భక్తి

"భక్తిరేవ పరమార్థదాయిని

భక్తిరేవ భవరోగనాశిని

భక్తిరేవ పరమార్థదాయిని

భక్తిరేవ పరమోక్షకారిణి"

 

ప్రేమస్వరూపులైన విద్యార్థినీ, విద్యార్ధులారా!

ప్రాచీన కాలము నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్త్య ప్రభావములో, యావత్ ప్రపంచమునకూ భక్తిని చాటుతూ వచ్చింది. భక్తి అనగా కేవలము జపము, ధ్యానము, పూజలు, పురస్కారములు - ఇత్యాది అంతములు కావు. భగవంతుని పై గల ప్రేమయే భక్తి . కర్మఫల సంసర్గముచేత కలుషితము కానటువంటి యొక్క నిశ్చల, నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమనే భక్తి.. ఇట్టి ప్రేమకు ఎట్టి నిబంధనలూలేవు. ఎట్టి హద్దులు లేవు. మానవుని నుండి ఆవిర్భవించినటువంటి నిజమైనటువంటి ప్రేమతత్త్వమే ఈ భక్తి, వాంఛలతో కూడినటువంటి ప్రేమ భక్తికానేరదు. అయితే భగవత్ వాంఛలు తప్ప. ప్రాకృతమైన వాంఛలు ఉండరాదు. అప్పుడు భక్తుల హృదయము నుండి ఆవిర్భవించేటటువంటి ప్రేమతత్త్వము సరాసరి దైవమునకే చెందుతుంది. కష్టసుఖములయందుగాని, ఆనంద దుఃఖముల యందుగాని. ఇది ఏ మాత్రమూ మార్పు చెంద కూడదు. ఈ విధముగా ఏకాత్మభావంలో సాధించినవాడు పాండవ అగ్రజుడైన ధర్మజుడు.

 

భక్తి అనేది నవవిధమారముల ద్వారాను, ఆరాధనల చేతనూ, ఆనంద భజనచేతనూ నిరూపించేటటువంటిది కాదు. హృదయమానస సరోవరము నుండి ఆవిర్భవించే టటువంటి ప్రేమజలమే భక్తి. కనుకనే వేదమునందు "పత్రం అనగా ఆకులలములుకావు. దేహమే ఒక పత్రం.ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో? ఎప్పుడు కూలుతుందో? ఎప్పుడు కాలుతుందో? వేసవి వచ్చేటప్పటికీ ఏ విధంగా ఆకులు రాలిపోతుంటాయో, అదే విధంగా కాలం గడిచేటప్పటికీ దేహం కూడా రాలిపోతుంది. కనుక హే భగవాన్ ఈ దేహమనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను. నీవు యిచ్చిన దేహమునే నీకు పత్రముగా సమర్పించుకుంటున్నాను. ఇక "పుష్పం . ఏమిటి ఈ పుష్పం. హృదయ పుష్పం. జాజి, మల్లె పుష్పములు కావు. అవన్నీ సాయంత్రానికి వాడిపోయేవే. వాడనటువంటిది నా హృదయ పుష్పము మాత్రమే. అది పరిశుద్ధమైనటువంటిది. పరిపూర్ణమై నటువంటిది. ప్రేమతో కూడినటువంటిది, కనుక నా హృదయ పుష్పమును నీకు సమర్పించుకుంటున్నాను.ఇకఫలంనీకు ఏ ఫలం కావాలి? జామ, యాపిల్, ఫలములా? ఫలములన్నీ ప్రాకృతమైనవే. నా మనసే నిజమైన ఫలము. ఆ ఫలమును నీకు అర్పిస్తున్నాను. అనగా నా మనసును నీకు అర్పిస్తున్నాను. ఇక తోయం . తోయం అంటే పంపు నీరు. బావినీరు, నది నీరుకాదు. నిన్ను చింతిస్తూ నీ యొక్క లీలలు ఆనందిస్తూ, ప్రేమతత్త్వాన్ని అనుభవిస్తూ కార్చే కంటిధారలే ఆనందభాష్పాలు. ఇట్టి ఆనందభాష్పములే నిజమైన తోయం . ఇటువంటివే భక్తులు, భగవంతునికి సమర్పించాలి. భగవంతుడు కూడా ఆశించేది అదే. అంతేగాని క్షణభంగురమైన పత్రపుష్పఫలములు కాదు. ఒక పర్యాయం సత్యభామ భౌతికమైన ధనకనక వస్తువాహనాదులతో కృష్ణుని తూచడానికి ప్రయత్నించింది. భగవంతుడు వీటికి తూగుతాడా? తూగలేదు. ప్రేమకు మాత్రమే తూగుతాడు. రుక్మిణి వచ్చింది. కృష్ణా! అంటూ ఒక తులసిదళం వేసింది. కృష్ణనామములో కృష్ణుని తూచింది. తులసీదళం ఎక్కవ బరువైంది. కనుక భక్తికి చిక్కుతాడు కాని భగవంతుడు, ధనమునకు కాదు. భక్తికంటే మించిన వస్తువు ఈ జగత్తులో మరొకటి లేదు. కనుకనే భారతదేశంలో ప్రాచీనకాలము నుండి భక్తికిప్రధానమైన స్థానం యివ్వబడింది. భక్తికి మించిన ధనం మరొకటిలేదు. భక్తికి సమానమైన తూకం మరొకటిలేదు.

(శ్రీ. సె.2000పు.20/21)

 

భక్తి ! భక్తి! భక్తి! మొట్టమొదట ఈ భక్తి అనేది యేమిటో భక్తి స్వరూప స్వభావాలు యేమిటో గుర్తించటానికి ప్రయత్నించాలి. భగవంతునిపై గల అనురిక్తియే భక్తి. భగవంతునిపై గల అనురక్తి భక్తియని చెప్పుకోవటం ఒక పెద్ద వాక్యములాగా వుంటుంటాది. భగవంతుని యందుండే కారమనే జీవనశక్తిని, అనురక్తియందున్న క్తి అనే జీవశక్తిని జేర్చి భక్తియని సులభముగా చెప్పినారు.ఈ భక్తిని మాత్రమే పోషించుకుంటూ పోయినప్పుడు, శక్తిరక్తి, ముక్తి అనురక్తి అన్నీ మనకు ప్రాప్తిస్తూ వుంటాయి. మానవునికి అనురక్తి అనేది ప్రాణము వంటిది. యాజ్ఞవల్క్యుడు చెప్పినట్టుగా ఎవరు ఎవరిని ప్రేమించినప్పటికినీ తన నిమిత్తము ప్రేమిస్తున్నాడే గాని పరుల నిమిత్తము కాదు అనే సత్యము అర్థమవుతుంది.

(శ్రీ.గీ.పు.37)

 

ఒకానొక సమయంలో రాముని తల్లియైన కౌసల్యవద్దకు హనుమంతుని తల్లి వచ్చింది. కొంత సేపటికి అగస్త్యుని తల్లి కూడా వచ్చింది. "అమ్మా! ఎవరు మీరు? ఎందుకోసం వచ్చారు?" అని ప్రశ్నించింది కౌసల్య. మొదటి వ్యక్తి అమ్మా! నేను హనుమంతుని తల్లిని నా కుమారుడు పెద్ద సముద్రాన్ని దాటి భయంకరమైన లంకలో ప్రవేశించి అనేక మంది రాక్షసులను సంహరించాడు" అన్నది. రెండవ వ్యక్తి "అమ్మా! నేను అగస్త్యుని తల్లిని. నా కుమారుడు సముద్రాన్నంతా ఒక్క గుటకలో మ్రింగి గొప్ప కీర్తి గడించాడు" అన్నది. అప్పుడు కౌసల్య నవ్వి “నా కుమారుడైన శ్రీరాముని మహిమవల్లనే కదా. మీ కుమారులు ఈ మహత్కార్యములు చేయగల్గారు" అన్నది. సరిగ్గా ఆ సమాయానికి రాముడు ప్రవేశించి “అమ్మా! ఏమి చెపుతున్నావు? హనుమంతుడు మహాభక్తుడు, శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు. అగస్త్యుడు కూడా మహాభక్తుడే. వారు తమ భక్తిప్రపత్తులచేతవే ఈ మహత్కార్యములను సాధించగల్గారు. ఇందులో నా గొప్పతనమేమీ లేదు" అన్నాడు.

(స సా.న.99పు.322)

 

భక్తి యనగా తన ధ్యేయవస్తువులో చిత్త వృత్తి తదాకారము చెందుటే సరియైన భక్తికాగలదు. ఇంద్రియద్వారము లన్నింటిని సంయమము చేసి మనసును హృదయ స్థానమున నిరోధించి ప్రాణమును శీర్షస్థానమున స్థాపించి ఆత్మ సంబంధమగు యోగధారణను అవలంబించినవాడై ప్రాణ ప్రయాణ సమయమున ఓం అను బ్రహ్మమును ఉచ్ఛరిస్తూ శరీరమును వదలిన అట్టివాడు నన్ను చేరును. చిత్తవృత్తి తదాకారము పొందును" అని కృష్ణుడు అన్నాడు.

