ఒక చేపకు పైన, క్రింద, చుట్టూ నీళ్ళు ఉన్నప్పుడే శాంతి! అదేవిధంగా మీ చుట్టూ భగవంతుని అనుగ్రహం ఉండాలి. ఈ అనుగ్రహం పొందటానికి దగ్గర దారు లేవీ లేవు. నామస్మరణ అనేది అన్నిటికన్నా క్షేమమైన మార్గము. కొందరు ప్రాణాయామం, హఠయోగం దగ్గర దారులని చెప్పారు. అవి ప్రమాదకరమైనవి. జాగ్రత్తగా ఉండండి. అటువంటి వాటిని వినకండి, ఆ పుస్తకాలు చదవకండి, వాటిని నమ్మకండి, వాటిని అభ్యాసం చేయకండి. పుస్తకాలు చదివి వాటిని ఆచరించటం వల్ల పిచ్చెక్కిన వారిని, అనారోగ్యం పొందినవారిని నేను ఎందరినో చూశాను.
(వ.61-62 పు.164)
పతి క్షేమము, పతి ఆనందము, పతి అభీష్టము, పతి సద్గతే తనకు సర్వరక్షగా భావించవలెను. అట్టి స్త్రీకి పరమాత్మ అనుగ్రహము అప్రయత్నముగా లభించును, వర్షించును. అట్టి స్త్రీకి పరమాత్ముడు సర్వవిధములా అండయై, నిండు దయను జూపును. అట్టి స్త్రీ సద్గుణముల చేత పతికూడను సద్గతి పొందును
(ధ. పు : 34, 35)
దైవము యొక్క అనుగ్రహము ఒక కిరణము మనకు వచ్చిందంటే ఎంతైనా సాధించవచ్చు. నీ కిరణములలో ఒక అణుమాత్రమైనా ప్రసాదించమని కోరుతూ వచ్చారు ఆనాటి మహర్షులు. దైవము యొక్క శక్తి కించిత్తు మనము సాధిస్తే అనంతమైన దానిని మనము సాధించవచ్చు. దైవానుగ్రహము లేకపోతే ఏమీ సాధించటానికి ఎవరికీ వీలుకాదు. ఎగరటానికి యిష్టము లేకపోతే గ్రద్ద ఒక యించైనా ముందుకు పోలేదు. నడచటానికి ప్రయత్నిస్తే చీమైనా కొన్ని మైళ్ళు పోతుంది. ప్రయత్నము అత్యవసరం. "యత్న ప్రయత్నముల్ మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము" నీవు దైవాధీనము పైన వెళ్ళు అన్ని success. Success begets Success. మనము అన్నిటి నీ సాధించాలంటే అనుగ్రహాన్ని సాధించాలి.
నా అనుగ్రహం ఉంటేనే నీ అభివృద్ధి కలుగుతుందని నీవు అనవచ్చు, కాని నా హృదయం వెన్నంత మెత్తనిది. నీ ప్రార్ధనలో కొంచెమైనా వేడి ఉంటేనే అది కరుగుతుంది. నీవు క్రమశిక్షణతో కొంత సాధన చేస్తేనే తప్ప అనుగ్రహం నీ అందుబాటులో ఉండదు. ఆర్తి, కోరిక తీరలేదనే తపన ఆ వేడే నాహృదయాన్ని కరిగిస్తుంది. ఆ తీవ్ర వేదనే అనుగ్రహాన్ని సంపాదిస్తుంది. - శ్రీ సత్యసాయి బాబా (నా బాబా నేను పు190)