నిత్యజీవితంలో సంభవించునటువంటి స్వల్పమైనవానికే మానవుడు ఋణపడి ఉండినపుడు, జన్మనిచ్చి పోషించిన తల్లితండ్రులకు ఋణపడి ఉండటం లేదా? కన్నతల్లికి, పెంచిన తండ్రికి ఎంతో ఋణపడి ఉంటాము. ఇది మన కర్తవ్యమే. కాని జన్మించినంత మాత్రమున, పోషించినంత మాత్రమున ప్రయోజనం లేదు. సమాజంలో వ్యక్తిగా మానవత్వాన్ని ప్రకటించి సత్కీర్తిని ఆర్జించి గుణవంతునిగా చేసినటువంటిదే విద్య. ఈ విద్యను అందించినవాడు అధ్యాపకుడు. కనుక “తల్లి తండ్రుల కంటె అధ్యాపకులకు అతి ఋణపడి ఉంటున్నాను అన్నాడు అలెగ్జాండరు. కాని ఈనాడు అట్టి గుణవంతుడైన పుత్రుడు అరుదుగా కనిపిస్తున్నాడు. వారు చేసే పనులయందుకాని, వారి నడతల యందుగాని తల్లిదండ్రులు సరియైన బాధ్యత వహించటం లేదు. అధ్యాపకులు కూడ వారిని గుర్తించటం లేదు. ఇది అధ్యాపకులకు, తల్లితండ్రులకేకాక యావత్ మానవజాతికి వ్యాధి సంభవిస్తుంది. తన కుమారుడు ఎట్టివాడైనప్పటికి ధనార్జనచేసి, అతనికి అందించటమే తల్లి దండ్రుల యొక్క కర్తవ్యమని భావిస్తున్నారు. ధనమును సంపాదించి, లేక గృహమును కట్టించి, సదుపాయములు చేయటమే తల్లిదండ్రుల కర్తవ్యము కాదు. గుణవంతునిగా పుత్రుని తీర్చి దిద్దాలి. అట్టి విద్యను ఈనాటి బాలబాలికలయందు, యువకులయందు ప్రవేశపెట్టాలి. గుణముకంటే మించిన బలముకాని, ధనముకాని లోకములో లేదు.
కంచునందు మ్రోత ఘనముగా పలుకును
కనకమందు మ్రోత కానరాదు
అల్పులయందున ఆడంబరము హెచ్చు
పైన పూతలేల భక్తులకును||
కనుక ఈనాటి అణుకువలయందు నిజత్వము, మానవత్వము అంతర్లీనమై ఉంటుంది. కాని ఈనాడు గొప్పగొప్పవారు. విద్యావంతులు అభిమానమును, స్వార్థమును అభివృద్ధి గావించుకొని కుమారుల భవిష్యత్తును పెడమార్గము పట్టిస్తున్నారు. పుత్రాభిమానము చేత స్థానగౌరవాన్ని కోల్పోతున్నారు. కనుక మొట్టమొదట అధ్యాపకులు బాలబాలికలు హృదయములందు గౌరవ మర్యాదలను అభివృద్ధి గావించాలి. తల్లిదండ్రులను గౌరవించే విధానము నేర్పాలి.
(సా.మా.సా.భా. 2 పు. 50/51)
చిన్నతనంలోనే ఆధ్యాత్మిక సాధనలో ప్రవేశించినందుకు తమ బిడ్డలను దండించే హిరణ్యకశిపులవంటి తల్లిదండ్రులు నేడు ఉన్నారు. అంతేకాదు. వారిలో కొందరు తమ పిల్లల దుష్ప్రవర్తనను గమనించనట్లు, వారు సత్ప్రవర్తనే కలిగియున్నారని ఇతరులను భ్రమింపజేయడానికి కూడా ప్రయత్నిస్తారు. తమ పిల్లలను మంచి మార్గంలో పెట్టడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయరు. తల్లిదండ్రుల యొక్క ఇటువంటి స్వభావమువలన విద్యార్థులు దుర్మార్గంలో ప్రవేశించి ధృతరాష్ట్ర కుమారులవలె చెడిపోతారు. ఇందుకు విద్యార్థులను నిందించవలసిన పని లేదు. వారి దు ష్ర్ప వర్తనకు తల్లిదండ్రులే బాధ్యులు. ఆ దుష్ప్రవర్తనే విద్యాసంస్థలలో క్రమశిక్షణా రాహిత్యమునకు కారణభూతమవుతుంది.
