భక్తి యొక్క సారమే సేవ.భక్తునికి అదే శ్వాస, అదే విశ్వాసం.భజన,ధ్యానము, యోగము మొదలైన సాధనలకన్న నిస్వార్థ,నిశ్చల,నిర్మల సేవయే చాలా ఉత్తమమైన సాధన.
“కోమలత్వంబు నిన్వార్థ గుణము కలిగి
సేవ చేయుటే నిజమైన సేవయగును
స్నేహభావంబుతో కూడిన సేవచేయ
శాంతి ధామంబు చేరుట సత్యమయ్య"
మనలో వాసనలు నిర్మూలించడమే సాధనలక్ష్యం. వాక్యును మనస్సుతో, మనస్సును బు ద్ధితో, బుద్ధిని అత్మతో విలీనం చేయడమేసాధన. నిత్య నిరంతర భగవన్నామస్మరణతోచేసిన నిస్వార్థ సేవే విలువైన సాధన. (స.సా.అ.2012 పు 406)
ఇది నా అదృష్టము. నా భాగ్యము, ఈ సేవచేసే ప్రాప్తి నాకు లభించింది అని ఉత్సాహపూరితమైన హృదయంతో మీరు సేవలలో పాల్గొనాలి. మీ ఆస్తిపాస్తులను బట్టిగానీ, మీ పేరు ప్రతిష్టను బట్టిగాని మిమ్మల్ని ఎంపిక చేయలేదు. మీ ప్రాప్తినిబట్టి మిమ్మల్ని నియమించాం. ఆ సుసంస్కారాన్ని మీరు సద్వినియోగ పరచుకోవాలి. ఇది పోయిందంటే మరి లభించేది కాదు. ఇదేదో సులభంగా లభిస్తుందని మీరు భావించరాదు. సముద్రములో ఉండే ముత్యము ఎంతో లోతుకు మునిగి, శ్రమపడి, క్రూరమృగముల బారినుండి తప్పించుకొని వాటిని వెలికే శక్తి సామర్థ్యము లుండినపుడే చేతికి చిక్కుతుంది. సంసారమే సాగరము. దైవత్వమే ముత్యము. అలాంటి ముత్యమును సంపాదించుకున్నారు. అది జారిపోతే తిరిగి చిక్కేదికాదు.
(జ.పు.190)
ముక్కు మూసుకొని సోహం..సోహం అంటూ కూర్చోవటాన్ని ప్రోత్సహించటం సాయి సిద్ధాంతం కాదు. సాధనా ! లే! నడుం కట్టుకి సమాజ సేవలో ప్రవేశించు, అని చెప్పటమే సాయి సిద్ధాంతం.సోమరితనానికి అవకాశం ఇవ్వకుండా వుండాలి. ఇంద్రియ తత్త్వాన్ని అర్థం చేసుకొని సాధక వృత్తిలో ప్రవేశించాలి. సేవ చేయని జీవితం చీకటి మందిరం, దయ్యాల కొంప. సేవ దివ్యభావాలను దర్శింపజేస్తుంది. మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుతుంది.
(సే.యో.పు5)
సేవ అనేది ఒక పదునైన కత్తివంటిది. దాని ప్రయోజనమును చక్కగా గుర్తెరిగి వ్యక్తి చేతిలో వున్నప్పుడు అది ఉపకారం చేస్తుంది. దాని స్థితిగతులు గుర్తెరుగనివారి చేతిలో వుంటే అపకారం చేస్తుంది. కర్మతత్వాన్ని గుర్తెరుగని - వ్యక్తులు కర్మక్షేత్రంతో ప్రవేశించి స్వార్థరహిత కర్మలకు స్వస్తి చెప్పి కేవలము స్వార్థ ప్రయోజనములకే అంకితము కావించుకొనుటచేత సేవ విలువ సన్నగిల్లుతున్నది.
