మనస్సును భగవదర్పితము గావించినప్పుడు సర్వమూ లయమైపోతుంది. మన సమస్తకర్మలకు మూలకారణము మనసే కనుక నీ మనసును భగవదర్పితము చేసినప్పుడు సర్వము అందులో లీనమై పోతుంది. భగవంతుని చింతనలో మనసును యిమడ్చినప్పుడు సర్వము విష్కామకర్మగా మారిపోతుంది. కర్మ, వికర్మ, ఆకర్మలని మూడురకములుగా వుంటున్నాయి.
సారమైనది చమురురా సత్యమైనది వత్తిరా
వెలుగు తిరిపోయేటప్పుడు వెంట నెవ్వరు రారురా
రామభజన చేయరా రాజ్యమంతా వెలుగురా.
సారమైనది చమురు, సత్యమైనది వత్తి. ఈ రెండు చేరినప్పుడు వెలుగు వస్తుంది. వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారు. చమురు రాదు, వత్తిరాదు. సారమైనది చమురు, సత్యమైనది వత్తి. ఈ రెండింటికి ఒక ప్రమిద వుండాలి కదా! ఆదియే మనదేహము. మన కోరికలు చమురు. మన జ్ఞానమే వత్తి. ఆనందమే వెలుతురు. వత్తి ఒక్కటి మాత్రమే అంటిస్తే బుఱ్ఱున కాలిపోతుంది. ఆయిల్ ను అంటిస్తే అంటుకోదు. ఆయిల్ వత్తి రెండు చేరినదానిని వెలిగిస్తే వెలుగుతుంది. కర్మ అనేది ఆయిల్. మనస్సనే వత్తి బుద్ధితో చేరివుంటుంది. ఈ రెండు చేరేటప్పటికీ అకర్మగా మారిపోతుంది. ప్రకాశము వస్తుంది. ఈ జ్యోతికి అనేక గుణములుంటున్నాయి. కాని ప్రకాశమునకు ఒకే గుణము. గాలి వస్తే ఈ జ్యోతి అటూ ఇటూ ఆడుతుంది. నీళ్లు పడితే చిటపటమని శబ్ధమిస్తుంది. పొగ వస్తుంది. వేలు పెడితే కాలుతుంది. జ్యోతి మాత్రము అందరికి వెలుగునిస్తుంది. వెలుతురు నందించటమే దాని ముఖ్యగుణము. అందరికి సమానముగా వెలుతురును ఇస్తుంది. అదే నీలో ఆత్మజ్యోతి. అది అందరి యందు సమానముగనే వుంటుండాది. ఈ జీవనజ్యోతి అనే దానిలో యీ విధమైన చిటపటలు, పొగలు ఆడటము, పాడటము,చంచలత్వము యివన్నీ వుంటున్నాయి. స్టడీగా వుండే జ్యోతి కర్మ, ఆడేదే వికర్మ, వెలుతురే అకర్మ, దీనికి యేవిధమైన ఫలము వుండదు. అకర్మ అంటే కర్మను ఆచరించకుండా వుండడము కాదు. కర్మను ఆచరించి ఫలితమును కోరకుండా అందరికి సమత్వముగా అందించే స్వభావమే నిజమైన అకర్మ, అకర్మ అనగా కర్మ చేసియు కర్మ చేయనివాడుగా తయారౌతాడు. ఇది ఆధ్యాత్మికమునకు మాత్రమే సంబంధ మవుతుంది గాని లౌకికమైన దానికి పోల్చుకోరాదు.
(శ్రీస. గీ. పు 280/281)