ఈ కలియుగము నందు నామస్మరణ మన ప్రాణము. కృతయుగంలో ధ్యానము. త్రేతాయుగంలో యజ్ఞము, ద్వాపరయుగంలో అర్చనం, కలియుగంలో నామస్మరణ నిర్దేశించబడినవి.
"హరేరామ హరేరామ హరేర్నామైన కేవలం
కలొ నాస్త్యేవ నాస్త్యేవ గతి రన్యథా "
ఈ కలియుగంలో నామస్మరణకంటే సులభమైన మార్గము మరొకటి లేదు. ప్రయాణం చేస్తూ మనస్సులో నామస్మరణ చేసుకోవచ్చు. ఏ పనులు చేస్తున్నా నామ నామస్మరణ చేసుకోవచ్చు ఈ కలిలో ఇది అతి పవిత్రమైన అతి సులభమైన మార్గము.
(స.సా.మా.96 పు.68/69)
భగవంతుణ్ణి పొందటము మజ్జిగ చిలికినంత తేలిక. అందువల్లనే భగవంతుని హృదయాన్ని వెన్నతో పోలుస్తారు. వెన్న ఎంత మృదువో భగవంతుని మనస్సు అంత మృదువు, దాన్ని కరిగించటానికి కొద్దిపాటి వెచ్చదనం చాలు. అంటే బాధపడుతున్న తోటి వానిపై కొద్దిపాటి అభిమానం చూపించటము. భగవంతుని నామం - పలికేటప్పుడు కాస్త ఆర్తి కనబరచటము అన్నమాట. నామస్మరణ చేసేటప్పుడు కలిగే చైతన్యమంతటికీ నామమే మూలస్థానము. అదే ప్రాణ ప్రదమైన అమృతము. మానవుని శక్తికంతటికీ అదే ఊట. నామం స్మరించండి. నామి మీ యెదుట ఉంటాడు. నామ రూపాన్ని ధ్యానించండి. నామం మీ పెదవులపై ఉంటుంది. నామ రూపములు రెండూ ఒకే నామునకు రెండు ప్రక్కల వంటివి.
(వ.61-62పు.180/181)
నామస్మరణతోపాటు సేవలు అత్యవసరంగా చేయాలి: భగవంతుని ఆజ్ఞను శిరసావహించాలి. ఆజ్ఞను శిరసావహించటమే సరియైన సాధన. భగవంతునికి ఏది ప్రీతియో దానిని చక్కగా అనుసరించ టానికి ప్రయత్నించాలి. ఈనాటి మానవులంతా "నా కష్టములు తీరలేదు. నా బాధలు పరిహారం కాలేదు" అని విచారిస్తూంటారేగాని, “నేను భగవంతుడు చెప్పినట్లు చేస్తున్నానా? భగవంతుని ఆజ్ఞ శిరసావహిస్తున్నానా? భగవంతునికి ప్రీతికరమైన పనులు చేస్తున్నావా?" అని ఎవరిని వారు ప్రశ్నించుకోవడం లేదు. ఈ ప్రశ్న వేసుకుంటే తప్పక ధన్యులౌతారు. కాని, ఈ ప్రశ్న వేసుకోకుండా "భగవంతుడు చెప్పింది కాలేదే" అని వాదిస్తున్నారు. ఇది one way traffic కాదు! ఆజ్ఞను నెరవేర్చాలి, అనుగ్రహాన్ని పొందాలి. నీవు చేసుకున్నవి నీవు చూచుకొనిఅహంకారంలో మునిగిపోవడం మంచిది