సేవ అనేది మనం ఎవరిని ఆకర్షించేందుకు చేసే Art కాదు. మన సేవ Heart నుంచి వచ్చేది. Art is External, Heart is Internal Self Satisfaction ఉంటుంది. చెప్పేది చేయాలి. చేసింది చెప్పాలి, చెయ్యందే చెప్పరాదు.(సే.యో.పు.35)
అహల్య వంటి రాయి, రామపాదమువంటిపాదము రెండూ చెరినప్పుడే శాపవుమొచనం. సత్యసాయినుండి ప్రభువు, సాయిభక్తులువంటి సేవకులు ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా నివారణ కాగలవు.మనకిరువుఇకీ సన్నిహిత సంబంధ బాంధవ్యము ఏర్పడింది. సాయిని వదలి మీరుగాని, మిమ్మిల్ని వదలి సాయిగాని ఉండడం వీలుకాదు. దీనిని ధృడం చేసుకునిమీరు సేవలో ప్రవేశంచండి. (శ్రీ. న.2011 పు .3)
క్రమశిక్షణను కలిగి సేవాదీక్షను పొంది, సాధనాబలమును సంపాదించి, భక్తి శ్రద్ధలతో అందరిలోనూ నివసించే భగవంతుని గురుతెరింగి వారికి సేవ అనే పూజ సలుపవలయును.
(సే.యో.పు.43)
శ్రీసత్యసాయి సంస్లలయందు కేవలం ఆధ్యాత్మిక మార్గమే కాకుండా సర్వమూ ఆధ్యాత్మికముగా మార్చటానికి ప్రయత్నించాలి. మానవత్వములో ఏకత్వమును అభివృద్ధి పరచుకోవటం నిజమైన ఆధ్యాత్మికం. ఈ ఏకత్వం ఎలావస్తుంది? చేరిక (యోగం) అనేది మనస్సు యొక్క పరిశుద్ధత ద్వారానే చేకూరుతుంది. పరిశుద్ధ హృదయం లేకపోతే ఈ చేరిక ఏర్పడదు. కనుక హృదయాన్ని పరిశుద్ధం కావించి సేవయందే జీవితాన్ని అంకితం కావించాలి. సేవయందు పరులకు కావించే ఉపకారం కంటె తనకె ఎక్కువ ఉపకారం జరుగుచున్నది... సేవను యిచ్చుకోవాలి. ప్రేమను పుచ్చుకోవాలి.సేవ వన్వే ట్రాఫిక్ కాదు. పుచ్చుకోవలసింది ప్రేమనే కానీ పదార్థాన్ని కాదు. మనలో ఉన్న శక్తిని పరులకు అందిస్తూ కట్టకడపటి శ్వాసను సేవయందే వదలాలి. ఇదే సాయి ప్రధానాశయం.
(సే.యో.పు.52/53)
సేవకు ప్రధానమైన గుణములు దయ, వినయము, త్యాగము, ఇట్టి గుణములు కలిగిన వ్యక్తి మాత్రమే స్వార్థరహితమైన సేవలు సలిపి జగత్తుకు ఆదర్శాన్ని అందివ్వగలడు. అహంకారము, ఆడంబరమూ, అభిమానములతో ప్రవేశించినవాడు సేవ చేయలేదు. అహంకారము వలన మూలతత్వాన్ని విమర్శిస్తాడు. అభిమానము వలన పశుత్వాన్ని పొందుతాడు.అహంకారంఆడంబరం ఉన్నంతవరకూ ఆత్మవిశ్వాసం కలగదు. ఆత్మవిశ్వాసం లేనివాడు తనను తాను నమ్మలేనివాడు సమాజానికి ఏరీతిగా సేవ చేయగలడు. కనుక సేవలో పాల్గొనాలని ఉత్సాహపడేవాడు మొట్టమొదట తన అహంకారాన్ని అభిమానాన్ని అవతలికి నెట్టాలి. అహంకారం పోయినప్పుడు వినయం ప్రాప్తిస్తుంది. వినయవంతుగే సమాజ సేవలో పాల్గొనుటకు అధికారి అవుతాడు. కనుక ప్రతి మానవునియందున్న దివ్యశక్తి ఏకత్వమేనని గుర్తించి, ఏకాత్మభావం కలుగునంతవరకూ సేవకు అధికారి కాలేడు. ఈనాడు సేవా విధానము గుర్తించలేని వ్యక్తులు నాయకులు కావటం చేతనే లోకం అల్లకల్లోలాలకు ఆలవాలం అయింది.