(గీ. పు. 144)

 

కోటిపూసల కొక్క కొల్కిపల్కే గానీ

నీటుమాటల కోటి నేరడి తడు

చచ్చిపుట్టుట మాన్పు చదువు వచ్చునేగానీ

చచ్చు విద్యలు రావు సాయికెపుడు

మనసిచ్చికొను ప్రేమ మాటలాడునే గానీ

సాయి వుపన్యాసమీయలేడు

తన యదార్ధత తాను తప్పక చనుగాని

యెదటి తప్పుల బాబయెన్నలేడు.

కల్లకపటాలు తెలియని పిల్లవాడు

ఎల్లజీవుల తనవలె యెంచువాడు

ఇట్టిమురీశు జన్మించినాడు

పట్టుపడినాడు భక్తికి బాబగాను

(ఆ.శ.నా.పు 131/132)

 

భక్తియనగా త్రిమూర్తి స్వరూపాన్ని, త్రిగుణముల యొక్క పరిపూర్ణమును పవిత్రమైన మార్గమున ప్రవేశ పెట్టి దివ్యత్వముతో సన్నిహిత సంబంధ బాంధవ్యమును కలిగించు కొనుటయే, త్రికరణ శుద్ధితో భగవంతుని స్నేహమును అభివృద్ధి పరచుకొనుటయే భక్తి.. భక్తి మూడు విధములు 1. సామాన్య బేధ భక్తి 2. అనన్య భక్తి, 3. ఏకాంత భక్తి.

 

.సామన్య బేధ భక్తి: అనగా శ్రవణం, కీర్తనం విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం.

1. శ్రవణం: తన శరీరము, ఇల్లు మరచి, మృత్యువును ముందుంచుకొని ఏడు దినములు ఏకాగ్రతలో భగవత్ చింతన సలిపినటువంటివాడు పరీక్షిత్ మహారాజు. తాను రాజై ఉండినప్పటికీ, దివ్యమైన తత్త్వాన్ని పొందే నిమిత్తమైదైవత్వాన్ని ఆనందించే నిమిత్తమై, ఏకాగ్రచిత్తుడై ఏడు రోజులు శ్రవణము గావించినవాడు. శ్రవణము చేసినదానిని, మననము చేసి, ఆచరణలో పెట్టి చూపించిన వ్యక్తి పరీక్షిత్ మహారాజు,ఈ మూడింటి ఏకత్వమే దివ్యత్వం పొందుటకు రాజమార్గము.

2. కీర్తనం: సర్వకాల సర్వావస్థల యందు భగవన్నామ సంకీర్తన సలిపి యావత్ ప్రపంచమునకే దివ్యమైన వాతావరణమును కల్పించిన వ్యక్తి బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు.

3.విష్ణు స్మరణం: నిరంతరము భగవంతుని చింతన గావించినటువంటి పరమభక్తుడు ప్రహ్లాదుడు. ఎన్ని విధాల హింసలు పెట్టినప్పటికినీ, పరమ భక్తుడైన ప్రహ్లాదుడు. కన్నీరు కార్చక, దైవనామస్మరణ చేసినవాడు ప్రహ్లాదుడు, జగత్తునకు నామచింతన మాత్రమే సార్ధకత చేకూర్చు మార్గమని బోధించినవాడు.

4. పాద సేవనం: సమస్త ఐశ్వర్యములు కలిగి, సమస్తభోగభాగ్యములకు నిలయమైనటువంటి, సకలైశ్వర్య స్వరూపిణియైన లక్ష్మి. “సిరి ప్రధానముకాదు, హరి పాద సేవనమే ప్రధాన "మని లోకమునకు చాటి, నిరంతరము హరి పాదసేవయందే తన జీవితమును అంకితము గావించుకొన్నది.ఈనాటి భక్తులు సిరి భక్తులుగా రూపొందుతున్నారే కానీ, హరి భక్తులుగా అభివృద్ధి కావటము లేదు. హరిపాదసేవనం చేత సిరికూడా లభ్యమవుతుందనే సత్యాన్ని గుర్తించుకోలేరు. సిరిని ఆశ్రయించి, హరిని విస్మరించి దివ్యత్వమునకు దూరము కావడము మానవుని యొక్క సహజము కాదని నిరూపించినది లక్ష్మి,

5.వందనం: నమస్కారమే సర్వస్వమునకు ఆస్కారమనేభావములతో అనగా అహంకారమును వదలి, దివ్యత్వములో లీనమై, సర్వస్వము అర్పితము గావించటము. దశేంద్రియములను భగవంతునికి హృదయ పూర్వకముగా అంకితము గావించటము, శరణాగతి స్థితి పొందటము అనే భావములను చాటించుతూ వచ్చాడు అక్రూరుడు.

6. అర్చనం: పృథు చక్రవర్తి షోడశోపచారముల చేత దైవత్వాన్ని ప్రసన్నము గావించుకొని, తన మనోభీష్టములను నెరవేర్చుకొన్నటువంటి వ్యక్తి. ఈ అర్చనములో అంగార్చన ప్రధానమని చాటుతూ వచ్చాడు. "నేత్రకమలం సమర్పయామి. శ్రోత్రకమలం సమర్పయామి, హస్తకమలం సమర్పయామి, హృదయం కమలం సమర్పయామి", అనగా హృదయము, హస్తములుమొదలగు ఇంద్రియములను కమలములతో పోల్చి భగవంతునికి అర్పితము గావించుకుంటూ వచ్చాడు. కానీ కలి ప్రభావము వల్ల నేత్ర కమలం సమర్పయామి"అని చెప్పటం, పుష్పము వేయటం జరుగుతుంది. దృష్టిని అభివృద్ధి పరచుకోవటము లేదు.మన దృష్టిని దైవ దృష్టిగా పెట్టవలెనే కానీ అన్యకార్యములకు ప్రయోగింప రాదు. ఈ రీతిగానే దైవ నామస్మరణ పరోపకార విషయములందు, పవిత్ర కార్యములందు తప్ప, మరో విషయములలో చెవులు దుర్వినియోగము చేయరాదు. ఇట్టి పవిత్రమైన అంగపూజయందు అర్పితము గావించుకొని, జగత్తునకు అర్చనం ప్రధాన మార్గమని ప్రబోధించినవాడు పృథు చక్రవర్తి.

7.దాస్యం:హమమంతుడు మహాబలవంతుడు, గొప్ప గుణవంతుడు అహంకార రహితుడు, నిరంతరము తాను రామ దాసుడనని వినయ విధేయతలను ప్రకటించిన వ్యక్తి. రామ సేవ తప్ప అన్య సేవలు ఆశ్రయించేటటువంటి వాడు కాడు. సేవా భావములో హనుమంతుని మించినవారు జగత్తులో కానరారు.

8. స్నేహం: నిరంతరము కృష్ణ స్నేహము తప్ప అన్య స్నేహము కోరినటువంటివాడు కాడు అర్జునుడు.స్నేహమనగా ప్రేమ అని మరొక అర్థము. కృష్ణుణ్ణేప్రేమించినటువంటివాడు కనుక సమస్త శక్తులను సాధించినటువంటి వ్యక్తి, పరమ భక్తుడు, మహావీరుడు, శూరుడు, చిత్తశుద్ధి కలిగినవాడు, నిర్మల హృదయుడు. భగవంతుని సన్నిదే పెన్నిధిగా మార్చుకొన్న హృదయము పవిత్రంగా ఉంటుంది. రుద్రభూమి, భద్రభూమియందు కృష్ణుని బలము, ఆశ్రయము. ప్రేమ తప్ప అన్యము లాశించలేదు. "నీ ఆజ్ఞలను శిరసావహించి నా కర్మల్లో నేను పాల్గొంటాను" అని అన్న భక్తుడు మిత్రుడు, అర్జునుడు.

9. ఆత్మనివేదనం: "ఓణం" నాటి కథానాయకుడు, ప్రధాన పురుషుడు, బలిచక్రవర్తి, దీనికి చక్కని ఉదాహరణము, "భగవంతుడా! నాదన్నది ఏమున్నది?" సర్వము నీదే" అనే ఆత్మార్పిత భావముతో తనను తాను అర్పితము గావించుకొన్న వ్యక్తి బలిచక్రవర్తి, వామన మూర్తిని రమ్మని ఆహ్వానించి, అతని చరణములను కడిగేదానికి తన చేతికిమ్మని. వాటిని కడిగి ఆ పాద చరణామృతమును తన శిరస్సుపై ల్లు కొనుటకు ప్రార్థించినాడు. శుక్రాచార్యుడు. సమస్తమును ఎరిగినబ్రాహ్మణుడు చక్రవర్తికి పురోహితుడు, మహా పండితుడు. విష్ణుమూర్తి వామనమూర్తి స్వరూపములో వచ్చినాడనే సత్యాన్ని గుర్తెరిగినవాడు. బలిచక్రవర్తి కెంతయో బోధించినవాడు, కడపటికి రహస్యాన్ని బలిచక్రవర్తికి బోధించి వామనుడు అడిగినదానికి నీవిచ్చుటకు -సంసిద్ధుడుగా ఉండకూడదన్నాడు. దానికి బలి అన్నాడు. సాక్షాత్ భగవంతుడే, నా ఎదుట చెయ్యి చాచి ‘నాకిది ఇమ్ము అని అడిగినప్పుడు, అల్పుడైన నా హస్తము పరాత్ముడైన అని హస్తము పైన ఉండేదాని కంటే వేరే భాగ్యమేముంటుంది?ఏమైనా కానీ నా సర్వస్వమును అర్పితము చేస్తానని గురువాజ్ఞను తిరస్కరించే దానికి సిద్ధమవుతాడు బలి.

