ప్రతి మానవునికి దేహము. మనస్సు, బుద్ధి, చిత్తము, ఆహంకారము యీఐదు శాంతి అనే సుఖనిద్ర పొందే నిమిత్తము వచ్చాయి. శాంతి అందించనప్పుడు దేహము ఎందుకు? మనస్సు ఎందుకు? బుద్ధి ఎందుకు? ఇవన్నీ చేరి నీకు శాంతి నందించాలి. కానీ అశాంతి నందిస్తున్నాయి. అశాంతి నిమిత్తమై ఏర్పడినవి కావు ఇవి. ఈ యింద్రియములు శాంతి నిమిత్తమై ఏర్పడినవి. ప్రతి వ్యక్తి యీ సత్యమును గుర్తించాలి. ఏనాడు ఇవి సరైన మార్గములో ప్రవేశిస్తాయి? నిర్మలమైన, నిస్వార్థమైన ప్రేమను పంచుకున్నప్పుడే శాంతి నందిస్తాయి. కనుక ప్రేమ ఇచ్చుకునేదే గాని పుచ్చుకునేది కాదు. ప్రాపంచిక సంబంధమైన ప్రేమకు, దివ్యమైన ప్రేమకు ఉండిన వ్యత్యాసమిదియే. ప్రాకృతమైన ప్రేమ పుచ్చుకుంటుంది. గాని యిచ్చుకోదు. కానీ పరమాత్మ ప్రేమ యిచ్చు కుంటుందిగాని పుచ్చుకోదు. ఎప్పుడూ ఇచ్చుకోవటమే. ఇదే పరమాత్మ ప్రేమకు ఉన్న ప్రధాన గుణము. రెండవది పరమాత్మ ప్రేమకు ఎట్టి భయము లేదు. ప్రాకృతమైన ప్రేమకు ఎవరేమి చెబుతారో ఎవరేమంటారోననే భయముంటుంది. కాని పరమాత్మ ప్రేమకు స్వార్థము లేదు. అందువలన భయము లేదు. ఇంక మూడవది. ప్రేమకు ప్రేమయే గమ్యము. ప్రేమ ప్రేమయే గాని పదార్థము కాదు. అందువల్లనే ప్రేమ త్రికోణములతో కూడినదన్నారు. ఒకటి ప్రేమ యిచ్చుకోవటం. రెండవది నిర్భయం, మూడవది ప్రేమకు ప్రేమయే ఫలము. ఇదే దివ్యమైన ప్రేమ.
(శ్రీ.స. పు.21/22)