ఈ పదిరూపాయలు కాగితము నుంచి నీవు తెలుసు కోవలసిన విషయమొకటి కలదు. ఈ కాగితము అనేక చేతులు మారినది. ఇంకెన్నో చేతులు మారనున్నది. ధనము నీ చేతికి వస్తుంది. కాని నిలబడదు. కాని నీతి వస్తే నిలబడుతుంది. ధనము వచ్చిపోతుంది; నీతి వచ్చి ప్రవర్థమానమవుతంది. చాలా మంది స్వార్థమునకు, చెడుపనులకు ఎంత ధనమునైనా దుర్వినియోగము చేయుటకు వెనుకాడరు. కాని ధనమును సత్కార్యములకు వెచ్చింపవలసివస్తే కడు జాగరూకులై అనేకములైన వంకలు చెబుతారు.
(పపు 52)
ధనమును ఎంతైనా సంపాదించవచ్చు. సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేయాలి. అప్పుడే ధనానికి కూడా గౌరవం లభిస్తుంది.
ఈనాడు మానవుడు అర్థము, అధికారము రెండింటి నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు. ఈ రెండూ ఉండవలసినవే, కాని, వీటికి కొంత పరిమితి ఉండాలి. జగత్తును సస్యశ్యామలము గావించే సముద్రుడైనా తన పరిమితులను మరిచితే అపకీర్తి పాలౌతాడు. దేహానికి మనస్సుకు పుష్టిని, సంతుష్టిని అందించే ఆహారము ఆమితంగా భుజిస్తే అజీర్తి వ్యాధిని కలిగిస్తుంది.
సర్వ సౌఖ్యంబులు చేకూర్చు ధనమన్న
ఎంత వరకది నీచెంతనుండు
ఘనమైన పదవిని చేకూర్పు ధనమన్న
ఎంత వరకది నీ దగ్గరుండు
ఆనందమది ఏదో అందించు ధనమన్న
ఎంతవరకది నీ స్వంతమగును
కష్టములను పోగొట్టి శాంతినిచ్చు ధనమన్న
ఎన్ని కష్టములను తీర్చినది ధనము
శాశ్వతమైన సుఖమును కోరకుండ
ధనము, ధనమంచు జీవితంబు ధారపోసి
ఏమి సాధించినావునీవీ జగతి యందు?
ఎంత వరకుందువు నీవు? మరియు జగత్తెంతవరకు?
నేనెవరు? నా కర్తవ్యమేమి యంచు
ప్రశ్న వేసుకో నరుడా! సత్యంబు గోచరించు.
ధవాన్ని ఒక చేతితో సంపాదించాలి. మరొక చేతితో త్యాగం చేయాలి.
పూర్వం పారిస్ నగరంలో ఒక వృద్ధ స్త్రీ ఉండేది. తాను బీద స్త్రీ అయినా, తాను సంపాదించిన ధనంతో రెండు మూడు దుప్పట్లు కొనేది.రాత్రి పూట చలిలో నిద్రించి ఉన్నవారిమీద కప్పేసి వచ్చేది. ఆమె త్యాగ గుణం వల్ల భగవదనుగ్రహం లభించింది. భగవదనుగ్రహం పెరిగిన కొద్దీ, త్యాగం కూడా పెరుగుతూ వచ్చింది. బండినిండా దుప్పట్లు వేసుకొనేది. చలిలో నిద్రిస్తున్న వారిపై కప్పి వచ్చేది. ఈ విషయం ఎవరికీ చెప్పేది కాదు. జనులంతా ఈ త్యాగాన్ని గుర్తించారు. ఆమె ఎప్పుడూ తలక్రిందకు వంచుకొని నడిచేది. మీరు ఇంత త్యాగం చేస్తున్నారు. కదా! తల ఎత్తుకొని ఎందుకు తిరగరు? మీకు ఎందుకు ఇంత సిగ్గు? అని అడిగేవారు. ఆమె జవాబు చెప్పేది! తలెత్తుకొని తిరగడానికి నాకు అవమానకరంగా ఉంది. భగవంతుడు నాకు వేయి చేతులతో యిస్తూ ఉంటే, నేను ఒక్క చేతితో దానం చేస్తున్నాను. ఇది చాలా అవమానకరం అనేది. ఇది గుప్తదానం.
ఇట్టి గుప్తదానం చేసేవారు భారతదేశంలో కోట్ల కొలదీ ఉంటున్నారు. జగతిలో పుణ్యపురుషులు లేకున్న జగములెట్లు వెలుగు?
కనుక ధనాన్ని సంపాదించండి. పది మందికీ దానం చేయండి. పరుల సేవయే పరమాత్ముని సేవగా విశ్వసించండి. ఇదే మీరు చేయవలసిన సాధన. ఈ సాధన చేత మీరు ఎంతటి ఆనందా నెంతైనా అనుభవించవచ్చు. అప్పుడే మానవ జన్మ సార్థకమౌతుంది. ధనమే లేకున్న మానవునికి క్షణమైనను గడుచుటకు వీలుకాదు. కాని దీనిని ఒక హద్దులో ఇముడ్చుకోవాలి. ధనము మన పాదములకు ధరించే Boot వంటిది. ఈ Boot మన కాళ్ళకు సరిగ్గా ఉన్నప్పుడే నడవగలము.
కొంచెం తక్కువగా ఉన్నా, లేక అధికంగా ఉన్నా నడుచుటకు సాధ్యం కాదు. కనుక ధనం కూడా తక్కువగా ఉండినా సుఖశాంతులతో జీవితమును గడపలేము. అధికంగా ఉన్నా భరించలేము.
ధనమును చేర్చుకొనుట సులభము కాదు. దీనిని ప్రోగుచుసుకొనుటకు ఎన్నియో శ్రమలను అనుభవించ వలసి వస్తుంది. కూడ బెట్టుట కూడ శ్రమతో కూడినది. వ్యయము చేయుట కూడా చాల కష్టమే. పశువు పెరుగు కొలదీ కొమ్ములు కూడా పెరుగుతూ ఉంటాయి. అదే విధముగనే ధనవంతులకు ధనము ఆధికమగు కొలదీ దుఃఖము కూడా అధికమవుతంది. "ధనవంతుని యొక్క దుఃఖము దైవ మెరుగు". ధనము వలన సమస్యలను తీర్చుకొనవచ్చునని మానవులు భ్రమిస్తూ ఉంటారు. ధనము చేతనే మానవుని సమస్యలు పరిష్కారం కావు. దీనికి తగిన విధానములో స్వార్థమును త్యజించాలి. ధనము మనతో తెచ్చుకొనినది కాదు.
(దే.యు.పు.70/72)
ధనమెచ్చిన మదమెచ్చును
మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చున్
ధనముడిగిన మదముడుగును
మదముడిగిన దుర్గుణంబు మానర వేమా!
(ము.ము.పు. 92)
(చూ|| అన్యాయార్జితము, అస్థిరం, పురుషార్థము, మానవత్వము, విద్య)