లక్ష్మణుడు సీతారాములవెంట అరణ్యానికి వెళ్ళే సమయంలో అతని తల్లి సుమిత్ర, "లక్ష్మణా! నీవు అరణ్యానికి వెళుతున్నానని భావించవద్దు. సీతారాములు లేని ఈ అయోధ్యయే మాకు అరణ్యము, సీతారాములున్న ఆ అరణ్యమే నీకు అయోధ్య. కనుక, వారిని నీ తల్లి తండ్రులుగా భావించి, సేవించు, వారికి ఎట్టి లోపమూ రాకుండా చూసుకో" అని కుమారుణ్ణి ఆశీర్వదించి చెప్పింది. ఆమె పేరే సుమిత్ర, అనగా, మంచి మిత్రురాలు. సుమిత్రవంటి తల్లులు, సీతవంటి భార్యలు లక్ష్మణుని వంటి సోదరులు ఈనాడు తయారు కావాలి. ఐకమత్యం అభివృద్ధి కావాలి. ఐకమత్యంవల్లనే జగత్తు సంరక్షింప బడుతుంది.
(స.సామే.99పు.118)
సుమిత్ర గుణవంతురాలు. ఆమె పేరే సు-మిత్ర, ఆనగా, ఆమె అందరికీ మంచి స్నేహితురాలు. ఆమె ఆదర్శము సాటిలేనిది.రాముడు అరణ్యానికి వెళ్ళే ముందు తల్లియైన కౌసల్యకు నమస్కరించినప్పుడు ఆమె "నాయనా! నేను నిన్ను విడిచి క్షణమైనా ఉండలేను" అని విలపించింది. అప్పుడు సుమిత్ర కౌసల్యను సమీపించి “అక్కా! ఏమిటి అజ్ఞానము! సాక్షాత్తు నారాయణుడే నీ గర్భమునందు శ్రీరామునిగా జన్మించాడు. మానవాకారం ధరించి నందుకు అతడు కాల, కర్మ, కారణ, కర్తవ్యాలను పురస్కరించుకొని ప్రవర్తించాలి. కాబట్టి. రాముడు అరణ్యానికి వెళుతున్నాడని నీవు బాధపడవద్దు. త్వరలోనే అయోధ్యకు తిరిగి రాగలడు" అని సమాధాన పరిచింది. తన కుమారుడైన లక్ష్మణుడు వచ్చి తనకు నమస్కరించి నప్పుడు సుమిత్ర అతనికి ఏమని బోధించింది? "నాయనా! నీవు అరణ్యానికి వెళుతున్నానని భావించవద్దు. సీతా రాములు లేని ఆయోధ్యయే ఆరణ్యము. సీతారాములున్నఅరణ్యమే అయోధ్య రాముడే నీ తండ్రి, సీతయే నీ తల్లి, కాబట్టి, వారిని ప్రేమతో సేవించడమే నీ ప్రధాన కర్తవ్యం"అన్నది. అట్లే. ఆమె రెండవ కుమారుడైన శతృఘ్పుడు భరతుని సేవిస్తూ వచ్చాడు.
(స.సా.మే.2000 పు.143/144)
కౌసల్య చాలా గుణవంతురాలు. ఆమె పట్టపు రాణి కాబట్టి, అందరూ ఆమె ఆజ్ఞను శిరసా వహించేవారు. ఇంక, దశరథుని మూడవ భార్యయైన కైకేయి ఆజ్ఞకు ఏమాత్రం అడ్డు లేదు. దశరథుడైనా సరే, కూర్చో అంటే కూర్చోవాలి. లెమ్మంటే లేవాలి. ఈ విధంగా, ఆమె దశరథుణ్ణి తన చేతిలో పెట్టుకొని నాటకమాడుతూ వచ్చింది. కాని, సుమిత్రను పట్టించుకునేవారు ఎవ్వరూ లేరు. రాముడు పధ్నాలు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని కైకేయి కోరడంతో పట్టాభిషేకం జరగలేదు. రాముడు అరణ్యానికి బయలుదేరే ముందు తల్లియైన కౌసల్యకు నమస్కారం చేయడానికి వెళ్ళాడు. ఆమెఘొల్లున ఏడుస్తున్నది. అంతఃపురమంతా ఏడ్పులే! ఇంక, లక్ష్మణుడు సుమిత్రకు నమస్కారం చేయడానికి వెళ్ళాడు. అప్పుడామె “నాయనా లక్ష్మణా! నీవు అరణ్యానికి వెళుతున్నావని భావించవద్దు. అది అరణ్యం కాదు. సీతారాములు లేనటువంటి ఆయోధ్యయే ఆరణ్యం. సీతారాములు నివసించే అరణ్యమే ఆయోధ్య. కాబట్టి, నీవు అరణ్యంలో ఉన్నప్పటికీ ఆయోధ్యలోనే ఉన్నట్లుగా భావించు. రాముడే నీ తండ్రి. సీతయే నీ తల్లి. వారి సేవలకు ఎట్టి ఆటంకమూ కలకుండా చూసుకో" అని హితబోధ చేసింది. ఏ తల్లియైనా ఈరీతిగా చెప్తుందా? "దశరథుడు" కైకేయికిచ్చిన వరముననుసరించి రాముడు మాత్రమే అరణ్యానికి వెళ్ళాలి. నీవు వెళ్ళనక్కర్లేదు" అని రామ లక్ష్మణుణ్ణి అడ్డుకో వచ్చును. కాని, సుమిత్ర ఆవిధంగా చేయలేదు. మాతృమూర్తియందు ఉండవలసిన సుగుణములన్నీ ఆమె యందు గోచరించాయి.