(సే..యో పు.58/59)
"నీవు పూజ చేయుచున్నప్పుడు కాని, ధ్యానము చేయుచున్నప్పుడు కాని సహాయము కొరకు పిలుపు వినబడిన తక్షణమే విడిచి వెళ్ళి సహాయము చెయ్యి. ధ్యానము, పూజలవల్ల, నీవు సంపాదించు ఆధ్యాత్మిక ఫలము కన్న అట్టి సేవవలన లభించు ఫలము ఉత్కృష్టమైనది"
(స.శి.సు.తృపు.136)
జీవితమనే పరిమళ పుష్పములోని మకరందమే మనగా, ప్రేమతో ఇతరులకర్పించు సేవయే! అదే మానవులను దైవసన్నిధి చేర్చు పెన్నిధి. మానవులందరూ సోదర సోదరీలనే ఏకత్వ భావమును సేవదృఢపరచును. అన్నోన్య సన్నిహిత సంబంధమును స్పష్టముగా వెల్లడించును. సేవ వలన అహంకారము నిర్మూలమగును. అశాంతి దుఃఖములను దూరము చేసి, సంతోషముల నందించును. ఎవరికి సేవ చేసినా ఏమి చేసినా, అవన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయవలెను. సర్వ భూతాంతరాత్మయే ఈశ్వరుడు.
(స. సా.జ.76పు.262)
శిలల పూజలందు శ్రేష్టుండు నీవయ్యు
ప్రజల మెప్పుకొరకు పాటుపడియు
ఇట్టి పూజలెల్ల ప్రజలు మెచ్చిరి కాని
శివుడు మెచ్చు సేవ చేయవలయు
పర్షియా దేశీయుడైన అబూబెన్ ఏడం మానవతా వాదిగా పేరు పొందాడు. పేదసాదలకీ, రోగ గ్రస్తులకీ చేతనయిన సహాయం చేసేవాడు. అయితే ఖురాన్ పఠన, మసీద్ లో ప్రార్థన, రంజాన్ ఉపవాస దీక్షవంటి మతపరమైన ఆచారాలపట్ల విముఖత చూపేవాడు. అతడెన్నడూ దైవాన్ని తలంచలేదు.
అబూబెన్ ఏడంకి పరిచయస్తుడైన ముల్లా (మత ప్రచారకుడు) అబూని తరుచు కులుసుకుని ఇస్లాం మచారాలను నిర్లక్ష్యం చేయడం వల్ల భగవదనుగ్రహానికి దూరమౌతున్నావు అంటూ హెచ్చరించేవాడు. ఒక రాత్రి అతనికలలో ఒక దేవదూత బంగారు పుస్తకంలో ఏదో రాస్తూ కనపడ్డాడు. ఏమిటి రాస్తున్నారు. అని అబూ అడిగేడు. దైవాన్ని ప్రేమించిన భక్తుల పేర్లు అని దేవదూత చెప్పేడు. అందులో నా పేరుందా అని ఆబూ అడుగగా లేదని దేవదూత చెప్పేడు. ముల్లా చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది. ఆశ్యర్యపడలేదు. అయినా, అతడిలో మార్పురాలేదు. దైవారాధనపట్ల ఆసక్తి కలుగలేదు.
కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఓ రాత్రి ఆ దేవదూత కల్లో కనపడ్డాడు. ఇంకా మీ జాబితా పూర్తవ్వలేదా అని ఆబూప్రశ్నించేడు. ఈసారి దైవం ప్రేమించిన వ్యక్తుల పేర్లు రాస్తున్నాను అన్నాడు. అందులో నా పేరుందా? అని అబూఅడిగేడు. మొట్టమొదటి పేరు నీదే అని దేవదూత ఆ జాబితాను చూపెట్టేడు.
పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు దైవంలోని విశ్వాసానికి ప్రదర్శనలు. నువ్వు దైవాన్ని ప్రేమిస్తే చాలదు. దైవం నిన్ను ప్రేమించేలా చేసుకోవాలి. ప్రేమ స్వరూపుడైన భగవంతుడు చూసేది తోటి మానవుల పట్ల నీ ప్రవర్తన, సమాజ సేవ ద్వారానే మనిషి దైవానికి దగ్గరౌతాడు.
