లోకంలో ధర్మార్థ కామమోక్షములు పురుషార్థములని చెప్పారు. పురుషార్ధము అనే పదము యొక్క అర్థమును గుర్తించుకోలేని వ్యక్తులు ఇవి కేవలం మగవారికి మాత్రమే సంబంధించినవని భావిస్తున్నారు. అవి ఆశ్రమ ధర్మాలేగాని, ఆధ్యాత్మిక ధర్మాలు కావు. ఆధ్యాత్మిక ధర్మమే నిజమైన ధర్మము. పురుష అనగా ఆత్మ అని, చైతన్యమని, ప్రాణమని, జీవియని అర్థము. ఆత్మకు చైతన్యమునకు, ప్రాణమునకు, జీవతత్త్వమునకు పురుషుడు, స్త్రీ అనే లింగ భేదము ఏమాత్రము లేదు. కనుక ఆత్మధర్మమే పురుషార్థము, చైతన్యం యొక్క ధర్మమే పురుషార్థము, ప్రాణం యొక్కధర్మమేపురుషార్థము. ఆత్మధర్మమేమిటి? అదే సాయుజ్యము. అదే నిజమైన పురుషార్థము.
అర్థముఅనగా ధనము. కానీ పురుషుడు సాధించవలసినవి లౌకికమైన ధన కనక వస్తు వాహనాదులు కాదు. లౌకికమైన ధనము ఈనాడు ఉంటుంది. రేపు పోతుంది. భగవంతుని ధనము జ్ఞానధనమే "అద్వైత దర్శనం జ్ఞానం", అట్టి జ్ఞానమును సంపాదించాలి.
మూడవది కామంఇది లౌకికమైన దేహంతో అనుభవించే విషయవాసనలకు సంబంధించినది కాకూడదు. మోక్ష కామమును అభివృద్ధి పర్చుకోవాలి. తన స్వస్వరూపాన్ని దర్శించాలని, తన ఆత్మతత్త్వాన్ని గుర్తించాలనే కోరికను
కలిగియుండాలి. ముక్తి అనగా భగవంతుణ్ణి చేరటం కాదు. మన స్వరూపాన్ని మన సర్వస్వాన్ని వదలి భగవంతునిలో లీనం కావాలి. గంగ గోదావరి, సరస్వతీ నదులు ప్రవహిస్తున్నాయి. వాటి జలము తీయగా ఉన్నది. రూపము చూస్తే అనేక వంకర్లు, టింకర్లు తిరిగియున్నది. అయితే ఆ నదులు సముద్రంలో చేరినప్పుడు తమ రూపనామములను రుచిని కోల్పోయి, సముద్రం యొక్క రుచిని, రూపాన్ని పొందుతాయి. సముద్రంలో చేరిన తరువాత గంగ, గోదావరి, సరస్వతి అనే విభాగమేమైనా ఉంటుందా? ఉండదు. అదేవిధంగా, మీరు దైవత్వాన్ని పొందినప్పుడు ఇంకేవిధమైన విభాగమూ ఉండదు. అదియే అద్వైత దర్శనం. అట్టి దివ్యత్వాన్ని పొందుటమే నిజమైన పురుషార్థము.
(స.. సా.మా.99పు.71)
(చూ॥ పరమార్ధము, వైరాగ్యము)