కాదు. దైవాభీష్టమును నెరవేర్చే కృషి నీవు చేస్తున్నావా? దైవమునకు తగిన తృప్తిని నీవు అందిస్తున్నావా? దైవాన్ని తృప్తి పరచనివాడు ఇంక ఎవరిని తృప్తి పరచగలడు? దైవాన్ని తృప్తి పరచితే లోకమంతా తృప్తి చెందుతుంది. లేకపోతే లోకమంతా విరుద్ధమవుతుంది. కనుకనే, రామకృష్ణ పరమహంస, "నీకు కానివాడనైతే లోకమాతా! నేను లోకమందు లోకునౌదు లోకమాతా!" అన్నాడు. కానీ, నీవు దైవాభీష్టమును నెరవేర్చకుండాపోతే నీ అభీష్టం ఎలా నెరవేరగలదు? "నేను స్వామికి చాల సమీపంగా పోతున్నానుగాని, స్వామి దగ్గరకు రావటం లేదు" అనుకుంటారు కొంతమంది. ఇది చాల పొరపాటు. అనిల్ కుమార్ నాకెంత దూరమో నేను అనిల్ కుమార్ కి అంతే దూరం. యిక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి యిక్కడికి ఒకే కొలతే. కానీ, అనిల్ కుమార్ అనుకుంటాడు. "నేమ స్వామికి దగ్గరే ఉంటున్నానుగాని, స్వామి నాకు దూరంగా ఉంటున్నాడని. నీవు స్వామికి దగరుంటే స్వామి నీకు దూరం ఎట్లా అవుతాడు? దోషం నీవు వేసుకున్న కొలతలోనే ఉన్నది. నీ నుండి స్వామికి ఒకవిధంగా, స్వామి నుండి నీకు మరొక విధంగా కొలతలు వేస్తున్నావు. కనుకనే, స్వామి దూరంగా ఉన్నట్లు గోచరమవుతోంది. భగవంతుడు ఎప్పుడూ ఎవరికీ దూరం కాడు. దూరమయ్యేది భక్తుడే. భక్తులలో శ్రద్ధా భక్తులు సన్నగిల్లే కొలది క్రమక్రమేణ భగవంతుడు దూరమవుతున్నట్లు గోచరిస్తున్నది. ఇది మీ భక్తిలోని దోషమేగాని, భగవంతుని శక్తిలోని దోషం కాదు.
(సా.శు.పు.58/39)
మానవుడు దివారాత్రము నామస్మరణముతో పవిత్రము చేయవలయును. ఆనందముతో ఆర్తితో స్మరించిన, ఏ నామములో, ఏరూపములో కోరుకొనినను, ఆరూపములో తప్పక ప్రత్యక్షమగును. ఏమతస్థుడు, ఏ కులస్తుడు, భజించినను, అన్ని నామములు, అన్ని రూపములు, నిత్య సత్యమైన, నిత్య సుందరమైన, ఆ భగవంతునివే కదా!
(సా.పు.291)
ఒకానొక సమయంలో నీ కుమారుడు ఏమి చదివాడో విచారించమని హిరణ్యకశిపుని నారదుడు కోరాడు. అప్పుడు తన కుమారుని రప్పించి హిరణ్యకశిపుడు "నాయనా! నీవు చదివిన చదువుల సారమేమిటి?" అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు...
