కైలాసం అంటే స్వచ్ఛమైన పరిశుద్ధ స్ఫటిక స్వరూపం, నిష్కళంక పరమ పవిత్ర హృదయానికి ప్రతీకం. కైలాసగిరి నివాసుడు శంకరుడు. ఈశ్వరుడు పవిత్ర హృదయవాసి.
(త.పు.39)
"మనసులో ఆనందాన్ని అభివృద్ధి పరచుకుంటే అదే కైలాసం, కైలాసమును హిమాచల పర్వతమన్నారు. హిమ అంటే మంచుగడ్డ. చల్లదనం మంచు స్వభావం, తెల్లగా వుంటుంది. మంచు. తెలుపు పవిత్రతకు చిహ్నం. అచలము" అనగా స్థిరంగా ఉండేవి. చల్లదనమంటే ప్రశాంతము. అనగా పరిశుద్ధము. ప్రశాంతము, నిశ్చలము అయిన హృదయమే హిమాచలము. మనలో ఎప్పుడు ప్రశాంతత ఏర్పడుతుందో, ఎప్పుడు నిశ్చలత్వం కలుగుతుందో, అప్పుడే మన హృదయం ఈశ్వరుని నివాసమైన హిమాచల పర్వతమవుతుంది."
(సా.లీ.త పు.119)
మీ హృదయమే కైలాసం. అదే భగవంతుని నివాసం. అదే భగవంతుని విలాసం. కనుక, హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. నిత్యమూ దానిని విశ్వాసమనే విమ్ వేసి తోమాలి, ప్రేమ అనే జలం తో పరిశుభ్రం చేయాలి. అప్పుడే అందులో దివ్యత్వం ప్రకాశిస్తుంది. మీ హృదయాన్ని దైవంలో ఏకం చేసినప్పుడు మీకు కలిగే ఆనందం ఇంత, అంత అని - వర్ణించడానికి వీలు కాదు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది.
(స.సా.జ. 2000 పు. 22)
(చూ॥ హృదయవాసి)