మిమ్మల్ని సరిదిద్దడానికి అప్పుడప్పుడు నేను కోపం నటిస్తానుకాని, నిజంగా నాకు కోపం లేదు. కోపం వచ్చినప్పుడు ఏ తిట్టు తిడగాను? “దున్నపోతా " అంటాను, అంతే! అదే నా తిట్టు. నీవు మంచి కార్యాలు చేయకపోతే నిజంగా నీవొక Buffalo (దున్నపోతు) అనే చెప్పవచ్చు.
మంచి పనులు చేసినప్పుడే నీవొక Good fellow (మంచి వ్యక్తి అవుతావు, ఈనాడు అందరూ దున్నపోతులుగానే ఉంటున్నారు. కారణమేమిటి? మంచి పనులు చేయటం లేదు. వర్షం కురిసినప్పుడు ఆవులు, దూడలు పరుగెత్తుతాయి కాని, దున్నపోతు పరిగెత్తదు. ఉన్నచోటే తడుస్తూ ఉంటుంది. మీరు దున్నపోతులు మాదిరి తయారు కాకూడదు. మీలో పరివర్తన రావాలి. నేను ఆందరిని ప్రేమిస్తాను. ప్రేమయే నా స్వరూపము. ప్రేమయే నిజమైన శక్తి. నేను నా ప్రేమను అందరికీ ఏ రీతిగా పంచుతున్నానో, మీరు నా అంశమే కనుక, మీరు కూడా మీ ప్రేమను అందరికీ పంచండి. అప్పుడు నేను చేసినదే మీరు చేసిన వారౌతారు. అప్పుడు మీరు కూడా భగవత్స్వరూపులే! ఇట్టి పవిత్రమైన భావాన్ని మీరు అనుసరించినప్పుడు జగత్తంతా నిత్యకళ్యాణం, పచ్చతోరణంగా వర్ధిల్లుతుంది.
(స.సా అ. 2000 పు. 232/233)