"నారాయణః పరంబ్రహ్మ
నారాయణ పరం ప్రేమ
నారాయణ: పరంతపః
సర్వం నారాయణు: సమ"
"తండ్రీ! నారాయణ నామమే నా తపస్సు. నారయణ స్మరణయే నా పరబ్రహ్మ స్వరూపము. నారాయణ ప్రేమనే నా అనంత స్వరూపుడైన దైవత్వము. దానికి మించినది ఈ జగత్తులో మరొకటిలేదు. ప్రేమనే సర్వస్వరూపము" అన్నాడు. ఈ విధంగా ప్రహ్లాదునివలె మీరు నిరంతరం నామస్మరణ జరపాలి. జయదేవుడు, గౌరాంగుడు, తుకారాం, రామకృష్ణ పరమహంస మొదలైన సాధువులు, సంతులు నిరంతరం భగవంతుని ప్రేమను ఆశిస్తూ వచ్చారు. సక్కుబాయి, మీరాబాయిలు భగవంతుని కోసం వెక్కివెక్కి ఏడ్చారు. అట్టి దుఃఖముచేతనే దైవము సాత్కక్షారించి, వారికి అనుగ్రహప్రాప్తిని అందించాడు. కాని ఈనాటి కలిప్రభావంచేత ఎట్టి సాధనలు చేయక, కాలు గడపదాటక, కాసు ఖర్చుచేయక దైవము యొక్క అనుగ్రహం వచ్చి వడిలో పడాలని ఆశిస్తున్నారు. ఈనాడు మానవుని యందు ప్రేమ ప్రభావం క్షీణించిపోవటంచేతనే, ఎక్కడ చూచినా దుర్మార్గం, హింసలు తాండవ మాడుతున్నాయి. నీలో క్రోధం ఆవిర్భవించినచో, దానిని కూడా ప్రేమగా మార్చుకో. అసూయ నీయందు ఆవిర్భవించినచో, దానిని కూడా ప్రేమగా మార్చుకో జగత్తులో ఏది జరిగినా దానిని ప్రేమమయంగా విశ్వసించు. జగత్తుకు సర్వవిధములా కర్త ఒక్కడే. అతనే కర్మాధీనుడైనటువంటి దైవత్వము. కర్మాధ్యక్షుడు దైవము. ఒక బల్ల కావాలి. దీనిని చేసేవాడు ఎవరైనా ఒకరుండాలి గదా! ఒక ఇల్లు కావాలి. దానివి కట్టేటటువంటి వ్యక్తి ఒకరుండాలి గదా! అదే విధముగనే ప్రతి పదార్థమునందు కూడనూ, దానిని ఆవిర్భవింపజేసేటటువంటి భక్తి ఒకటి ఉన్నది. ఈ చరాచరములను సృష్టి గావించినటువంటి సృష్టికర్త భగవంతుడే. కనుకనే అతనికి "కర్మాధ్యక్షః " అని పేరు పెట్టారు. అన్ని కర్మలయందును తానే అధ్యక్షుడై ఉంటున్నాడు. ఏది చేయవలెననిన, ఏది చూడవలెననిన, ఏది అనుభవించవలెననిన, ఏది తినవలెననిన, ఏది త్రాగవలెననిన - అంతా ప్రేమమయంగానే ఉండాలి.
(శ్రీ సె.99 పు.8)
ఈ కలియుగమునందు నామస్మరణ చేయుటచేత నాలుక యొక్క పవిత్రత మరింత అభివృద్ధి అవుతుంది. జిహ్వను సార్థకము గావించుకోవాలంటే హరి నామకీర్తనము చేస్తూ రావాలి. "హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలమ్, కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథా" నామస్మరణకంటె ఆధికమైన మార్గముగానీ, అధికమైన సాధనగాని మరొకటి లేదు. మాటలచేత వ్యర్థము గావించుకొనే కంటె పాటలచేత సార్థకము గావించుకోమని బోధిస్తూ వచ్చింది గీత.
(శ్రీగీ.పు.57)
అజ్ఞానము దూరమే చేసుకోవాలంటే జ్ఞానము లభించాలి. చీకటి పోవాలంటే వెలుతురు రావాలి. అజ్ఞానము పోవాలంటే జ్ఞానము కలగాలి. జ్ఞానము కలగాలి అంటే అను గ్రహము కావాలి. అప్పుడే అజ్ఞానమనే గ్రహము దూరమైపోతుంది. త్యాగరాజు "రామా! నీ అనుగ్రహమనేది ఒక్కటుంటే నాకీ గ్రహము లేమిచేయగలవు అన్నాడు. మానవుని జీవితము కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్పర్యములతో ఆరాటపడేది కాదు. అను గ్రహము పైన ఆధారపడినటువంటిది. కనుక యీ అనుగ్రహానికై పాటుబడి మానవత్వాన్ని సార్థకము గావించుకొనే నిజతత్వములో మనము జగత్తుకు ఆదర్శప్రాయంగా నిలవాలి.” సతతం దైవచింతనం" “సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరి చింతనం" “నాస్తి నాస్తి మహాభాగ కలికాలసమం యుగం, స్మరణాచ్చింతనాదేవ ప్రాప్నోసి పరమాం గతిం" ఈ కలియుగము లోపల నామ స్మరణమునకు మించినది లేదు.