 

2. అనన్య భక్తి: భగవంతునికంటే జగత్తులో అన్యమైనది లేదు అనే విశ్వాసముచేత సర్వమునూ భగవత్ - స్వరూపముగా విశ్వసించటము “విశ్వం విష్ణు స్వరూపం", "ఏకంసత్ విప్రా: బహుధా వదంతి" - ఉన్నది ఒక్కటే. ఇట్టి భావముచేత దివ్యత్వాన్ని స్మరించుచూ జీవితమును సార్థకము చేసుకోవటమే ఈ అనన్య భక్తి..ఏది చూసినా దైవస్వరూపమే, ఏది విన్నా దైవ నామమే, ఏది చేసినా దైవ సేవనే, ఎక్కడికి నడిచినా దైవ ప్రదక్షిణతో సమానము. సర్వ కర్మలను భగవదంకితము గావించుకొని తన జన్మను సార్థకము గావించుకొను ఏకాత్మ భక్తినే అనన్య భక్తిగా భావిస్తూ వచ్చినారు. ఇది అందరికీ సులభ సాధ్యముకాదు. భగవంతుడు సర్వ వ్యాపకుడు అని చెప్పటము సులభమే కానీ సర్వ వ్యాపకమును అనుభవించటము చాలా కష్టము. రామ భక్తులు జగత్తులో ఉండినవారు, కాని రామ ప్రీతికి అర్హుడైనవాడు ఒక్కడైనా కనిపించడము లేదు."రా" అనగా ఆత్మ, "" అనగా జీవుడు. ఈ రెండింటి ఏకత్వమే నిజమైన రామ తత్త్వము,ఇట్టి అంతరార్థము గుర్తించి వర్తించే వ్యక్తులు చాలా అరుదు.

 

అదే విధముగనే, భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడని, సర్వవ్యాపకుడని. సర్వజ్ఞుడని భావించవచ్చును తప్ప అనుభవించటము చాలా కష్టము. చెప్పేది చేసేటటు వంటివాడే నిజమైన భక్తుడు. దీనినే త్రికరణ శుద్ధి అని చెప్పుతూవచ్చారు.  "మన స్యేకం వచస్యేకం, కర్మణ్యేకం, మహాత్మనాం,"  మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ ణ్ అన్యత్ దురాత్మనాం"ఈ త్రికరణశుద్థితో దైవము సర్వత్రా ఉంటున్నాడు.సర్వవిషయలందు భగవత్ భావమునుతాను గుర్తించినటువంటి వ్యక్తి అనన్య భక్తుడు.

 

3. ఏకాంత భక్తి: "అంతర్ బహిశ్చతత్ సర్వ వ్యాప్యనారాయణ స్థిత" నారాయణుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడో, బహిర్ముఖములో ఉన్నాడో, నా అంతర్ముఖములో ఉన్నాడని గాఢమైన విశ్వాసము గలవాడు ఏకాంత భక్తుడు. లోపల, వెలుపల, సర్వత్రా ఉండినటువంటివాడే నాయందూ ఉన్నాడు. సర్వత్రా ఉన్న స్వరూపుడు సమిష్టి స్వరూపుడు, నాయందు ఉన్నవాడు వ్యక్తి స్వరూపుడు. వ్యక్తి లేక సమిష్టి లేదనేవిశ్వాసంతో ఏకాంత భక్తి అనుసరించేవాడు. ఎక్కడ చూచినా దైవ భావమే, దైవ నామమే, దైవ రూపమే.

(స.హ.ఆ.89 పు. 253/258)

 

నామమును మానవతత్త్వంగా భావించడం కాకుండా, మాధవత్వంగా నిరూపించి నతనే శబ్ధస్వరూపుడు - అని వర్ణిస్తూ వచ్చారు. “శబ్ద బ్రహ్మమయీ, చరాచరమయీ, జ్యోతిర్మయీ, వాజ్ఞయీ, నిత్యానందమయీ, పరాత్పరమయీ, మాయామయీ, శ్రీమయీ". ఈ అష్టవిధములైన స్వరాలకును శబ్దమే ప్రధానమైనది. ఈ శబ్దమును భావరూపములో ఇముడ్చుకొని, దైవత్వాన్ని పొందుటకు శాంతభక్తి, సఖ్యభక్తి, వాత్సల్య భక్తి, అనురాగ భక్తి, మధురభక్తి అని అనేక విధములైన మార్గములను ఏర్పరచుకున్నారు.

 

శాంతభక్తి: ఈ భక్తిలో భగవంతుని పొందినవారెవరు? మహాకఠిన దీక్షను పట్టి సాధించిన భీష్ముడు. ఇతను గంగాపుత్రుడు. జగన్నిమిత్తమై తన సర్వకర్మలు, సర్వసుఖములు. త్యాగము చేసినవాడు, భీష్మ ప్రతిజ్ఞ గావించినవాడు. శారీరక, మానసిక, జీవితతత్త్వాన్నిఅంతము గావించి దివ్యత్వాన్ని పొందిన మహాత్యాగి. - కట్టకడపటికి దేశోద్ధారం నిమిత్తమై తాను నాయకత్వాన్ని వహించి మహభారత యుద్ధములో పాండవులతో కూడను యుద్ధము చేసినవాడు. తొమ్మిదవ దినము అర్జునుడు వేసిన అమ్ములచేత కూలిపోయాడు. శరీరమంతా ఈ అమ్ములే చేరి ఉంటున్నాయి. తాము క్రింద పడేటప్పటికి దేహము భూమి పైన పడలేదు. అమ్ములపైనే ఆధారపడి ఉంటుండాది. దానినే శరతల్పముఅన్నారు. తిరిగి అర్జునునే కోరినాడు. అంత శాంతమూర్తి, ఎవరు తనను నేలకూల్చినారో ఆ అర్జునునే అడిగినాడు. అర్జునా నాకు బెడ్ ను మాత్రం తయారు చేసినావు. కాని పిల్లో ఇవ్వలేదే అని. తల క్రిందికి పడిపోతుండాది. అర్జునుడు రెండు అమ్ములను తిరిగి ఇట్ల వేస్తే ఈ మధ్యభాగములో తల పెట్టాడు. సకాలములో మరణము ప్రాప్తించినప్పుడే జన్మ సార్థకమౌతుందని అతని విశ్వాసము. ఉత్తరాయణకాలం వచ్చేంత వరకు ఆనాడు మొదలుకొని 56 దినముల వరకును భగవచ్చింతన చేస్తూ ఉన్నాడు. దేహమున కెన్ని బాధలు సంభవించినా ఎన్ని నొప్పులు బాధించినా లెక్క చెయ్యలేదు. పవిత్రమైన కాలం నాకు ప్రాప్తించాలి. అంతవరకు నేని ప్రాణమును వదలకూడదు. ప్రాణము చాలా విలువైనది. ఇలాంటి విలువైన కాలములోనే వదలాలి అని అమ్ముల పైనే 56 దినములు పవళించినాడు. ఈ కాలమునుకూడము వృధా చేయకూడదని రాజనీతి గృహనీతి శాంతి బోధలంతా ఇతడు బోధిస్తూ వచ్చాడు. దీనినే మహాభారతంలో శాంతిపర్వము అంటారు. పాండవులకందరికిని విశేషములంతా చక్కగా వర్ణిస్తూ వచ్చాడు. ఇంతటి నిగ్రహశక్తి కలిగిన మహాపురుషుడు భీష్ముడు. దీనికంతా శాంత భక్తియే మూలాధారము.ఎన్ని కష్టములైనా, ఎన్ని నష్టములైనా ఎట్టి నిందలైనా, నిష్ణూరములైనా సహించి, భరించి భగవంతుని స్మరించే వాడు. యుద్ధ సమయమునందు కృష్ణుడే భీష్ముణ్ణి కొట్టడానికి వచ్చాడు. నిజంగా కృష్ణునికి భీష్ముణ్ణి కొట్టడం ఇష్టం లేదు. అర్జునుడు బలహీనుడైపోవటంచేత అర్జునునకు బలమునందించే నిమిత్తమై, అర్జునుని రౌద్రాన్ని బలపర్చే నిమిత్తమై అర్జునా ! పిరికిపందవలె నీవుంటున్నావు. నేనే యుద్ధం చేస్తానని అమ్ములు తీసుకున్నాడు. భీష్ముని పైకి కృష్ణుడు వస్తుంటే భీష్ముడు ఆ సమయమునందు కూడను కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ వచ్చాడు.