(స.సా.న. 99 పు. 338)
దూషణ భూషణాలకు, తిరస్కారపురస్కారములకు ఏమాత్రం లొంగకండి. ప్రేమ తత్త్వాన్ని మాత్రం వదలకుండా చూచుకోండి. ఇదే ఈశ్వరాంబ చెప్పింది. ఆమె ఒకసారి వేసవి తరగతులకు వచ్చింది. గోగినేని వారింటికి నడచి వెళ్ళింది. తిరిగి వచ్చింది. కాఫీ త్రాగి కూర్చొంది. "ఏం స్వామి! ఈనాడు వేసవి తరగతుల క్లాసులు ఇంకా జరగటం లేదే? అన్నది. టైం ప్రకారం జరుగుతాయని చెప్పాను. కూర్చుంది. “స్వామి! స్వామీ! స్వామీ" అని మూడు సార్లు కేకవేసింది". “వస్తున్నాను వస్తున్నాను.... వస్తున్నాను" అని మూడు సార్లు సమాధానం చెప్పాను. "రండి త్వరగా ... రండి త్వరగా అలగా రండి త్వరగా..." అన్నది వచ్చాను. చేయి పట్టుకుంది. "మీరుఈ ప్రపంచానికి ఎంతైనా మంచి చేయగలదు. పెద్దలకంటే పిల్లలకు చేయాలి. మొదట విద్యార్థులను మార్చాలి. విద్యావంతులుగా కాదు, గుణవంతులుగా మార్చాలి" అని చెప్పి నా రెండు చేతులను తీసుకొని తన కండ్ల దగ్గర పెట్టుకుంది. ప్రాణం విడిచింది.
దేహాలు వస్తుంటాయి. పోతుంటాయి. విచారించ నక్కరలేదు అని చెప్పి వ్యాన్ తెప్పించాను. దానిలో ఆమెమృతశరీరాన్ని పెట్టించి, ప్రశాంతి నిలయం తీసుకొని పో మ్మనమని చెప్పాను. వెంట రామ బ్రహ్మమును పంపించాను. రామబ్రహ్మం చాలా మంచివాడు. ఏపని అయినా సరే శ్రద్ధతో పనిచేసేవాడు. కాబట్టి అతనిని పంపించాను. మరునాడు గోకాక్, భగవంతములు వచ్చారు. వేసవి తరగతులు లేవని ప్రకటించారు. ఎందుకు క్లాసులు లేవన్నారు? అని అడిగాను. తల్లిగారు పరమపదించారు. గదా! అన్నారు. మరణించుతే మరణించవచ్చు. క్లాసులు ఎందుకు రద్దు చేయాలి? అన్నాను. గోకాక్ ఆశ్చర్యపోయాడు. నన్ను కాదన లేక క్లాసులు జరుగుతాయని మరల ప్రకటించాడు. క్లాసులు యథా ప్రకారం ప్రారంభమైనాయి. ప్రతి దినం క్లాసుకుమొదట నేను వెళ్ళాలి కదా! "స్వామి వస్తారో, రారో అని పిల్లలు భయపడుతున్నారు. యథా ప్రకారం నేను వెళ్ళాను.
వెళ్ళేటప్పటికి పిల్లలంతా కంటి ధారలు కార్చారు. పుట్టినవారు చావక తప్పదు. చచ్చినవారు పుట్టక తప్పదు అని చెప్పి క్లాసులు జరిపించాను. ఆ విధంగా ప్రతిదానికి నేను తట్టుకొని, నెట్టుకొని ముందుకు సాగటం చేతనే నా కీర్తి గౌరవాలు పెరుగుతూ వచ్చాయి. సామాన్యులు అయితే భయపడుతారు. నేను ఆ విధంగా ప్రవర్తించలేదు. రామ బ్రహ్మం వెళ్ళేటప్పుడు తమరు వస్తే బాగుంటుంది గదా! అన్నాడు. అప్పుడు నేను "ఇవన్నీ ప్రాపంచిక సంబంధమైన విషయాలు. నాకు ఏ సంబంధమూ లేదు. అందులో నేను యిక్కడనే చూచాను గదా! ఇక్కడనే నేను ఆశీర్వదించాను. నేను చెప్పినట్లు చేయి" అన్నాను. అదే విధంగా చేశాడు రామబ్రహ్మం. ఆమెది కూడా సునాయాసమైన మరణం. ఇంకా ఏం కావాలి? ఆమె భర్త, అనగా ఈ శరీరానికి తండ్రి కూడా సునాయాస మరణమే. ఒకసారి ప్రశాంతి నిలయంలో భక్తులతో మాట్లాడుతుండగా ఆయన నా వద్దకు వచ్చాడు. ఎందుకు వచ్చావు? అని అడిగాను. స్వామీ! రెండు మాటలు చెప్పాలన్నాడు. "ఆయితే కూర్చో! వీళ్ళను చూచి తరువాత, నీలో మాట్లాడుతాను" అన్నాను. నాకు వీరు నా వారు, వారుపరాయివారు అనే భేదమే లేదు. అందరూ సమానమే. ఆ భక్తులతో మాట్లాడి ప్రసాదం యిచ్చి పంపించాను. ఆ తరువాత ఆయనను లోపలికి పిలిచి "ఎందుకు వచ్చావు?" అని అడిగాను. అప్పుడుఆయన బొడ్డులో దాచుకొనిన వందరూపాయిల నోటును తీసి నాకిస్తూ "నేను బీదవాడను. నాకు మరేవిధమైన ఆదాయం లేదు. ఈ డబ్బు తీసుకొని, నా పన్నెండవ దినమువ, నా సమారాధన చక్కగా జరిపించండి" అన్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంతలో జానకిరామయ్య కొడుకు రత్నాకర్. చిన్న పిల్లవాడు. తాతా! తాతా! అంటూ దగ్గరకు వచ్చాడు. పడుకొని, తన రొమ్ముల మీద ఆ పసిపిల్లవాడ్ని కూర్చోపెట్టుకున్నాడు.
