సముద్రము ఒక్కటే: దిక్కులను పట్టి సాగరమునకు అనేక పేర్లు ప్రకటింతురు. అదేవిధమున అనుగ్రహ సాగరుడైన పరమాత్మ ఒక్కడే; ఆయా యుగములను పట్టి అనేక రూపనామములు కల్పించుకొనుచున్నాడు, పుణ్యనదులు సాగరమున చేరుటకు అనేక మార్గములుగా అనేక దిక్కులు ప్రవహించుచూ (అనగా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర, వాయవ్య, ఈశాన్య, ఆగ్నేయ, నైఋతి ఈ అష్టదిక్కుల ప్రవహించిననూ) కట్టకడపట చేరునది ఒకే సాగరము: కాన మానవజాతి కూడా అనేక సాధన మార్గముల భగవంతుని కొల్చినను. కడకు కృష్ణ పరమాత్మయందే లీనము కావలెను.
(ప్ర. వా. పు.38)
ఒక కొయ్య ఏనుగు ఎంత కళాత్మకంగా జీవం ఉట్టిపడేటట్లు చెక్క బడినప్పటికీ అది బొమ్మే. అది ఎప్పటికీ నిజమైన ఏనుగు కలిగించే అనుభూతి కలిగించలేదు. అనేక గ్రంథములున్నప్పనటికీ లైబ్రరీ ఎన్నటికీ అధికారపూర్వకమైన గురువు స్థానం పొందలేదు. మీరు పది దేవాలయాలు తిరిగి చివరకు పదకొండవదిగా భావించి ఇక్కడకు వచ్చారు. అంటే తెలివితక్కువగా పది లైబ్రరీలు వలెనే భావించి ఈ పదకొండవ లైబ్రరీకి వచ్చినట్లున్నారు. ఇక్కడ మీరు చూడండి,వినండి,శోధించండి,పరిశీలించండిఅనుభవం పొందండి, ప్రతిఫలించండి. అప్పుడు మాత్రమే మీరు నన్ను, తెలిసికొనగలరు. అప్పుడు నేను ప్రేమ స్వరూపుడనని మీరు గ్రహిస్తారు. నేను ఇవ్వగలిగింది ఒక్కటే- ప్రేమ ద్వారా ఆనందం. మీకు ఓదార్పు, ధైర్యము, శాంతి ఇవ్వటం నా కర్తవ్యం. అంటే నా గుణాలు సనాతనమైనవి, అధికార పూర్వకమైనవి. నేను సృష్టించుకొన్న ఈ రూపం మాత్రమే నూతనమైనది. నా కోరిక ఒక్కటే, విశదంగా చెప్పాలి అంటే మీరు నన్ను అధికంగా అధికంగా ఆశించండి, అపేక్షించండి. నేను ఈ రూపం ధరించి మీ మధ్యకు ఇలా రావటంలోనే నా కోరిక మీకు అర్థమయి ఉండాలి.
(శ్రీ .స.వ. 61-62 పు.143)
సర్వులకు భగవంతుడు ఒక్కడే. ఏకస్వరూపాన్ని ధరించిన భగవంతుని అనేక భావములచేత అనేక నాముములచేత అనేక రూపములలో ఆరాధిస్తాడు. "ఏక ప్రభుకే అనేక నామ్" దైవము ఒక్కడే. హిందువులు కాని మహమ్మదీయలు కాని క్రిస్టియన్స్ కాని బౌద్ధులు కాని పార్సీలు కాని సిక్కులు కాని వేరు వేరు రూపములు ధరిస్తున్నా అందరికీ భగవంతుడు ఒక్కడే. ఏ పేరు పెట్టుకొని ఏ రూపమున ఆరాధించినా దైవానికే చెందుతుంది. కనుకనే "సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి " అన్నారు. ఎవరికి నమస్కారం చేసినప్పటికిని అదంతా భగవంతునికే చెందుతుంది. పాత్రలు వేరు వేరు కాని ప్రతిబింబము ఒక్కటే. అదేవిధంగా దేహమనే పాత్రయందు ఆత్మ తత్వమనే ప్రతిబింబము విడి విడిగా కనిపిస్తూ ఉంటుండాది. "ఒక సూర్యుండు సమస్త లోకములకున్ ఒక్కక్కడై తోచు!" సూర్యుడు ఒక్కడే. అమెరికన్ సూర్యుడని. బ్రిటిష్ సూర్యుడని, పాకిస్తాన్ సూర్యుడని, చైనా సూర్యుడని, భారతదేశం సూర్యుడని, పేరు ప్రత్యేకం లేదు కదా! ఐతే ఒక్కక్క దేశమువారు ఒక్కొక్క సమయములో ఆ సూర్యుని చూడవచ్చు. అందరూ ఒక్క తూరి చూడటనికి సాధ్యము కానంత మాత్రమున వేరువేరు సూర్యులని భావించటము వెట్టితనము కదా!
(బృత్ర. పు ౧౮౨)
విష్ణువే గొప్పని వైష్ణవు లనుచుండ
శంభుండు గొప్పని శైవు లనగ
గణపతి గొప్పని గాణాపత్యులు పల్క
శారద గొప్పని చదువరు లన
అల్లా ఘనుం డనుచు అల్ల తురకలు చెప్ప
క్రీస్తుయే గొప్పని క్రైస్తవులన
బుద్ధుడే గొప్పని బౌద్ధు లనుచుండ
మహావీరుడే గొప్పవి జైనులనగ
జోరాష్ట్ర గొప్పని పారశీలు చెప్పు
నానక్ గొప్పని సిక్కులనగ
సాయియే గొప్పని బాబా భక్తులు చెప్ప
అంద రొక్కటే యని కొందరనగ
సర్వమత సమ్మతంబైన దేవు డొక్కడే
అతడె సత్యము, అతడె ధర్మము
అతడె శాంతియు, ఆతడె ప్రేమ.
(స.సా.జ. 97 పు.1)
(చూ॥ అయిదవ పురుషార్ధము, ఏకత్వము, త్రికాండ స్వరూపము, ప్రేమమతం, భక్తి మార్గము, మార్పు, సగుణ భక్తి)