 "కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి గగన భాగంబెల్ల కప్పిగొనగ

నుఱకిన నోర్వక యుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదల

చక్రంబు చేపట్టి చమదెంచురయమున పైనున్న పచ్చనిపటము జాఱ

నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ

కరికి లంఘించు సింహంబు కరణి మెఱసి

నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు

విడువు మర్జున యనుచు మద్విశిఖవృష్టి

దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు"

 

ఓ అర్జునా! నేనిప్పుడు ఈ భీష్ముని చంపుతాను. నన్ను విడిచి పెట్టు అని నన్ను చంపడానికి ఏ భగవంతుడైన కృష్ణుడు వస్తున్నాడో ఆ కృష్ణుడే నన్ను రక్షించాలి అన్నాడు. చూచారా! ఎంత భక్తి : ఏ భగవంతుడు నన్ను చంపడానికి వస్తున్నాడో ఆ భగవంతుడే నన్ను రక్షించాలి. అని ప్రార్థిస్తూ వచ్చాడు. శిక్షించడానికి వస్తున్నాడు. ఓ రామా నన్ను రక్షించు. ఓ ఈశ్వరా నన్ను రక్షించు అని ఎవర్నీ ప్రార్థించలేదు. అంతటి నిశ్చల భక్తి నిర్మలభావము. అతనే శాంతభక్తి.

ఇక సఖ్యభక్తి: అర్జునుడు ఎంతకాలము నుంచి మిత్రత్వములో ఉన్నప్పటికిని కృష్ణుడంతటి స్నేహితుడు ఈ జగత్తులో నాకు లేడని విశ్వసించాడు. కృష్ణభావమునందు తన జీవితమును స్నేహభావముతో అనుభవిస్తూ వచ్చాడు. లోకము మరొకరీతిగా భావిస్తుందని కృష్ణుణ్ణి బావా బావా అంటూ పిలుస్తూ వచ్చాడు. కృష్ణునికి ఆవిధంగా రిలేషన్‌షిప్ పెట్టుకోవడం ఇష్టం లేదు. నన్ను బావా అని పిలుస్తున్నావేకాని బావకు తగిన అర్థం లేదే, అక్కడ: ప్రతి పదమునకు ఒక అర్థాన్ని నిరూపించాలి, అనే ఉద్దేశ్యంతో ఈ బావా అనే పదమునకు విలువనిచ్చే నిమిత్తమై తన సోదరియైన సుభద్ర నిచ్చి పెండ్లి చేసి అప్పుడు బావా అనిపించుకున్నాడు. ఇప్పుడు నీవు బావా అని పిలు అన్నాడు. అర్థము లేని పదమును ఉపయోగ పెట్టకూడదు. ఇది భగవంతుని చరిత్రలో ఉన్న యధార్ధమైన పవిత్రత. కష్టములయందు, సుఖముల యందు, అపజయములందు, జయములందు, అరణ్యవాసము నందు నిరంతరముకూడను కృష్ణుడే మా స్నేహితుడు, కృష్ణుడే నా మిత్రుడు. ఇదే సఖ్యత. కష్టములందు దూషించడము, సుఖములయందు వర్ణించడము యిదికాదు నిజమైన సఖ్యత. ఎన్ని కష్టములైనా సరే, ఎన్ని బాధలైనా సరే ఎన్ని విధముల హింసలైనా సరే నీవుతప్ప నాకన్యము లేదు, అనే విశ్వాసముతో ఆ కృష్ణుణ్ణి ఆధారంచేసుకున్నాడు. అర్జునుడు. రెండుదేహములు ఒక్క ప్రాణము. ఇది నిజమైన స్నేహము. ఈ విధంగా అర్జునుడు మైత్రిగా చూచుకుంటూ వచ్చాడు.

 

ఇక దాస్యమునకు హమమంతుడు. ఎప్పుడు చూచినా నీవు ప్రభువు నేను దాసుడు నీవు ప్రభువు నేను దాసుడు అనేవాడు. లంకను దాటక పూర్వము మంచి పండు వెన్నెలలోపల అందరు పవళించారు. శ్రీరాముడు కూడను పవళించాలి. ఎక్కడ పవళించగలడు? అక్కడ పరుపులు లేవు. ఇసుక జటాజూటమును ధరించి యతివేషములో బయలుదేరినవాడు రాముడు. లక్ష్మణుడు కూర్చున్నాడు. ఆతని తొడపైన తల పెట్టి రాముడు పవళించినాడు: ఒక్కొక్కర్నీ ప్రశ్నిస్తూ వచ్చాడు రాముడు. సుగ్రీవా: ఆ చంద్రునిలోపల ఏదో నల్లని మచ్చ కనిపిస్తుండాదే: దాన్నేమంటావు నీవు? అన్నాడు. నాకు తెలియదు రామా:అన్నాడు. ఇంకా జాంబవంతుణ్ణి ప్రశ్నించాడు. జాంబవంతుడు చెప్పాడు. ఆ చంద్రుని లోపల అనేకపర్వతములు గుంతలు ఉంటుంటాయి. ఆ గుంతలు పర్వతముల యొక్క నీడనే ఆ నల్లటి రూపముగా కన్పిస్తుండాది అన్నాడు. జాంబవంతుడు జ్యోతిశ్శాస్త్రములోనూ, ప్రకృతిశాస్త్రము లోనూ ప్రవీణుడు. భూగోళశాస్త్రమును చక్కగా గుర్తించినవాడు.రాముడు ఇంకా కొంతమందిని అట్లనే అడుగుతూ వచ్చాడు. లక్ష్మణుని అడిగాడు. లక్ష్మణుడు, ఆన్నా అందులో ఏదో జింకవలె కన్పిస్తుండాది, మృగాలవలె కన్పిస్తుంది. అన్నాడు. ప్రక్కనున్న కాళ్ళు వత్తుతున్న హనుమంతుణ్ణి ఆ చంద్రునిలోపల ఏవేమి చూస్తున్నావు హనుమా అన్నాడు. రామా! అన్యము నాకేమీ కల్పించుటలేదు. వీవు వెల్లకిల పండుకొని చూస్తుంటే నీ ముఖము యొక్క చిత్రమే చంద్రుడనే అద్దములో కనిస్తుండాది అన్నాడు. చంద్రుడనేవాడు శుద్ధమైన అద్దమువలె కన్పిస్తున్నాడు. ఆ అద్దములో నీ ముఖ ప్రతిబింబమే కన్పిస్తుంది. అన్నాడు. అనగా ప్రతి పదార్థమునందు కూడను శ్రీ రామచంద్రుని స్వరూపము, నామమే అతనికి కన్పిస్తూ వచ్చింది. ఎలాంటిసమయమునందును రామసేవ తప్ప అన్యము చేసే వాడుకాడు. అతను మహాబలవంతుడు, మహాగుణ వంతుడు. మహాశాంతుడు. ఇట్టి హనుమంతుడు అశోకవనంలో ప్రవేశించాడు. లంకనంతా ధ్వంసము చేస్తూ వచ్చాడు. రావణాసురుడు వచ్చి ఎవడురా నీవు? అని ప్రశ్నించాడు. బలవంతుడైన హనుమంతుడు అహంకారముతో విర్రవీగలేదు. దాసోహం కోసలేంద్రస్య, నేను శ్రీరామచంద్రుని దాసుడను అన్నాడు. దాసునికే ఇంత బలముంటుంటే ఇక ప్రభువున కెంతబలమో యోచించుకో రావణా అన్నాడు. నిరంతరము దాసత్వాన్ని భావించి ఇట్టి హనుమంతునికంటె ఆదర్శవంతమైనవాడు మరొకడు లేడు. అందుకోసమనే రాముడు భారతదేశము కృతజ్ఞతకు పుట్టినిల్లు పెట్టిన పేరు అన్నాడు. కృతజ్ఞతనే లేకపోతే మానవత్వమే లేదు. ఒంటరిగా తీసుకొనిపోతున్న సీతను రక్షించే నిమిత్తమై జటాయువు తన ప్రాణాన్ని అర్పించింది. కనుకనే తన సీతకు సహాయం చేసిన జటాయువుకు కృతజ్ఞత రీతిగా రాముడే దాని కర్మలన్న ఆచరిస్తూ వచ్చాడు. హనుమంతునికి కూడా అంతే. హనుమా! నీకు ఏవిధంగా కృతజ్ఞత చెప్పాలో నాకర్థం కావటం లేదు. కిష్కింధలో ఉన్న నాయొక్క క్షేమవార్త అశోకవనములో ఉన్న సీతకు అందించినది నీవే. అశోకవనములో బాధచెందుతున్న సీత వార్త రామున కందించినవాడవు నీవే. అడవులన్నియు శోధించి, సాధించి సముద్రములు దాటి సీతను చూచి వచ్చినవాడవు నీవే. సీత జీవములో ఉన్నదనే పవిత్రమైన వార్తను తెలిపినవాడవు నీవే. నా ఉంగరము సీతకిచ్చి, సీత శిరోమణిని నాకందించినవాడవు నీవే. రఘుపతి కార్యము ఈడేర్చిన ఓ కపిశిఖామణి! నీకు ఏరీతిగా కృతజ్ఞతలు తెలపాలి? నాదగ్గర ఏమీ లేదు. నన్ను నేనే ఇచ్చుకుంటున్నాను హనుమా!తీసుకో అన్నాడు.తాను సముద్రము దాటడానికి రామనామమే ఆధారమైనది. నామము యొక్క మహత్తరశక్తి ఎట్టిదో చక్కగా గుర్తించవచ్చు. ఇదీ దాస్యమునకు సరైన అర్థము. ఒక్క తూరి సరెండర్ అయిపోతే, ఆర్పితమైపోతేఇంక ప్రాణము పోయినాసరే నా జీవిత మంతా నీకే అర్పితము అనే రీతిగా ఆర్పితము గావించినవాడు హనుమంతుడు. ఇది దాస్యత్వము.

