సేవ చేసేవాడే నిజమైన వైద్యుడు. "వైద్యోనారాయణ్ హరిః" వైద్యుడు నారాయణ సమానుడు. నారాయణుడేమి చేస్తున్నాడు. అందరికి సహాయం చేస్తున్నాడు. అదే రీతిగా, వైద్య నారాయణులు కూడా అందరికీ సహాయం చేయాలి.
(స.సా.జూలై 2001 పు. 198)
ప్రేమస్వరూపులైన వైద్యులారా! మీ అదృష్టవశాత్తు మీరు గొప్ప చదువులు చదివి డాక్టర్లు అయినారు. డాక్టరుకుఉండవలసిన ప్రధాన గుణం త్యాగమే. త్యాగగుణం లేని డాక్టరు ఉండి ప్రయోజనం లేదు. త్యాగమే జీవితానికిక్షేమమని గుర్తించాలి. బీదలను అప్యాయంగా చేరదీసి, వారికి సేవలందించాలి. అప్పుడే మీరు ధన్యులౌతారు. అనేకమంది బీదలు రోగనివారణ గావించుకోవడానికి తగిన ధనం తమవద్ద లేకపోవడంచేత ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ప్రేమతో అలాంటివారి ప్రాణాలను కాపాడండి. Help Ever, Hurt Never, బీదలను డబ్బుకోసం పీడించి వారి ప్రాణాలను తీయకండి. వారిని ఏడిపించి మీరు ధనం సంపాదిస్తే అది మీకు మంచిదికాదు.
ప్రేమస్వరూపులు కండి, దయాస్వరూపులు కండి త్యాగస్వరూపులు కండి. త్యాగమే యోగాన్ని అందిస్తుంది. మీరు త్యాగభావాన్ని ఎంత పెంచుకుంటే లోకం అంత అభివృద్ధి అవుతుంది. కాబట్టి, మీరు సంపాదించిన డబ్బును బీదల కోసం వినియోగించండి. పరోపకారదీక్షను పూనండి. ఈనాడు ఇక్కడీఆసుపత్రిని నిర్మించడంచేత ఎందరో ప్రజలు వచ్చి చుట్టూ భవనాలు కట్టుకుంటున్నారు.ఇంతకు పూర్వం ఇక్కడ భూమికి అంతగా విలువ లేదు. ఈ ఆసుపత్రి ఏర్పడిన తరువాత ఇక్కడ భూమి యొక్క వెల చాలా పెరిగిపోయింది. ఇంత లాభం పొందినవారు బీదలకోసం ఏమి చేస్తున్నారు? ఒక్క బీదవానిని సంతోషపెడితే మీకు కూడా ఎంతో ఆనందం లభిస్తుంది.
(స. సా.పి.2001 పు.35)