను వేఱేద్ది ఎఱుకపరతు?
ప్రాచీన ఋషులకు పాఠముల్ నేర్పించ జాలిన వేదాంతసారమతులు
నిర్జీవ శిలలచే నృత్యమాడించంగ నేర్పు గల్గిన కళానిపుణమతులు
పరవీర శిరములు బంతులాడించుచు క్రీడింప గల్గినవాడి మగలు
సర్వసర్యం సహా చక్రపాలన చేసినడిపించ గల్గిన నాయకులును
కలరు భారత భువిని పెక్కండ్రు
ఉండి ఫలమేమి వారిలో నొక్కరైన
అనుదినంబునువినిపించుఆర్తరవము
ఆలకింప దలంపరో యార్యులార|
ప్రేమరూపము బ్రహ్మంబు ప్రేమమయము
ప్రేమను ప్రేమతో సంధింప నిమమగును
కాన ప్రేమను గట్టిగా కలిగియున్న
అద్వితీయము నొందంగ అర్హుడగును.
జగత్తంతయు ప్రేమచేతనే నిండి యున్నది. ప్రేమ పైననే ఆధారపడి యున్నది. ప్రేమయేధనము, ప్రేమయే ధర్మముప్రేమయే సత్యము. ఇట్టి ప్రేమ తత్వాన్ని మానవుడు గుర్తించుకోలేక క్షణికమైన విషయాల కోసం ప్రాకులాడు తున్నాడు. కారణమేమిటి? స్వార్థము పెరిగినది పరార్థము తరిగినది. విశాలభావములు తరిగినవి. ఆశలు పెరిగినవి. ఆశయాలు తరిగినవి. సంకుచిత భావములు పెరిగినవి, ప్రాచీన మహర్షులు త్యాగమునకు పట్టము కట్టారు. ధర్మమును అందలమెక్కించారు. సత్యమునకు స్వాగతం పలికారు. ఈనాడు. ఇట్టి దివ్యమైన భావములను మానవుడు విస్మరించాడు. కనుకనే ఈ జగత్తు అనుదినము అనేక అవస్థలతో క్రుంగి కృళ్ళీ కృశించి పోతున్నది.
ప్రేమలేని హృదయం ప్రేత భూమితో సమానం. పవిత్రమైన దివ్యత్వాన్ని నిరూపించేది. ప్రేమ ఒక్కటే. కనుక ప్రతి మానవుడు హృదయంలో ప్రేమను నింపుకోవాలి. "అనిర్వచనీయం ప్రేమ" అని నారదుడు వర్ణించాడు.ఈ ప్రేమ జపతపధ్యానములవల్ల గాని వేదశాస్త్ర ఇతిహాసపురాణముల వల్లగాని లభించేది కాదు. కాని అనేకమంది ప్రేమను పొందే నిమిత్తమై జపధ్యానములు చేస్తున్నారు. యోగము నభ్యసిస్తున్నారు. గ్రంధములను పఠిస్తున్నారు. పారాయణములు చేస్తున్నారు. ఇవన్నీ శరీరం పై ధరించే నగలవంటివే కాని ఆత్మ స్వరూపాన్ని నిరూపించే మార్గములుకావు. పాండిత్యము ఒక నగ వంటిది, పారాయణము ఒక నగ వంటిది. ఇవన్నీ బాహ్యమైన అందమును మాత్రమే అందిస్తున్నాయికానిఅంతర్ ఆనందమును చేకూర్చవు. అంతర్ ఆనందమును పొందడానికి ప్రేమయే ప్రధాన సూత్రము.
(స.సా.డి..96పు.309/310)
జీవితాన్ని ప్రేమమయంగా మార్చుకోండి. ప్రేమమయ జీవితంలో పొందలేని సుఖం లేదు. సర్వసంపదలూ, సర్వాధికారములు ప్రేమచేతనే ప్రాప్తిస్తాయి. సర్వవిజయములుప్రేమనే వరిస్తాయి. అయితే, ఈ ప్రేమ ఏ విధంగా ఉండాలి? సర్వార్పిత భావంతో కూడినదిగా ఉండాలి. సర్వార్పిత భావంతో భగవంతున్ని ప్రార్థించాలి. -
(స.సా.డి.96 పు.310)
మీరు నిజంగా దైవాన్ని ఆశిస్తున్నట్లయితే ప్రేమను ఆశ్రయించండి. మీ తాపమును, మీ పాపమును రెండింటిని చల్లార్చేది ప్రేమనే. ఈ లోకసంబంధమైన బాధలచేత కష్టముల చేత మీరు నిరాశా నిస్పృహలకు గురియై ఉంటున్నారు. నిర్విరామకృషిచే, నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలు, అర్థంకాని ఆవేదనలచే, కృశించిపోతున్న మానవుని దాహం తీర్చేది.ప్రేమ ఒక్కటే. భగవంతుని ప్రేమ ఒక లైటు హౌసు వంటిది. మీకు మార్గం చూపించేది అదే. సంసార సాగరం లో ఎన్ని బాధలు కల్గినప్పటికీ మీ జీవితమనే పడవనుప్రేమవైపే ప్రయాణం చేయించండి. తప్పక మీరు గమ్యాన్ని చేరుతారు. విజయాన్ని పొందుతారు. ధన్యులవుతారు.
(స.సా.డి.96పు. 314)
నిష్కళంకపు ప్రేమను నిలిపి హృదిని
సకల జీవుల కుపకృతి సలుపకున్న
పుట్టి ఫలమేమి నరుడుగా పుడమియందు
ఇంతకన్నను వేరెద్ది యెఱుక పఱతు?
(భగవాన్ శ్రీ సత్యసాయివాణి ద్వితీయ భాగం పు 33)
"ప్రేమ ఆలోచనను ప్రభావితము చేసినప్పుడు సత్యము వెల్లడవుతుంది;
ప్రేమ, కార్యరూపము దాల్చినప్పుడు ధర్మ ప్రవర్తనగా మారుతుంది;
ప్రేమ, భావముతో పరిపుష్టమైనప్పుడు శాంతిగా రూపొందుతుంది;
క్రోధము, అసూయ, దురాశ మరియు ద్వేషము
తొలగింపబడినప్పుడు ప్రేమ అవగాహనగా
రూపొంది, అహింస రాజ్యమేలుతుంది”.
(పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు279)
ప్రేమకు రూపములేదని చెపుతారు . కాని , అది సరికాదు ప్రేమకు రూపమున్నది అది మాతృ మూర్తి రూపములో ఉన్నది (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు285)