(శ్రీ.స.వా.పు.14)
ఆచరణయందులేని గుణములు యెన్ని వున్నప్పటికీ,
వాడు గుణహీనుడేగాని గుణవంతుడుకాడు.
ఆ వాసనలను దూరం చేయునదే సేవ.
దాచుకొన్నట్టిధనం తనదికాదు. ఇచ్చుకొన్నదే తనది అని
నేర్పునదే నిజమైన సేవ.
(అ.శ.పు.235)
ఏది సేవ?
“నాకు కర్మలు చేయటానికి లేక సేవలు చేయటానికి వ్యవధి లేద"నియు, కేవలము ఆఫీసు పనులున్నాయనియు ఇంకా అనేక విధములైన బాధ్యతలు కలవనియు సాకు చెప్పి తప్పించుకొనటము కేవలము ఒక బలహీనత. సేవలు చెయ్యాలంటే బజార్లు ఊడ్చి ప్రజలకు సేవ చేయటము మాత్రమే కాదు. నీ డ్యూటీ యందు కూడను, నీ పనియందు కూడను నీవు చేసే అధికారమందు కూడను సక్రమమైన రీతిగా ఆచరించటము కూడ సేవనే. నిజముగా ఈ అధికారులుగా ఉంటున్నవారు సేవలు ఏ విధముగా భావించాలంటే తాము పుచ్చుకొనే జీతమునకు తగిన పని చేయడమే అదే గొప్ప సేవ. కానీ ఏ పనివాడుకూడను, ఏ అధికారి కూడను తాను పుచ్చుకొనే జీతమునకు తగిన పనిచేసేవాడిగా కనుపించటం లేదు. ఇంకా ధనము అధికము కావాలి. అధికము కావాలి అని ఆశిస్తున్నాడే గానీ ధనమునకు తగిన కర్మలు ఆచరిస్తున్నానా లేదా అని తలచడు. ఇది దేశ ద్రోహముగా భావించుకోవాలి. ఇది ఎవరి ధనము? ప్రజల యొక్క ధనము. ప్రజలకు ఈ విధమైన అపకారము చేయుట కూడను సేవకు విరుద్ధమైన మార్గమే. ఒక అధ్యాపకుడుంటున్నాడు. అతను పిల్లలకు ప్రబోధం చేస్తున్నాడు. ఆ బోధలు ఉత్తమమైన మార్గములో చేయటము కూడ ఒక సేవయే. ఒక వ్యాపారి ఉంటున్నాడు, బజార్లో పోయి ఊడ్చనక్కరలేదు. తన వ్యాపారములో నిర్ణీతమైన ఆదాయమునకు మించి తాను ఏ మాత్రము ముందుకు పోకూడదు. అది కూడను ఒక సేవనే... ఉంచుకున్నప్పుడు వాడు సేవకుడని చెప్పకనే రూపొందుతాడు. తన మనసునకు తృప్తి పరచుకునే మార్గములో తాను ప్రవేశించాలి. “నేను. సక్రమముగా చేస్తున్నానా? లేదా?” అని తన conscience కు (మనస్సాక్షికి) చక్కనైన తృప్తినందించాలి. – బాబా (శ్రీ వాణి నవంబ ర్ 2021 పు 12)
సేవద్వారా సర్వజీవులలోని ఏకత్వమును తెలిసికొని అన్ని ఉపాధులలోనూ పరమేశ్వరుని ఆరాధించి ఆనందించవచ్చును. ధనవంతుని దగ్గర నెల జీతముకొరకు పనిచేయువానికి సేవాభావముండదు. తత్ఫలము నందుకొనుచూ దానికొరకు ఆశించుచూ సేవ చేసిన అది బంధన కారణమే కానీ మోక్షసాధనము కాదు. ఫలాపేక్ష లేక, అర్పణ బుద్ధితోగానీ, కర్తవ్య బుద్దితోగానీ చేయు పనులే సేవ అనబడును. - బాబా (సనాతన సారథి, మార్చి 2022 పు 23)