యువకులు ఈనాడు Unity in diversity అనేకత్వములోని ఏకత్వమును అనుభవించటానికి ప్రయత్నించాలి. ఈ ఏకత్వమును అనేకత్వముగా భావించటంచేతనే ఈ లోకము అశాంతికి గురైపోయింది. పాకిస్తాన్ వేరు. ఇండియా వేరు: రష్యా వేరు. చైనా వేరు, ఆమెరికా వేరు అని ఈ రకంగా బేధములుండవచ్చుకాని అన్నీ కలిసి ఒకే భూమి పైన వున్నయికదా! ఈ రకమైన ఏకత్వమును మనము పెంచుకుంటే ఈ భిన్నత్వములో ద్వేషములు కాని అసూయలు గాని క్రోధములు గాని వుండటానికి వీలుకాదు.
Sky is one but stars are many
Nations are many but earth is one
Beings are many but breath is one
ఈ రకమైన ఏకత్వమును భావించుకుంటే నిజమైన ఆనందము మనలో ఆవిర్భవిస్తుంది.
(బృత్ర.పు. ౩౬)
శరీరమంటే ఏమిటి? కన్ను, ముక్కు, చెవి, కాలు, నోరు, కడుపు, తల అన్నీ చేరినట్టిదే - శరీరము. ఒక్కొక్క అంగము ప్రత్యేకించి ఒక్కొక్క శరీరము కానేరదు. అన్ని అంగములతో కూడిన మన శరీరమే "విశ్వం". విశ్వం విష్ణుస్వరూపం. స్వరమూ మనయందే ఉంటుందాది. దీనిని విభాగము చేయటము మంచిది కాదు. ఇది లౌకికము. ఇది ఆధ్యాత్మికము అని విభాగము చేయకూడదు. ఈ రెండింటి ఏకత్వమే దివ్యసృష్టికి మూలకారణము. ఒక విత్తనముండాది. ఆ విత్తనములో రెండు బద్దలుంటాయి. ఆ రెండు బద్దలు చేరినప్పుడే అది మొక్కగా, వృక్షంగా అభివృద్ధి అవుతుంది. రెండూ రెండు బ్రద్ధలుగా చిల్చివేస్తే సృష్టే ఉండదు. ఈ రెండు బ్రద్దల పైనను ఒక పొట్టు. చర్మము ఉండాది. దానినే సంస్కృతి అన్నారు. దీనిని అది, అది దీనిని వదలి ఉండటానికి వీలులేదు. ఈ రెండింటి ఏకత్వమే భారతీయ సంస్కృతి.
(బృత్ర.పు. ౬౬)
తనను తాను మరచిన వ్యక్తి సరియైన సత్యాన్ని గుర్తించలేడు. నీవే ఆత్మయైవుండి నీవు ఆత్మ నిమిత్తమై మరొక దానికి ప్రార్ధన సాధనగాని చేస్తే నీతత్వముయేరీతిగా గుర్తించగలవు? "ఏకోహం బహుస్వాం" ఒకటే అనేకముగా మారిపోవటం చేత భిన్నత్వములోని అభిరుచిని అభివృద్ధి పరచుకొని ఏకత్వమును విస్మరిస్తున్నావు. ఇవన్నియు అద్దములో కనుపించే ప్రతిబింబములవలె నీ ప్రతిబింబములే. బింబమును వదలి ప్రతిబింబమును విశ్వసిస్తున్నావు. నీవు భ్రమతో కట్టబడుతుంటున్నావు. భ్రమతో కట్టబడిన వానికి బ్రహ్మచిక్కడు. ఆత్మభావము అనుభవించాలనుకుంటే మనము చేసే సాధనలన్నీ నిరుపయోగమైనవి. ఐతే ఈ సాధనలన్నీ మనస్సును చల్లబరుస్తాయి. మనసును చల్లబరిచి ప్రయోజనము ఏమిటి? మనసే లేకుండా చేసుకొసుకోవాలి. గాని మనసును చల్లబరుస్తే తిరిగి వేడి ఎక్కవచ్చు.
(బ్బత్ర పు. ౧౨౫/౧౨౬)
పూర్వము అనేత్వాకమైన ఏకత్వముగా వుండేది. మానవుడు ఏకత్వాన్ని అనేకత్వముగా మార్చటానికి కారణం ఏమిటి? అభీష్టములే మూలకారణము. అభీష్టములు క్రమక్రమేణ మితిమీరి పంచభూతములకు సంబంధించిన వాంఛలు మితిమీరి పోవటంచేత మతిభ్రమణ జరిగింది. ప్రతిది అప్పటికప్పటికే ఫలితము లభించాలి. కాలము కోసము తాను కాచుకోడు. త్రికాల స్వరూపమైనదే ఈ త్రిగుణము. ఈ కాలము వచ్చిందంటే ఎవ్వరు ఆపటానికి వీలుకాదు.