 

ఇంక వాత్సల్యము: వాత్సల్యములో ఉండిన మాయతత్త్వము ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కృష్ణుని నోటియందు 14 లోకములు చూచిన యశోద మాయచేత ఇతను నాకుమారుడే, ఇంత గొప్పలోకాలు, నాకుమారుని చిన్ననోటిలో ఎట్లు కనిపిస్తాయి? అని తను చూచినదాన్ని మరచింది. వాత్సల్యము కేవలము దేహసంబంధముగా ఉంటుంది. నేను తల్లిని, తాను కుమారుడు అనే వాత్సల్యమే మాయ ఇంతగట్టిగా అందిస్తూ వచ్చింది. గోవర్ధనగిరి ఎత్తి కృష్ణుడు గోవులను గోపాలురను కాపాడుతున్న సమయములోపల అయ్యో! ఇంత పర్వతమును ఎత్తినాడే; దీనిని క్రింద ఏరీతిగా పెట్టగలడు? ఏవిధంగా క్రింద పెట్టాలనుకున్నప్పటికి ఈ పర్వతం మధ్యలో ఉన్న తాను క్రిందికి పడిపోతాడో ఏమో! ఎత్తటం సులభం కావచ్చును. కాని కింద పెట్టటం చాలా కష్టం అనుకొని అందరూ వెళ్ళిపోయినప్పటికిని యశోద అక్కడనే కాచుకొని ఉంటుంది. ఇక్కడ కూడను ఒక మాయనే. కృష్ణుడు ఒక పెద్ద శబ్దము వచ్చేటట్టు సృష్టించాడు. ఆ శబ్దమును భరించుకోలేక కన్నులు చెవులు మూసుకొన్నది యశోద, ఆమె కన్నులు, చెవులు మూసుకొన్న తత్క్షణము భూమిపై నుంచుండాది పర్వతము. తాను ప్రక్కనున్నాడు. ఏరీతిగా ఎత్తినాడో ఆ రీతిగా దింపినాడు. ఇంత యోచనకు ఆమె ఏమాత్రము లోతుగా పోలేదు. ఎత్తిన పరమాత్ముడు దింపలేడా అనే విచారము లేకపోయింది. ఈ నిత్యానిత్య విషయ పరిశీలవ ఎప్పుడు పోతుంది? వాత్సల్యంలోపల నిర్మూలనమౌతుంది ఈ విచారచర్చ. ఉద్ధవుడు వచ్చి కృష్ణుని వార్తలు చెపుతున్నప్పుడు యశోద వెళ్ళి ఉద్ధవా: నా గోపాలుడు బాగున్నాడా? అని ప్రశ్నించింది. లీలామానుషవిగ్రహుడు, బృందావన విహారి, మునిమానస సంచారి ఏవిధంగా పోయినా నాకక్కరలేదు. బృందావనవిహారి ఎక్కడ ఉండినా నాకక్కర లేదు! నాగోపాలుడు బాగున్నాడా లేదా? అని అడిగింది. కనుక వాత్సల్యమనేది సంకుచిత స్థానానికి తీసుకొని వస్తుంది. ఆమెకు ఏ విధమైన వర్ణనలు అక్కరలేదు. గోపాలా, గోపాలా, గోపాలా భక్తులు ఎన్ని వర్ణనలు చేసుకున్నను తనకక్కరలేదు. తనకు కావలసినది. గోపాలుడే. నిరంతరము గోపాలా, గోపాలా, గోపాలా అనే నామము చేతనే యశోద వాత్సల్యముచేత తరించినది.

ఇంక అనురాగభక్తికి గోపికలు. వాళ్ళకు రెండు గుర్రాల సవారి, ఇంటిలోపల భర్త, అత్త: బయట గోపాలుడు. ఈ రెండు తప్ప ఏమాత్రము మరొక చింత లేదు. తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ దివ్యత్వాన్ని అనుభవిస్తూ వచ్చారు వాళ్ళు. ఒక్కొక్క సమయంలోపల జగత్సంబంధమైన ఈ కర్తవ్యములో వాళ్ళు కొంతవరకు తప్పిపోతూ వచ్చారు. నిరంతరమూ కృష్ణా, కృష్ణా, కృష్ణా అంటూ ఈ విధంగా అనురాగభక్తి, తమ స్నేహితుడుగాను, మిత్రుడుగాము. సర్వశక్తిగాను భావించినవారు గోపికలు..

 

మధురభక్తి ఒక్క రాధకు తప్ప అన్యులకు లేదు. కృష్ణా! అనుకునేటప్పటికి తన దేహాన్ని తాను మరచిపోయేది. కృష్ణుడు పతి, తానుసతి అను భావములో మునిగిపోయేది. కృష్ణుడు మాస్టర్ తాను సర్వెంట్ అనే భావముతో ఉండేది. ఇరువురు కూడను ఒక్కటే. ఆయన పరమాత్మ నేను ప్రకృతి అనే రీతిగా ఉండేది. మరొక చింత లేదు. ఎక్కడ నీలంగా కన్పించిన వృక్షమైనప్పటికిని కృష్ణా అని పోయి వృక్షాన్ని పట్టుకునేది. నిరంతరము సమస్త పదార్థముల యందు కృష్ణుడు తప్ప అన్యము కనిపించలేదు. నిరంతరము కృష్ణనామము. కృష్ణమురళీ గానమే. ఆమెప్రాణం విడిచేపూర్వం ఆ మురళీనాదమునే వినాలని కోరింది. నాదం కూడ ఎటువంటి పవిత్రమైన సారమో తెలుసునా? పరిపూర్ణమైన వేదసారమే ఈ మురళీనాదం. ఈ వేదముల సారమంతయు గోక్షీరమే. ఆమెను రక్షించే నిమిత్తమై కట్టకడపటి స్థితిలో కృష్ణుడక్కడికి వెళ్ళాడు. రాధా నీ కేంకావాలి. అని అంతిమకోరికను నీవు ఉచ్చరించుమన్నాడు. రాధ చెప్పింది. కృష్ణా ! ఇంతకాలమునా హృదయకమలములోపల నిన్ను పోషించుకున్నాను. నా హృదయమనే కొలనులోపల ప్రేమజలమంతా యిగిరి పోయింది. కట్టకడపట నిన్ను నా కంటి ధారలనే జలము లోపల పెట్టి పోషించుకున్నాను. కంటిధారలు కూడను యిగిరిపోయినవి. ఇంక నిన్నెక్కడ పెట్టుకొని నేను పోషించాలి? శబ్దమునందే నీ నామము నేను పోషించు కోవాలి అని “పాట పాడుమా కృష్ణా: పలుకు తేనె లొలుకునటుల మాటలాడుమాముకుందా: మనసు తీరగా, వేదసారమంత దీసి, నాద బ్రహ్మముగను మార్చి, వేణునందు తిరుగబోసి, కాలరూపముగను మార్చి పాడపాడుమా" అన్నది. కమ్నలు మూసుకున్నది. ఆమెలోనుండి ఆజ్యోతి కృష్ణునిలో ప్రవేశించింది. మధురభక్తి అనగా రెండు ప్రాణాలు ఒక్కటే అనే అంతరార్థాన్ని రాధ నిరూపించింది. ఈ రకమైన స్థితిని పొందడానికి కారణమేమిటి? విశ్చలమైన భక్తి, నిర్మలమైనప్రేమ, నిస్వార్థమైన హృదయము-ఈమూడే దీనికి కారణము. తన, మన, ధనములను అర్శితము గావించిందిఈ రాధ, ఈ తనువెవ్వరిది? ఈ మనస్పెవరిది? ఈ ప్రాణమెవ్వరిది? ఈ మూడును నీవు అందించినవే:

(శ్రీ.స.వి.వా.పు.71/78)

 

భక్తి అంటే ఏమిటి? భక్తులంటే ఎవరు? భక్తి అంటే నిశ్చల విశ్వాసం, నిర్భయం, విరహంకారం, సద్గుణం, సమర్పణం.

(వ.1963 పు.10)

 

భగవంతునికి మిమ్ములను సంపూర్ణంగా సమగ్రంగా సమర్పించుకుని, లేశమైనా అహంభావం లేకుండా ఆయన హస్తాలకు ఆధీనులై పోవాలి. అప్పుడే భక్తుడు అనిపించుకోగల అర్హత పొందగలుగుతాడు.

(వ.1963 పు.12)

 

నేమ భక్తుని ప్రేమించను. భక్తిని ప్రేమిస్తాను.

(సా.పు.62)

 

తామసంబు విడక: తత్త్యంబు ఎటుకుదురు!

రాజసంబు విడకు రామభక్తి

సాత్వికంటె, భక్తి సాన మగునయా

ఉన్నమాట తెలుపు చున్న మాట!

