నగర సంకీర్తనము గురించి నామాటలివి - జయదేవుడు, గౌరాంగుడు, తుకారాము, కబీరు మొదలైన వారందరు తమ శక్తుల నభివృద్ధి పరుచుకొనుటకు, ప్రజల ఆధ్యాత్మిక శక్తుల నభివృద్ధి పరచుటకు దీనినొక సాధనగా ఆనాదిగా ఉపయోగించుచుండుట మనకి క్రొత్త విషయమేమియు కాదు. ఉదయాత్పూర్వమే, 4-30, 5 గంటల మధ్య లేచి అందరు ఒకచోట చేరి, భగవంతుని భజించుచు, నెమ్మదిగా వీధుల వెంట వెళ్ళవలెను. ఆ సమయమున నిదురించువారిని మేల్కొలిపి. వీధులలోని మలిన వాతావరణమును భగవన్నామముతో పవిత్రపరచుము.
ప్రేమ స్వరూపుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వ వ్యాపకుడైన పరమాత్మ భావనతో సూర్యోదయము (జ్ఞానోదయము) నీకు, ఇతరులకు కలుగునట్లు చేయుము. ఇంతకంటే నీకునీవు. ఇతరులకు చేయగల సేవ ఏమున్నది? అది నీకు ఆరోగ్యమును, ఆనందము నందించును. నీ ఇరుగు పొరుగువారి ముందిట్లు సంకీర్తన చేయుటవలన నీ అహంకారము పూర్తిగా పటాపంచలైపోవును. ఆ ఉత్సాహములో నీ దర్పమును, అహంకారమును పూర్తిగా మర్చిపోదువు. ఇట్లు చేయు నగర సంకీర్తన - ఒక మహోన్నత సాన ధ – మహోత్తర సేవ.
(శ్రీస.సూ.పు.102)
తెల్లవారు ఝామున నగర సంకీర్తన ఎందుకోసం పెట్టాము ? ఏ పని లేక పెట్టామా? early morning లేచి నీ నిద్ర పాడుచుసుకోమని పెట్టామా? కాదు కాదు. ఇది భౌతికంగా, లౌకికంగా, ఆధ్యాత్మికముగా ఎంతో పవిత్రమైనది. బ్రహ్మ ముహుర్త కాలము. చల్లని ప్రదేశము. చల్లని వాతావరణము. ఆ చల్లని వాతావరణములో మన మనస్సు రాత్రంతా నిద్రించి మంచి ప్రశాంతముగా ఉంటుంది. లేచిన తక్షణమే పిచ్చి పిచ్చి పలుకులు వినకుండా అసభ్యమైన శ్రవణం చేయకుండా రామా, కృష్ణా, గోవిందా అని నామస్మరణ వింటుంటే హృదయమునకెంతో హాయి చేకూరుస్తుంది. వినేవానికి హాయి. తెల్లవారి లేస్తూనే భగవన్నామము విన్నాను అనుకుంటాడు. తెల్లవారి లేచిన తక్షణమే భగవన్నామస్మరణ చేయాలి. మొట్టమొదట లేచిన క్షణమే స్మరణతో ప్రారంభము కావాలి. అందు నిమిత్తమై సత్యసాయి సంస్థలలో నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగములు, స్టడీ సర్కిల్పు యివన్నీ పెట్టటానికి కారణం అయినది. ఇవంతా కాలము పవిత్రము చేసి హృదయమునకు శాంతి చేకూర్చటానికే. శాంతి ఎక్కడుంది. భౌతికంగా చూస్తే శాంతి గాఢనిద్రలో ఉంది. లభిస్తుంది. రెండవది. సంకల్పరహితుడైనప్పుడు శాంతి పొందుతున్నావు. సంకల్పములను అరికట్టుకొనుటకు వీలుకాదు. కనుక మనము సాధ్యమైనంతవరకు ఒక గంట మౌనము వహించాలి. మాట్లాడి మాట్లాడి తలలోని నరములు బలహీనమై పోతాయి. మాటలలో పవిత్రమైన మాటలైతే బ్యాటరీ ఛార్జి అవుతుంది. ఆపవిత్రమైన పరనిందలుగానీ, పరదూషణగాని మనము పలుకుతుంటే మన జీవితము మరింత అధోగతి పాలైపోతుంది. కనుక ఈనాటి యువకులంతా మొట్టమొదట మాటలు తగ్గించుకోవాలి. అందులో నున్న మాధుర్యము మీరు ఎంతో అనుభవించగలరు. సమాజము కూడా చూస్తే ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఎవరితోను మాట్లాడడు, మంచిగా ఉంటాడు అనే సత్కీర్తి పొందుతాడు. కొంత మంది వడవడ వాగుతుంటారు. వీరిని చూస్తే సమాజము లో వస్తున్నాడురా వాగ్గాయి అని వెళ్ళిపోతారు. బోర్‌గా ఉండేవాడు. వస్తున్నాడని తప్పించుకుపోతారు. నిన్ను తప్పించుకు పోవటమేకాక నీకు చెడ్డ పేరు వస్తుంది. మిత భాష అతి హాయి; అతిభాష మతి హాని.
(శ్రీ స.పు.62/63)