"పోక న్మానదు దేహ మే విధమువన్ పోషించి రక్షించినన్
రాక న్మానవు హనివృద్దులు మహారణ్యంబునన్ దాగినన్".
ఈ సత్యాన్ని గుర్తించి కూడను వ్యక్తులు ఆత్రుత పడుతుంటారు. అక్కడికి పోతే ప్రమాదము తప్పుతుందో అని, యిక్కడవుంటే ఆదాయము లభిస్తుందోమో అని అనుకుంటారు. ఎక్కడ వుండినా వచ్చేది రాక తప్పదు. ఐతే పురుష ప్రయత్నం అత్యవసరము.
(బ్బత్రపు 09/one)
జీవ బ్రహ్మముల యొక్క ఏకత్వమును దృఢముగా గుర్తెరిగి అసంభావన - విపరీతభావములనుండి సంశయ నివృత్తి గాంచుటయే దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞాన మనబడును. అట్టి దివ్యమయిన జ్ఞానోదయము వలన అభాస అవర్ణము తొలగిపోవును.
(జ్ఞావా. పు 9)
మనిషి మాత్రం ప్రశాంతి నిలయంలో ఉండి మనస్సు మార్కెటంతా తిరుగుతుంటే ప్రయోజనం లేదు. భరతుడు రామునికి దూరంగా నంది గ్రామంలో ఉన్నప్పటికీ అతని మనస్సంతా రాముని పైనే ఉన్నది. కనుకనే, శ్రీరామ పట్టాభిషేక సమయంలో రాముడు, భరతుడు ఇరువురూ ఒకే రంగులో, కపిలవర్ణంగా ఉన్నారు. దీని అంతరార్థ మేమిటి? భరతుని మనస్సు రామునిలో లీనమైంది. అదియే సరియైన ఏకాగ్రత. అయితే, లక్ష్మణుడు మానసికంగా మాత్రమే కాదు, శారీరకంగా కూడా రామునితో ఏకమైపోయాడు. అతడు రాముని చెంతనే ఉన్నాడు. రామచింతనే చేశాడు. శారీరకంగా రాముణ్ణి సేవించాడు, మనస్సుతో రాముణ్ణిస్మరించాడు. కనుకనే, రామలక్ష్మణులు ఇరువురూ ఒక్కటైపోయారు. యుద్ధభూమిలో లక్ష్మణుడు మూర్చిల్లినప్పుడు రాముడు చాల బాధపడ్డాడు. అయితే, రాముడు కూడా సామాన్య మానవునివలె బాధ పడటమేమిటని మీరు అనుకోవచ్చు. లక్ష్మణుని యొక్క భక్తి ప్రపత్తులను, ఏకత్వమును నిరూపించడం కోసమే రాముడు ఆవిధంగా ప్రవర్తించాడు. "లక్ష్మణా! నీవు లేక నేను జీవించలేదు. ఈ ప్రపంచంలో వెతికితే నాకు కౌసల్యవంటి తల్లియైనా చిక్కవచ్చు. సీతవంటి భార్యయైనా చిక్కవచ్చు. కానీ, నీవంటి సోదరుడు చిక్కడు" అన్నాడు. అంతటి దైవ ప్రేమను ఆర్జించాడు లక్ష్మణుడు. అతడు రామునితో ఏకత్వం పాంచాడు. ఒకపర్యాయం ఎవరో అడిగారు - స్వామీ! అనేక చోట్ల రామమందిరాలు కడుతున్నారు. హనుమంతుని మందిరాలు కడుతున్నారు. మరి లక్ష్మణునికి మందిరాలు ఎందుకు కట్టకూడదు?" అని. నేను చెప్పాను - పిచ్చివాడా! రాముణ్ణి ఒక్కడినే ఎక్కడా ప్రతిష్ఠ చేయడం లేదే! రాముడెక్కడున్నాడో లక్ష్మణుడు అక్కడే ఉన్నాడు. రాముని ప్రక్కన లక్ష్మణుడు ఉండే తీరాలి. రామునితో లక్ష్మణుడు ఏకమైనాడు".