(సా.పు.95)

 

"దైవము సర్వత్రావుండినప్పటికిని, ఎవరికి గోచరింపడు. ఇది కేవలం అనుభవానికి మాత్రమే గోచరమవుతుంది. నీటిలో చెక్కెర పాకము కలిపాము. కాని అది కన్నులకు కనపడదు. నీటిని నాలుకపై వేసుకొన్నప్పుడే చక్కర వున్నదని తెలుస్తుంది. అదేవిధముగనే ఈ ప్రకృతి అనేభాండము లోపల, దివ్యత్వమనే ఆత్మ వ్యాపించియున్నది. ఇదినీకు కనిపించదు. ఇది నీకు ఆనుభవంలో అర్థమవుతుంది. ఈ అనుభవం కోసం సాధన చెయ్యాలి. దైవభావాన్ని పెంచుకోవాలి. ఎవ్వరిని ద్వేషించకూడదు. ఏమతాన్ని కూడా విమర్శించ కూడదు. అందరినిప్రేమించాలి. ఈ ప్రేమయే భగవత్రేమ. ఈ ప్రేమను పెంచుకోడం నిజమైన భక్తి.

(సా .పు 265/266)

 

భక్తి అంటే ఏడవటం కాదు. భక్తి అంటే సృష్టి అన్నిటిలోను మీరు మిమ్ములను చూడాలి.

( సా.పు.522)

 

చెప్పుకునేది భక్తి చేసేది భుక్తి. అదికాదు. నిజమైన భక్తి, అన్నింటికిని మనసు సిద్ధముగా వుంటుండాలి. "పిలిచి అడుగు చెఱుకు పెట్టినా బెల్లంబు. పిప్పెగొట్టి రసము పీల్చకున్న"? "జాతి వజ్రమైన సానబెట్టువలయు" కట్టింగ్సు లేకపోతే దాని విలువ తగ్గిపోతుంది. బాధలే లేకపోతే చెఱకు పాలైనా ఇవ్వదు. మానవుని యందు కష్టములు నష్టములు దుఃఖములు మథించినప్పుడే అందులో నిజమైన సారము ఆవిర్భవిస్తుంది. కనుకనే భక్తి, భక్తి, భక్తి, అనేకవేదాంతో పనిషత్తుల సారమును మథించి అందించిన సుధానిధియే యీభక్తి. భక్తిలో యేమాత్రము చలనము ఏర్పడకూడదు. దానిని స్థిర మైనదిగా నిల్చుకున్నప్పుడే ధృడమైన విశ్వాసము కలిగినప్పుడే ఫలమును అందుకోవటానికి మనము అర్హులమవుతాము.

(బృత్ర.పు.41)

 

ధనమున్నదని పెద్దలను జెన్కనగుగాని

పుడమినద్దానిచే ముక్తిరాదు

బలమున్నదని మిట్టిపడవచ్చునే కానీ

పుడమి నద్దానిచే ముక్తిరాదు.

విద్యాంసుడని పెద్ద బిరుదొందనగుగాని

పుడమినద్దానిచే ముక్తిరాదు

పదవి కద్దని పల్కుబడి జాపనగుకానీ

పుడమినద్దాంనిచే ముక్తిరాదు.

భక్తి సంపాదనముననే ముక్తి కలుగు

రామభక్తులు కానిచో రాదు ముక్తి

శాశ్వతములు గావు మిగతవి సత్యముగను.

భక్తియే యన్న సాయి సత్యంబు నొసగు

(ము.ము.పు.41)

 

ఇసుకపై వర్షధార నింకిపోవు

మధురమై నిల్చురేగడి మసకలోన

చిప్ప పైబడి ముత్యమై చెన్నుమీరు

అటుల ప్రాప్తానుసారమై అలరు భక్తి

 

పూవులేక కాయ పుట్టుదుచెట్టున

కాయలేక ఫలము కాంచబోము

కర్మ, నిష్ట లేక కలుగదు భక్తియు

భక్తియులేక జ్ఞాన భరితుడగునా?

 

చెట్టున పువ్వులేక కాయ పుట్టదు. కర్మలేకుండా భక్తి మార్గము మనలో ప్రవేశించదు. కాయలేక ఫలము కలుగబోదు. అనగా భక్తియే లేకపోతే జ్ఞానమనే పరిపక్వత ఏర్పడదు. జ్ఞానము అనే శిఖరమునకు చేరాలంటే, భక్తిని మనము అనుభవించాలి. భక్తి స్థాయిలో జీవితము పరిపక్వతస్థితికి తెచ్చుకోవాలంటే కాయలనే కర్మలయందు ప్రవేశించాలి. కనుక, కర్మవలన భక్తి, భక్తి వలన జ్ఞానము లభిస్తుంది. కర్మలేక భక్తిలేక జ్ఞానమును అనుభవించుటకు వీలుగాదు. సాధకులైనవారు, సాధకులు కాబోయే వారు, చిత్తమును పరిశుభము చేసుకునే కర్మలను ఆచరిస్తూ పోవాలి.

 

ప్రతిజీవిత వృక్షమందు ప్రేమ అనే ఫలము మధుర రసముతో కూడి ఉంటుంది. అయితే ఈ ఫలము తృష్ణ అనే చర్మముతో కప్పబడి ఉన్నది. తృష్ణ అనే చర్మమును వలచి, లోపల ఉండే ఈర్ష్య, అసూయ, అహంకార, స్వార్ధములనే బీజములను దూరముచేసి ప్రేమరసమును అనుభవించినప్పుడే పరమ ప్రేమ అనే ప్రథమస్థానమును అందుకొనుటకు వీలగును. ఈ పరమ ప్రేమనే ఉపనిషత్తులు "రసస్వరూపము అని చెబుతూ వచ్చాయి. “ఆపోజ్యోతిరసః అమృతం బ్రహ్మ ఇదే అమృతం, ఇదే జ్యోతి. ఇదే ఆత్మ, ఇదే బ్రహ్మ దీనిని బడయ గోరి మానవులు మూడు విధములైన భక్తిని అనుసరిస్తున్నారు.

 

మొదటిది (భౌతిక భక్తి) సామాన్య బేధభక్తి రెండవది ఏకాంత భక్తి మూడవది అనన్యభక్తి. శ్రవణ, మనన, నిధి. ధ్యాసలతో కూడినటు వంటిది. యజ్ఞయాగాది క్రతువులలో చేరినటువంటిదీ. క్షేత్రయాత్ర పుణ్యనదీ. తీర్థయాత్ర, కీర్తన, షోడశోపచారములతో కూడినటువంటిదీ, ధానధర్మాది కృత్యములతో చేరినదీ. ఇవి అన్నియూభౌతిక భక్తి మాత్రమే! జపతపాది పూజలు, వ్రతములు, సంధ్యావందనములు కూడా ఈ భౌతిక భక్తితో కూడినట్టివే! ఇవయనియూ జపము లనియే చెప్పవచ్చును.

 

ధ్యానము నందు నిమగ్నుడై, అనేక విధములైన దర్శనములను అనుభవించినప్పటికీ అనేక విధములైన దైవశక్తులను తాను చూచినట్లుగా భావించినప్పటికీ, అవియన్నియూ కేవలము భౌతిక భక్తికి మాత్రమే చెంది ఉంటాయి. కారణమేమనగా, అనిత్యమూ, అశాశ్వతమూ. అసత్యమూ అయినటువంటి కాయములో ఆచరించు చున్నవన్నీ అనుభవించుచున్నవన్నీ మనస్సుతో విస్మరించి, మనస్సులో విశ్వసించేటటువంటివీ ఇవన్నీ జడములో కూడినవి.

 

"శర్యతే ఇతి శరీరః" జీర్ణించే శరీరముతో గావించేవి కనుక, దీని ఫలితములు కూడా జీర్ణించుకు పోతాయి. "దహ్యతే ఇతి దేహ" దహించుకుపోయే దేహములో ఆచరించేవి కనుక ఇవి కూడా భస్మమైపోతాయి. అట్లని ఈ ప్రథమస్థానమునందే మాత్రము విరక్తిని కలిగియుండ కూడదు. ఇవి ప్రాధమిక స్థానమునకు అవసరమే.