నేనిప్పుడే స్వామిని చూచి వచ్చాను. నాకు ఏ శ్రమా లేదు. బాధలు అంతకన్నా లేవని చెప్పాడు. తన భార్యను పిలిచాడు. నీళ్ళు తీసుకొని రమ్మన్నాడు. నీరు తీసుకొని వచ్చింది. ఆ నీటిని త్రాగించమని చెప్పాడు. ఆమె ఆ నీరును త్రాగిస్తూ ఉన్నది. కన్నుమూశాడు. మంచి వారికి ఇలాంటి మరణాలే వస్తుంటాయి. ఆయనది కూడా సునాయాస మరణమే. జన్మలు మారినప్పటికీ దాని శేషం వుంటూనే ఉంటుంది. ఫాన్ స్పీడ్ గా తిరుగుతున్నప్పుడు స్విచ్ ఆపివేసినా మరికొంత సేపు ఫాన్ తిరుగుతూ తిరుగుతూ నిదానంగా ఆగిపోతుంది. తక్షణమే ఆగదు. అదేరీతిగా జన్మ సార్ధకానికి, జన్మ జన్మలూ తీసుకుంటారు. జననమరణాల తత్త్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఏ గర్భమున ఎవరు ఎప్పుడు జన్మించాలో సాధారణంగా ఎంపిక చేసే దివ్యశక్తి వేరొకటి ఉంటుంది. కాని నా జన్మము నేనే ఎంపిక చేసుకున్నాను. నా సెలక్షన్ కరెక్ట్ గానే ఉంటుంది. అందువలననే వారు వారి జీవితాలను చాలా ఆనందంగా గడిపారు. కనుక ప్రతి మానవుడుకూడానూ అలాంటి తల్లి దండ్రులను కలిగి ఉండాలి. అలాంటి తల్లిదండ్రులకు తగిన సేవలు మీరు చేయాలి. ఆసేవలలోనే ఉంటుంది ముక్తి. "న తపాంసి న తీర్థానాం న శాస్రానాం జపానహీ సంసార సాగరోద్దారే సజ్జనం సేవనం వినా" తపస్సు చేయనవసరం లేదు. యోగం చేయనక్కర లేదు. ధ్యానం చేయనవసరం లేదు.యజ్ఞయాగాదులుచేయనక్కరలేదు. నామస్మరణ ఒక్కటే చాలు. అప్పుడే అందరికీ పవిత్రమైన మరణం కలుగుతుంది.
ప్రేమస్వరూపులారా!
మన భవిష్యత్తును మనం ఈనాడే నిర్ణయం చేసుకోవాలి. మంచి భావంతో బ్రతకాలి. పరోపకారం చేయాలి. పిల్లల్ని ప్రేమించాలి. పెద్దలను గౌరవించాలి. ఆ గుణాలను పెంచుకుంటే చాలు. ఇంతకన్నా వేరొకటి చేయనవసరం లేదు. భజనలు... భజనలు.. భజనలు చేస్తున్నారు. భజనలే ముఖ్యం కాదు. మన ప్రవర్తన చాలా ముఖ్యం. దీనిని మీ హృదయాలలో వుంచుకొని, తల్లిదండ్రులకు ఆనందాన్ని అందించండి. అప్పుడే మీ జన్మ సార్థకమవుతుంది.
(శ్రీ - జూ. 2002 పు. 10/12)
(చూ గురువులు, ధృతరాష్ట్ర ప్రేమ, సంపద, హృదయవాసి)