(స.సా.ఆ. 99 పు.258)
"సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష సహస్ర పాత్", భగవంతుడు వేలాది శిరస్సులతో, వేలాది నేత్రములలో, వేలాది పాదములతో కూడినవాడు. అనగా అన్ని శిరస్సులూ, అన్ని నేత్రములు, అన్ని పాదాములూ భగవంతునివే. వేదము "ఏకోహం బహుస్యాం," అన్నది. ఉన్నది ఒకటే; అనేకత్వం మీ భ్రమనే. దీనిని పురస్కరించుకొనియే వేదము చెప్పింది..
సహనా వవతు సహ నౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై
దీని అర్థమిది-
కలసి మెలసి పెరుగుదాం – కలసి మెలసి తిరుగుదాం
కలసి మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం
కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం
ఇదే భారతీయ సంస్కృతి బోధించినది. దీనిని మీరు ఆచరణలో పెట్టి అనుభవించండి. విద్యార్థులారా! మీరు పెద్ద పెద్ద డిగ్రీలు పొందినప్పటికీ మీ మాతృదేశ సంస్కృతిని మరువకండి. అనేకత్వంలోని ఏకత్వాన్ని బోధించినదే భారతీయ సంస్కృతి. ఏకత్వమును విభజించటం మన సంస్కృతి కాదు.
స. సా.జూ. 2000 పు.173)
దుర్జనుడు త్రాచుపామువంటివాడు. అట్టి వానితో సంబంధం పెట్టుకుంటే మీ జీవితం కూడా విషమయమై పోతుంది. కనుక, "త్వజ దుర్జన సంసర్గం”, దుస్సంగమునకు దూరంగా ఉండండి. అయితే, దుస్సంగమునకు దూరంగా ఉన్నంత మాత్రమున ప్రయోజనం లేదు: "భజ సాథు సమాగమం," సత్సంగంలో ప్రవేశించాలి. "కురు పుణ్య మహోరాత్రం," రాత్రింబవళ్ళు పుణ్య కార్యముల నాచరించాలి. "స్మర నిత్య మనిత్యతాం," ఏది నిత్యము? ఏది అనిత్యము? ఏది సత్యము? ఏది అసత్యము? అని చక్కగా విచారణ చేసి, ఏది నిత్యమో దానిని వరించాలి: ఏది అనిత్యమో దానిని త్యజించాలి. ఇదొక వెండి ప్లేటు, ఇదొక వెండి గ్లాసు, ఇదొక వెండి భరిణ. ఈ మూడిటి యొక్క రూప నామములు వేరువేరు గాని, వీటికి మూలాధారమైన వెండి ఒక్కటే కదా? రూపనామములు మార్పు చెందవచ్చును. కాని, మూలాధార తత్త్యం ఎన్నటికీ మార్పు చెందదు. శృంగారములు వేరు, బంగార మొక్కటే. పశుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే. జీవరాశులు వేరు, జీవుండు ఒక్కడే. పూల జాతులు వేరు, పూజ ఒక్కటే. అదేరీతిగా, మనుష్యులు వేరు వేరు రూపనామములను ధరించి యున్నారు గాని, అందరి యందున్న దైవత్వమనే మూలాధార శక్తి ఒక్కటే. అదే బ్రహ్మత్వం, అదే ఈశ్వరత్వం. రూప నామములు నిత్యమైనవి. వాటిని చూసి మీరు భ్రమించకూడదు: నిత్యసత్యమైన మూలాధార తత్త్వమును వరించాలి. ఇలాంటి ఏకత్వాన్ని గుర్తించి నప్పుడు జాతి, మత, కుల భేదములు దూరమైపోతాయి. ఉన్నదొకే కులం, అదే మానవకులం. ఉన్నదొకే మతం, అదే ప్రేమమతం, ఉన్నదొకే భాష. అదే హృదయ భాష కనుక, భిన్నత్వాన్ని దూరం చేసుకొని దివ్యత్వాన్ని అనుభవించండి. అల్లా అనవచ్చు. జీసస్ అనవచ్చు. రామా అనవచ్చు. కృష్ణా ఆనవచ్చు. ఏ నామాన్నైనా స్మరించవచ్చు. ఏ రూపాన్నైనా పూజించవచ్చు. కాని, దేవుడొక్కడే అనే సత్యాన్ని గుర్తించాలి.