 

క్రమక్రమేణా ఏకాంత భక్తిని పొందాలి. ఏకాంత భక్తి అనగా, అనేకమంది, ఏదో ఒక విగ్రహము లేక స్వరూపముచెంత ఏకాంతముగా నుండి అనుభవించటము అని భావిస్తుంటారు. కాదు, కాదు. మనస్సును అరికట్టి, దివ్యమైన అనుభూతి యందు చేరి యుండటము ఏకాంత భక్తి. మనస్సును అరికట్టుట యగునా, కేవలము మనస్సును అటూ, ఇటూ తిరగకుండా ఒక ప్రదేశమందు నిలబెట్టటము అని భావిస్తున్నారు. ఇది చాలా పొరపాటు: మనస్సునందు చేరిన కల్మషాన్ని మాలిన్యాన్ని పరిశుద్ధము గావించడమే! ఒక ప్రదేశములో నిలబెట్టుటకు, అది నిలబడే స్వభావము కాదు. మనస్సుకు లయము ఉన్నదిగాని స్థిరమనేది లేదు. సంకల్ప వికల్పములను అణగదొక్కడమే ఏకాంత భక్తి సంకల్ప వికల్పములచేతనే మానవత్వమనేది దెబ్బతింటూ వస్తున్నది. ఇది ఏవిధంగా ఉండాలంటే - దానికి ఒక ఉదాహరణము. భూమి యందు ఎన్ని వృక్షములు పుట్టుచూ, పెరుగుచూ, నశించుచూ ఉండినప్పటికీ భూమికి ఎటువంటి బాధలు లేవు, ఏకాంత భక్తి స్థితి యందు మనస్సు అట్టి స్థిరమైన పరిస్థితి యందు లయమై ఉంటుంది. సర్వుల యందూ భగవంతుడు ఉండినప్పటికినీ, ఇట్టి లయమైన హృదయము కలిగిన వారి యందు భగవంతుడు ప్రత్యక్ష రూపములో తన దివ్యత్వాన్ని అందిస్తుంటాడు. తలుపులు బిగించుకొని, ఒక విగ్రహాన్ని గట్టిగా పట్టుకొని, ఆరాధన చేసుకొని ఆనుభవించినంత మాత్రాన అది ఏకాంత భక్తికాదు; ఏకాకి భక్తి.

 

స్వస్వరూపమునందున్న ఆత్మ స్వరూపుణ్ణి దర్శించాలి గాని, కల్పితమైన స్వరూపాన్ని అనుభవించేది భ్రాంతి మాత్రమే! అయితే కల్పితములైన ఆరాధనలు కూడా ప్రాథమిక స్థాయిలో అవసరమే! ఎంతకాలమైననూ ఆదశలోనే జీవితాన్ని ధారపోస్తూ ఉండకూడదు. విషసర్పములకు కోఱలు పెరికి పారవైచినపుడు ఏ విధముగా భయము లేకుండా ఉండునో, ఆ విధముగనే మనస్సునందు దుర్భావములను దుర్గుణములను దూరము చేసినప్పుడు. మనస్సు ఏమాత్రమే ప్రమాదకరముకాదు.

 

భావంబునందు దుష్టభావము వీడుటే

త్యా గమగును, అదియె యోగమగును.

 

పవిత్రమైనటువంటి భావాలచేత, పరమార్ధ భావము చేత మనస్సును మార్చుకోవడానికి పూనుకోవాలి. ఈ విధమైనటువంటి తర్పీదు చేస్తూ రాగా, అంతర్భూతమైన ఆత్మ దర్శనాన్ని అనుభవించవచ్చు. మనయందు ఆత్మ అంతర్భూతమై యున్నది. కాని కనిపించుటలేదు. కారణం ఏమిటి? మాలిన్యమైన పాచి దానిపై కప్పబడి యున్నది. రాగద్వేషాలనే అలలు లేకుండా చేసినప్పుడు, దుర్భావము లనే కల్మషాన్ని దూరమే చేసినప్పుడు పరిశుద్ధమైన జలముగా చిత్తము రూపొందుతుంది. అప్పుడు కన్నులుమూసుకొని, మనస్సును అంతర్ముఖము చేసుకొంటివా, క్షణములో సాక్షాత్కారాన్ని అనుభవిస్తారు. ఈ సాక్షాత్కారమే ఏకాంత భక్తి.

 

ఇక అనన్య భక్తి "నీవే తప్ప నితః పరం బెరుగ" అని పలకటం అనన్య భక్తి అని భావిస్తున్నాము. "శరణాగతి" అనన్య భక్తి అని భావిస్తున్నాము. కాని, ఒక ప్రక్కన "నీవే తప్ప నిత:పరం బెరుగ" అంటూ, ఇంకొక ప్రక్క నా వారూ నా బంధువులూ ఉన్నారని విస్మరించటం లేదు; విశ్వసిస్తున్నాము. తాను తప్ప అన్యము లేదనే భావనే అనన్య భక్తి.

 

త్వమేవ మాతాచ పితాత్వమేవ

త్వమేవ బంధు: సఖాత్యమేవ

త్వమేవ విద్య, ద్రవిణం త్వమేవ

త్వమేవ సర్వం మమ దేవదేవ

 

ఇది వాచా భక్తి: హృదయ భక్తి కాదు. అనన్య భక్తి అంటే హృదయ పూర్వకంగా ఈ నిర్ణయం చేసుకోవాలి..

 

భక్తి అంటే నిజముగా భగవంతునితో అనురక్తిగా జీవించటమే! భగవంతునితో విభక్తముకాని వాడే భక్తుడు. భక్తుని మొదటి లక్షణము ఎవ్వరిని ద్వేషించకుండా ఉండటము. భగవంతుడు సర్వత్రా సర్వజీవుల యందున్న ఆత్మ స్వరూపము. ఎవరిని ద్వేషించినా, భగవంతుని ద్వేషించినట్లే! ఎవరిని అలక్ష్యము చేసినా భగవంతునిఅలక్ష్యము చేసినవారము అవుతాము. "సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి" ఎవరికి నమస్కారం చేసినా అది ఆ ఆరాధనా దైవానికే చెందుతుంది. అలాగే "సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చతి". ఎవరిని తిరస్కరించినా, అది భగవంతునికే చెందుతుందని తెలుసుకోవాలి. కనుక మన సంకల్పములు పవిత్రమైనవిగా ఉండాలి. మానవత్వములో దివ్యత్వము ఉన్నది. మానవత్వము ప్రకృతి తత్వము. ఇది ప్రవృత్తి మార్గము. హృదయమునకు సంబంధించినది నివృత్తి మార్గము. ప్రప్పత్తి నివృత్తులు రెండూ మనయందే ఉంటున్నవి.

(శ్రీభ..పు.25/27)

 

ప్రేమనే భక్తి అని మన భారతీయులు అనాది కాలము నుంచి చెప్పుతూ వచ్చివారు. భగవంతుని ప్రేమను పొందుటకు అనేక మార్గములు కలవు. భగవంతుని చేరుటకు, తెలుసిను కొటకు, భగవంతునిలో తాదాత్మ్యమును పొందుటకు. తద్వారా భగవంతుని విభూతులను అర్థము చేసుకొనుటకు ప్రేమయే తోడ్పడుతుంది. ఏదో విధముగా భగవంతుని సన్నిహిత సంబంధులు కావటానికి పూనుకోవటమే భక్తి అని ప్రబోధించివారు. బంధువుగానో, మిత్రుడుగానో, తండ్రిగానో, తల్లిగానో, పతిగానో, సతిగానో, ఏదో విధముగముగ భగవంతునితో సన్నిహిత సంబంధమును కల్పించుకోవటమే భక్తి యొక్క అంతరార్థము.

 

జ్ఞాన, కర్మయోగ మార్గములు భక్తి కంటే కష్టమైనవిగా ఉంటాయి. ప్రేమ చాల సులభమార్గము. చాల దగ్గర మార్గము. చంద్రుని వెలుతురు ద్వారానే చంద్రుని చూడటానికి సాధ్యమౌతుంది. అదే విధముగా ప్రేమ స్వరూపుడైన పరమాత్ముని తెలిసికోవటానికి, పొందటానికి, ప్రేమ ద్వారానే అది సాధ్యమౌతుంది. అదే సులభమార్గము. భగవంతుడు సముద్రము వంటి ప్రేమను కలిగి ఉంటాడు. మనము ఎంత పాత్రను తీసికొని పోతామో ఆ పాత్రకు తగినంత మాత్రమే సముద్ర జలము అందుకోగలము గాని తక్కిన జలము అంతా తెచ్చుటకు వీలు కాదు.కనుక మొట్టమొదట మన పాత్రను పెద్దదిగా చేసుకొనుటకు ప్రయత్నించటమే సాధన అన్నారు.

 

సాధన యందు మొదట మెట్టు మాతృభక్తి, కుమారునికి, తల్లిపైన, తల్లికి కుమారుని పైన ఉన్న వాత్సల్యము, మాతృభక్తి. ఈ రెండింటి సన్నిహిత సంబంధమే భగవద్భక్తిగా మారిపోతుంది. దీనిని వాత్సల్యభక్తి అనిభాగవతమునందు ప్రకటించారు.

 

సఖ్యభక్తి దీనికి ఉదాహరణ గోపబాలురు.

 

మూడవది విరోధ ప్రేమ. ఏదోవిధముగా భగవంతునికి వారు సన్నిహిత సంబంధులైనారు. కంసుడు, జరాసంధుడు దంతవక్రుడు, పౌండరీక వాసుదేవుడు. ఇలాంటి వారంతా క్షణక్షణము కృష్ణుని ద్వేషించి, ఏ నిమిషములో ఎక్కడ కనిపిస్తాడా? ఏ నిమిషంలో కృష్ణుని నామము మనము వింటామా? అని రాత్రులయందు నిద్రలో కూడా కలవరించే వారు. విశ్వాసమున్న వారికే స్వరూపమును చూచినప్పుడే ప్రేమ వస్తుంది. ఏదో పటమును చూచినప్పుడే ప్రేమ వస్తుంది. కాని విరోధమున్న వారికి ఎల్లవేళల రాత్రులందు నిద్రయందు కలయందు కూడ ఆరూపాన్ని చింతించటమే ఆ నామాన్ని స్మరించటము ఎల్లప్పుడు ఉంటుంది.