(శ్రీ.గీ.పు.120) –
నామస్మరణము అన్ని సాధనలకంటెను ఉత్తమమైనది. అది యభ్యుదయకారకమయిన సత్ప్రవర్తనము. ఆది యొక గొప్ప జపము. అమోఘమైన తపము. ఈనామస్మరణము వలననే కుచేలుడు శ్రీకృష్ణుని యనుగ్రహమును చూరగొన్నాడు. నీవు నామము స్మరించునపుడు, ఆనామమును నీ భక్తి తోను - ప్రేమతోను నింపుము. ఆది యే మీ కందరికిని అత్యంత సులభమైన మార్గము.
(స.వ.పు.21)
తనలో నివసించే పరమాత్మను గురించి నిత్యానందమును పొందవలెననిన నామస్మరణము అత్యవసరము. "శబ్దమే " బ్రహ్మస్వరూపము", మంత్రోచ్చారణ వలన నామస్మరణ వలన, నామ సంకీర్తవవలన శ్రేష్ట ఫలము లభించును. పరమాత్మము సులభముగా కట్టి వేయగలది ఒక నామము. నామస్మరణతో పరమాత్మను పొందవచ్చును. పరమాత్మలోనే లీనం కావచ్చును.
(సా.పు.39)
నాలుక పవిత్రంగా వుండాలంటే నామస్మరణే ముఖ్యం. - జయదేవుడన్నాడు. "రసజ్ఞే, మధుర ప్రియత్వం. సత్యం హి వందేత్వాం పరమోదం నమామి ఆవర్ణయేత్ మధురాక్షరాణి గోవిందా దామోదర మాధవేతి " రసజ్ఞుత్వం కలిగి సత్యమెరిగిన ఓ నాలుకా! పవిత్రము త్యాగ రూపమై గౌరవ మర్యాదలను కాపాడుకొనే ఓ నాలుకా! గోవిందా, - దామోదరా అనే నామాన్ని స్మరించు" అని నాలుకను గూర్చి ప్రబోధించాడు. ప్రధానమైనది సాధన, నామస్మరణతో, నాలుక పవిత్రత మరింత అభివృద్ధి చెందుతుంది. నిరంతరము హరినామ సంకీర్తన చేయాలి. "హరేర్నామ, హరేర్నామ, హరేర్నామైన కేవలం" నామస్మరణ కంటే అధికమైన సాధన మరొకటి లేదు.
(సా.పు.45)
సరిరాదు నీ నామస్మరణ కన్న!
జపహోమ నిత్యాగ్ని తపములు యెన్ని చేసినా
సరిరాదు నీ నామస్మరణ కన్న!
తీర్థ యాత్రలు యెన్ని తిరిగి సేవించినా
సరిరాదు నీ నామస్మరణ కన్న!
ఉపవాస వ్రతముల్ విడువక చేసినా
సరిరాదు నీ నామస్మరణ కన్న!
అశ్వ మేధంబులు అమితంబుగా చేసినా
సరిరాదు నీ నామస్మరణ కన్న!
అడవి లోపల ఆకులు అలము దినుచు
సంచరించిన సరియైన సన్ను తునికి
ఎన్ని చేసినా యివి అన్ని యేమి ఫలము ?
భక్తి లేకున్న సాధన ఫలము లేదు
సరచి పంచకోశముల యందు
ప్రభవ మందిన యింద్రియముల్ పట్టుబడక
సందియంబేల ? ఆత్మ ఆతండు కాదే||
(మధుర భక్తి పు175)