(ససా.జా. 2000 పు.180)
భారతీయులకు రాయి మొదలు రత్నం వరకు, పక్షిమొదలు పారిజాతము వరకు, చీమ మొదలుకొని ఏనుగు వరకు, పామరుడు మొదలుకొని పరమహంస వరకు -- సకల పదార్థాలు పరతత్వాన్ని ప్రబోధించునవే. దీనిని పురస్కరించుకొనియే -- "సర్వం ఖల్విదం బ్రహ్మ". సర్యం విష్ణుమయం జగత్", "ఈశా వాస్య మిదం సర్వం" మొదలగు మహావాక్యములు పరమ సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చినవి. భారతీయుల సాంఘిక న్యాయం, ఏ ఇతర దేశములందును కనిపించదు. దైవత్వమును, ప్రేమ తత్వమును కేవలం మానవుల వరకే పరిమితం గావించకుండా, సమస్త జీవులయందు వ్యాపింప జేసే విశాల తత్యం భారతీయులది. ఇట్టి పవిత్రమైన సంస్కృతిని గుర్తించుకొనలేని అజ్ఞానులు భారతీయులను హేళన చేస్తుంటారు. భారతీయులు రాళ్లను, రప్పలను, వృక్షములను, కొండలను పూజిస్తుంటారని వారు హాస్యాస్పదముగా మాట్లాడుతుంటారు. ఏకత్వమునందు అనే కత్వమును చూడటం మానవ సహజం. కాని భారతీయుల సంస్కృతియందు అనేకత్వంలోని ఏకత్వమును గుర్తింపజేసే పరతత్వం ఇమిడి ఉంటున్నది.
(శ్రీ భ. ఉ. పు 127/128)
పరిపూర్ణమైన దైవత్వాన్ని పొందడానికి మీరు కూడా
పరిపూర్ణమైన వారుగా తయారు కావాలి!
"పూర్ణ మదః పూర్ణ మిదం
పూర్ణాత్పూర్ణ ముదచ్యతే
పూర్ణ స్య పూర్ణ మాదాయ
పూర్ణమే వావశిష్యతే".
భగవంతుడు పరిపూర్ణుడు కాబట్టి నీవు చేసే పనికూడా పరిపూర్ణంగా ఉండాలి.
ఇది పూర్ణమైన పెద్ద సర్కిల్. ఈ సర్కిల్ లోపల చిన్న సర్కిల్ వుంటున్నది. ఆసర్కిల్ లోపల యింకో చిన్న సర్కిల్ వుంటున్నది. ఆ చిన్న సర్కిల్ దేహము. ఆ పెద్ద సర్కిల్ మైండ్. అన్నింటికన్నా పెద్ద సర్కిల్ ఆత్మ. ఆత్మసర్కిల్ ఏనాటికి మారదు. దేహమనే ఈ చిన్న సర్కిల్ చాలా విశాలం చేసుకుంటూ ఒక విశాలమైన భావంలో ప్రవేశించాలి. ఈ చిన్న సర్కిలను విశాలం చేసుకుంటూ మధ్య సర్కిల్ లో ప్రవేశించాలి. మైండ్ తో కూడాలి. ఈ మైండ్ ను కూడా విశాలమైన మైండ్ గా చేసుకొని ఆత్మలో లీనం కావాలి. అప్పుడే అన్నిటి యొక్క ఏకత్వం ప్రాప్తిస్తుంది.
(దే.యు.క. పు.24)
అందరికి తప్పనిసరి అయినవి కొన్ని ఉంటాయి. వీటి ఏకత్వాన్ని గుర్తించాలి. కోటీశ్వరుడైనా ఆకాశాన్నుంచి ఊడిపడ లేదు. కూటి పేద మట్టి నుంచి పుట్టి రాలేదు. ఇద్దరూ తల్లి గర్భము నుండే పుట్టారు. ఇది ఏకత్వము. రెండవది ఆకలి. కూటి పేద అంబలి త్రాగవచ్చు. కోటీశ్వరుడు పంచభక్ష్య పరమాన్నములు భుజించవచ్చు. అన్నములు వేరు కాని, ఆకలి ఒక్కటే. ఈ ఏకత్వాన్ని మనం చూడాలి. మూడవది మరణం - కోటీశ్వరునకు, కూటి పేదకు మరణము ఒక్కటే. ఇది ఎవరైనా గుర్తించటానికి ప్రయత్నించవచ్చు. నాల్గవది దాహము - ఇరువురికీ దాహము ఒక్కటే. కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్స్ త్రాగవచ్చు. కూటి పేద కాల్వలో ప్రవహించే జలమును త్రాగవచ్చు. కాని, దాహములో భిన్నత్వము లేదు. కనుక అనేకత్వములోని ఏకత్వాన్ని మనము విచారణ చేస్తే ఇదే నిజమైన దివ్యత్వానికి మూలాధారము.
(శ్రీస. ది. పు. 90/91)
(చూ||గమ్యం ఒక్కటే, చైతన్యము, తెలివితేటలు, దైవబలము, ప్రేమ సందేశము, మనసు)