కోరు కోరికలన్నియు తీరుచున్న
భక్తి దైవమున హెచ్చురక్తి హెచ్చు
కోరు కోరికలేవ్వేని తీరకున్న
భక్తి తరుగును దైవ విరక్తి పెరుగు!
(సా॥ పు. 563)
కోరిక తీరిన వేళ ననుగొప్పగ పొగడెదరోయి
కోరిక తీరకపోతే ఊరక తెగడుదురోయి.
ఏదైనా కోరిక తీరితే ఎంతో పొగుడుతారు.కోరిక తీరకపోతే ఊరక తెగడుదురోయి.ఇది మానవుని బలహీనత, ఆత్మలో ద్వేష భావములకు, క్రోధ భావములకు ఏ మాత్రము అవకాశములేదు. నిర్మలంగా ఉంటుంది. ఆ నిర్మలత్వమే నిన్ను రక్షిస్తుంది.
(ద. య. స. పు. 94)
కొలది కొలదిగ పుట్టును తొలుత చెదలు
కొరికి తిని వేయు త్వరలోనే కొయ్యనంత
దుష్టగుణములు సూక్ష్మమై తోచు మొదలు
పిదప నాశంబు చేయు నే పెద్దనయిన
కోరికలనే దారాల చేరికచేతనే మనస్సనే వస్త్రం తయారవుతుంది. కోరిక అనే ఒక్కొక్క దారం తీసేస్తే మనస్సనే వస్త్రం ఉండదు. మనస్సు యొక్క వికృత రూపమే మోహం, మోహక్షయమే మోక్షము.
"మనయేవమనుష్యాణాం కారణం బంధమోక్షయోః" మానవుడు లౌకిక జీవితంలో బంధితుడవ్వటానికీ, విముక్తుడవ్వటానికి మనస్సే కారణం. తీరిన ప్రతి కోరికా మరో కొత్త కోరికకు అంకురమై చెదలవలె పెరిగి మానవుడు దుర్భావ, దుర్మార్గం, అశాంతికి గురౌతాడు.
రైల్వే ప్లాట్ఫా రమ్స్ మీద "Less luggage more comfort; make travel a pleasure"అనే ప్రకటనను చూస్తూ ఉంటారు. జీవితమనే ప్రయాణంలో కోరికలనే Luggage ఎంత తక్కువ వుంటే ప్రయాణం అంత సుఖంగా సాగుతుంది. ఆహార నిద్రాభయ మైధు నా దులు మానవులకేకాదు. పశుపక్షి మృగాలకి కూడా ఉంటాయి. జీవితం వీటికే పరిమితం చేసుకున్న మానవునికీ, మృగానికీ తేడా లేదు. మానవుడికి బుద్ధి దైవమిచ్చిన వరం. "బుద్ధి గ్రాహ్యమతీంద్రియం" ఆత్మ యొక్క ప్రేరేపణే బుద్ధి. ఇది సదాలోచనలను సత్కర్మలనే ప్రో త్స హిస్తుంది. దీనినే వాడుక భాషలో అంతరాత్మ అని కూడా అంటాము. ఇంద్రియాల ప్రేరణవల్ల కలిగిన కోరికలే మనస్సు, శరీర ఇంద్రియాల అధీనంలో ఉంటుంది.
మన దేహమనేటటువంటి రథానికి ఇంద్రియాలనే గుర్రాలు కట్టి, బుద్ధి అనే సారధి, మనస్సనే కళ్ళెం పట్టి నడిపిస్తే సక్రమమైన మార్గంలో పయనించి శాంతి అనే గమ్యం చేరతాము. దురదృష్టవశాత్తూ రథానికి మనస్సునే సారధిగా పెట్టుకోవడం చేత ఇంద్రియాలు స్వైరవిహారం చేస్తూ వుంటే మానవుడు చెడుమార్గంలో భోగభాగ్య విలాసాలవైపు పయనిస్తూ అశాంతికి గురౌతున్నాడు. స్వార్థం, ఆహంకారం, దురాశలే అశాంతికి కారణం. మనస్సు యొక్క ఉద్రేకాలను బుద్ధి సహాయంతో, సకాలంలో ప్రయత్నపూర్వకంగా అణగద్రోక్కి సన్మార్గ వర్తనుడై మానవుడు జీవితంలో సంతృప్తి, శాంతి సాధిస్తాడు.
(శ్రీప. వా, పు. 29/30) –
పుట్టుకకు చావుకు మూలకారణము కోరిక. కోరిక లేని వారికి పుట్టుక చావులేవుండవు. విత్తనమే లేకుండినమొక్కనేలేదు. చెట్టేవుండదు. పునర్జన్మము యొక్క నైజము ఈ జన్మములో తీరని కోరికలవల్ల నిర్ణయించబడుతుంది. వస్తువులపై యెట్టికోరికా లేనివారికి ఆత్మజ్ఞానము సాధ్యమవుతుంది. దైవజ్ఞానమును దైవ ప్రేమను పొందాలనే కోరిక, కోరిక కాదు. అది పరవిద్య యొక్క పవిత్ర సంకల్పము. ఇదే బ్రహ్మ విద్య. దైవజ్ఞానమును మంటలో సర్యలౌకిక కోరికలూ భస్మమయి పోతాయి. కోరికలు ముగించి పోగానే జీవాత్మ పరమాత్మవైపునకు కదలుతుంది. ఆత్మలో పరమ శాంతిని అనుభవిస్తుంది. జీవాత్మ, అనాత్మతో బంధనాలు తెంచుకొన్నట్లు అయితేనే జీవాత్మ చిరంజీవత్వమును పొందుతుంది.
(వి.వా. పు. 22)
(చూ: ఆశలు, కాలము, మనసు, రాధ)