 

విరోధ భక్తితో సర్వదా సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనే చేస్తుంటారు. విరోధులు. ఈ విధముగా భగవంతుని నామమును, రూపమును, వారి హృదయాలలో చిత్రించబడి పోయింది. ఆ విధమైన సంబంధముతో కృష్ణునిలో వారు ఐక్యమై పోయినారు.

 

నాల్గవది గోపికాభక్తి. దీనికి మధుర భక్తి అని మరొక పేరు. ఉదాహరణ గోపికలు. వీరికి నిరంతరము కృష్ణ చింతన తప్ప అన్య చింతన లేదు.

 

"బ్రహ్మవిద్ బ్రహైవ భవతి" అని మన భావములు ఎట్లా ఉంటే భగవంతుని భావము తత్త్వము కూడ ఆ రీతిగానే తెలియజేస్తుంటాడు. ఈ రీతిగా నిరంతరము కృష్ణచింతన చేయటములో వారి దేహాలు కూడ కృష్ణమయముగా మారి పోయినాయి. "యద్భావం తద్భవతి"

(ని.వె.పు. 159/169)

 

ఈనాడు ఆధ్యాత్మికమునకు అనేక అంతరాయములు కల్గుతున్నాయి. అయితే, ఇవన్నీ తాత్కాలికమైనవే గాని, శాశ్వతమైనవి కావు. మానవుని మనస్సు అసలే చంచలమైనది. దానికి మరింత చంచలత్వమును పెంచే వాతావరణం ప్రపంచంలో అధికమౌతున్నది. కారణమేమిటి? ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా అనేకమంది మాతాజీలు, స్వాములు, బాబాలు పుట్టుకొస్తున్నారు. ఎవరివైనా సరే, ఒక్కసారి నమ్మిన తరువాత జీవితాన్ని చాలించేవరకు ఆ నమ్మకాన్ని నిల్పుకోవాలి. దైవం ఒక్కడే. "ఎకంసత్..." అదే నిజమైన దైవత్వం. ఆ ఒక్కదానినే మీరు ఆశించండి, విశ్వసించండి. అనవసరంగా వారివద్దకు, వీరివద్దకు పోయి మీలో ఉన్న నమ్మకాన్ని పాడు చేసుకోవద్దు. ఒక చోట మొక్కను నాటిన తరువాత దానికి ఎరువు వేసి నీరు పోసి పెంచాలి. అట్లుగాకుండా, ఆ మొక్కను ఇక్కడ కొన్ని రోజులు, ఆక్కడ కొన్ని రోజులు...... ఈ రీతిగా పెరుకుతూ పోతూ ఉంటే అది ఎంతకాలం బ్రతుకుతుంది? అట్లే, ఆధ్యాత్మిక మార్గంలో ఇష్టమొచ్చినట్లు గురువులను మార్చుకోవడంవ్యభిచార భక్తి అవుతుందేగాని, నిజమైన భక్తి కాజాలదు. అలాంటి చంచలత్వానికి మీరు తావీయకూడదు. అందరియందు భగవంతుడున్నాడని విశ్వసించండి. ఎందుకంటె మమైవాంశోజీలోకే జీవభూతస్సనాతనః అని భగవద్గీత  చెప్పింది. కనుక, అందరినీ భగవత్స్వరూపులుగా భావించండి, తప్పులేదు. కాని, ఇది వదలి అది, అది వదలి మరొకటి.... ఇలా మార్చుకునే వారు దొంగ భక్తులే గాని, సరియైన భక్తులు కారు. మీ భక్తి నిర్మలమైనదిగా, నిశ్చలమైనదిగా, నిస్వార్థమైనదిగా ఉండాలి. ఎన్ని కష్టనష్టములు సంభవించినా వాటిని తట్టుకొని, నెట్టుకొని ముందుకు సాగాలి. ఎంతో మంది భక్తులు, సాధువులు, మహనీయులు, పతివ్రతలు ఎన్నోకష్టములను ఎదుర్కోవలసి వచ్చింది. కాని, వారు పట్టిన పట్టు విడువకుండా దైవాను గ్రహాన్ని సాధించగల్గారు. మహాభక్తురాండ్రైన మీరా, సక్కుబాయిలు ఎన్ని కష్టములకు గురి అయినారో మీకు తెలుసు. మీరాను భర్తయైన మహారాణాయే తప్పు పట్టిబయటికి నెట్టాడు. ఆ సంఘటనఆమెకు షాక్ మాదిరి తగిలింది. అయితే, అది ఒక్క సెకండు మాత్రమే. తక్షణమే ధైర్యాన్ని కూడదీసుకొంది. "చలోరే మన్... గంగా యమునాతీర్, గంగా యమునా నిర్మల్ పానీ, శీతల్ హొత్ శరీర్.... చలోరే మన్...." అని పాటుకుంటూ ద్వారకకు బయల్దేరింది. ఇద, పింగళ -ఈ రెండింటికీ మధ్యనున్న సుషుమ్నయే గంగాయమునా తీరము. అక్కడి వెళ్ళవలసిందిగా ఆమె తన మనస్సుకు బోధించింది. అలాంటి స్థిరమైన భక్తిని మీరు పోషించుకోవాలి.(స. సా.అ.. 2001 పు. 295) 

 

చిత్తశుద్ధి, దృఢవిశ్వాసములతో కూడినదే భక్తి. (స.సా.మ. పు 1 2021)

 

సకలశాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై
                         వేదాంత వేద్యుడా విప్రుడైన
భక్తి యేపారగ రమ్య హర్మ్యంబుల
                          రంజించు రాజచంద్రముడునైన
రణరంగమందు పరాభూత రిపుడొచు
                          వెల్గొందు జగదేక వీరుడైన
దారిద్ర్య దేవతా దాక్షిణ్యమున గుందు
                         దౌర్భాగ్య విభుడగు దాసుడైన

భక్తి లేనిచో ఎందుకూ పనికిరాడు
భక్తిరహితుడగు జగద్భర్తకన్న
భక్తి పరుడగు దాసుడే వంద్యుడగును;
ఇంతకన్నను వేరేది యెఱుకపరతు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులారా !
(భగవాన్ శ్రీ సత్యసాయిబాబా నవరాత్రిదివ్యోపన్యాసములు పుట28)
 

 

భక్తి, భక్తి, భక్తి, భక్తి, భగవంతునితో ఎడబాటు కలుగనిదే భక్తి.  భగవంతునితో విభక్తము కానిదే భక్తి. (శ్రీసత్యసాయి విద్యార్థి వాహిని పు 112)

 

భక్తిలో శక్తి –
"భక్తి చేతనే ఆత్మజ్ఞానము పొందవచ్చును. భక్తి, హృదయమును పవిత్ర మొనర్చును. భావములను ఉత్తేజ పరచును. సర్వదృష్టి నొసగును. భగవంతుని కృపను అందుబాటు లోనికి తెచ్చును. సస్యములు తమకు జీవనాధారమైన జలము కొరకు, పైకి, తమ కడకు రాజాలవని, మేఘములే క్రిందికి దిగి వర్షించుతాయి. పసి బిడ్డ తల్లి వద్దకు రాలేదు కాబట్టి, తల్లే, బిడ్డను ముద్దాడుటకు ఊయల వద్దకు వచ్చి వంగి బిడ్డ ముద్దునందు కుంటుంది. అదే విధముగ భక్తులను సంరక్షించుటకు భగవంతుడే క్రిందకు దిగివస్తాడు. ఆయనను క్రిందకు రప్పించగల శక్తి  భక్తి లో ఉన్నది.”- బాబా (సాలీత పు. 95)

 

భక్తి - ముక్తి 

భక్తి అంటే భగవన్నామాన్ని జపించడం, స్తోత్రాలను పఠించడం అనుకుంటారు. వీనిద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చునని భావిస్తుంటారు. మీరు చేసే పనులు, మీ ఆలోచనలకు, మాటలకు అనుగుణంగా ఉండాలి. అంటే త్రికరణశుద్ది ముఖ్యం గాని, భగవంతుని నామాన్ని ఎంతకాలం జపించారు? భగవంతుని విగ్రహం ఎదుట ఎన్నిసార్లు సాష్టాంగపడ్డారు అనేది లెక్కలోనికి రాదు. మానవ సేవయే ఉత్తమమైన మాధవ సేవ అని వ్యాసమహర్షి ప్రకటించారు. ఎల్లప్పుడూ సహాయమే చేయి, ఎవ్వరికీ హాని తలపెట్టకు. అదే భగవంతునిపట్ల నిజమైన భక్తి అనిపించుకొంటుంది. నిజానికి ఎదుటి వ్యక్తి కూడా నీవేనని గ్రహించాలి. ఈ సత్యమును గుర్తించినప్పుడే ముక్తి. మీ సంతోషమును, మీ సంపదను, మీ విజ్ఞానమును మీకంటే తక్కువ స్థితిలో ఉన్నవారితో కలసి పంచుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడు మీకు దైవకృప తప్పక లభించగలదనడంలో ఎట్టి సందేహమూ లేదు.- శ్రీసత్యసాయి (సనాతన సారథి నల్లగవ కవర్ పేజి జ 2022)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage