అన్ని మతములూ బోధించే దైవత్వం ఒక్కటే. అందరూ దైవస్వరూపులే. ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి. క్రిస్మిస్ అనేది క్రిష్టియన్లు జరుపుకునే పండుగ అని మీరు భావిస్తున్నారు. కేవలం క్రిస్టియన్లే కాదు. ఇది అందరూ జరుపుకోవలసిన పండుగ. మానవత్వాన్ని ధరించిన ప్రతి వ్యక్తికి ఇది పండుగే. హిందువలని, క్రిష్టియన్లని, ముస్లింలని మత భేదములకు అవకాశమివ్వకూడదు. మీ మతిని విశాలం చేసుకొని హృదయంలో దైవాన్ని ప్రతిష్టించుకోవాలి. ఉన్నది ఒకే కులం, అదే మానవ కులం. ఉన్నది ఒకే మతం, ఆదే ప్రేమమతం. ప్రేమలేనివాడు హిందువు కాదు, క్రిష్టియన్ కాదు, ముస్లిం కాదు, సిక్కు కాదు; అలాంటివాడు రాక్షసుడనే చెప్పవచ్చు. కనుక, హృదయంలో ప్రేమను పెంచుకోవాలి. ఈ దేవుడు, ఆ దేవుడు అని భేదాలు పెట్టుకోకూడదు. అందరి హృదయమందున్న దేవుడు ఒక్కడే అని భావించాలి. అట్టి భక్తి ప్రపత్తులు ఒక్క ప్రకాంతి నిలయమునందు మాత్రమే గోచరిస్తున్నాయి. 64 దేశాలకు చెందిన క్రిష్టియన్లు ఈ ప్రశాంతి నిలయంలో ఏకమై క్రిస్మస్ పండుగ జరుపుకోవడం ఎంత అద్భుతం ! ఇలాంటి ఏకత్వమే నిజమైన భక్తి.
(స.పా.జ.2000 పు.13)