ఇది చైత్రమాసం, రాముడు అవతరించినది ఈ నెలలోనే. చైత్ర శుద్ధ నవమిరోజే శ్రీరామచంద్రుడు జన్మించాడు. దశరథ మహారాజు యొక్క మువ్వురు భార్యలలో రెండవ భార్యయైన సుమిత్ర గురించిన ప్రస్తావన రామాయణంలో మనకంతగా కనిపించదు.
రాముని వల్ల కౌసల్యకు సత్కీర్తి కల్గింది. "కౌసల్యాసు ప్రజా రామా..." అని సుప్రభాతంలోకౌసల్య పేరే మొట్టమొదట వస్తుంది. కైకేయి తన కుమారుడైన భరతుడే రాజు కావాలని ఆశించింది. కాని,సుమిత్రకు ఎలాంటి వాంఛలూ లేవు. ఆమె సదుణవంతురాలు, సదాచార సంపన్నురాలు, మితభాషిణి, హితభాషిణి, పేరుకు తగ్గ ప్రవర్తన గలది. ఆమె కుమారులైన లక్ష్మణ శత్రుఘ్నులకు రాజ్యాధికారం దక్కే అవకాశం లేదు. సుమిత్రకు అలాంటి కోరిక కూడా లేదు. ఆమె తన కుమారులిద్దరిని సేవామార్గంలో ప్రవేశ పెట్టి యావత్ ప్రపంచానికే గొప్ప ఆదర్శాన్ని అందించింది. "శ్రీరామచంద్రుడు రాజైనప్పుడు లక్ష్మణుడు అతనికి ప్రధానమైన సేవకుడుగా ఉండాలి" అని ఆశించింది. "యజమాని ప్రక్కనే సేవకుడుంటాడు. నా కుమారునికి రామ సేవయే ప్రధానమైనది. రామ సేవలో లక్ష్మణుడుతరించాలి" అని ఆశించింది. అదే విధంగా, శత్రుఘ్నుడు భరతుణ్ణి సేవించాలని ఆశించింది. సేవలో ఉన్న పవిత్రతను గుర్తించి తన కుమారులను సేవకే అంకితం చేసింది. మీరు రామచరిత్రను చక్కగా విచారణ చేసినప్పుడు సుమిత్ర యొక్క భావములెంత విశాలమైనవో, ఎంత ఘనమైనవో, ఎంత ఆదర్శవంతమైనవో అర్థం చేసుకోగలరు.
రాముడు అరణ్యానికి బయలుదేరేటప్పుడు కౌసల్య చాలా దుఃఖించింది. కాని, సుమిత్ర మాత్రం కన్నీరు కార్చలేదు. పైగా కౌసల్యను ఓదార్చుతూ "అక్కా! లక్ష్మణుడు రామునికి సేవ చేయడానికి వెళుతున్నాడు. రాముణ్ణి కంటికి రెప్పవలె చూసుకుంటాడు. రామునికి ఎట్టి ఇక్కట్లుగాని, ఆపదలుగాని సంభవించవు." అని ధైర్యం చెప్పింది. "లక్ష్మణుడు రామునికి సేవ చేయడానికే పుట్టాడు. అతడు రాముని చేతిలో ఒక పనిముట్టు. కాబట్టి, రాముడు తనే పనిముట్టును తనవెంట తీసుకు వెళుతున్నాడు. అది నేను పంపడమూ కాదు. లక్ష్మణుడు వెళ్ళడమూ కాదు. లక్ష్మణుణ్ణి తన వెంట తీసుకు వెళ్ళడానికి రామునికి అధికారమున్నది. అది అతని హక్కు " అని భావించింది. కనుకనే, ఆమె లక్ష్మణుణ్ణి ఆశీర్వదిస్తూ "నాయనా! నీవు సీతారాములను చక్కగా సేవించు" అని బోధించింది. లక్ష్మణుడు సదా రాముణ్ణి అనుసరించినట్లుగా శత్రుఘ్పుడు ఎల్లప్పుడు భరతునివెంట ఉండేవాడు. భరతుడు తన మేనమామయైన కేకయరాజు ఇంటికి బయలుదేరేటప్పుడు శత్రుఘ్నునికి ఉండమని గాని, రమ్మనిగాని ఎలాంటి సమాచారమూ అందలేదు. కాని, భరతునికి సేవ చేసే నిమిత్తం అతని వెంట వెళ్ళడానికి శత్రుఘ్పుడు తనంతట తానే సంసిద్ధుడయ్యాడు. ఈ రీతిగా, తల్లియైన సుమిత్ర చేసిన సద్బోధల ఫలితంగా లక్ష్మణ శత్రుఘ్నులు సేవకే తమ జీవితాన్ని అంకితం గావించారు.
(స. సా.మే. 2002 పు. 143/149)
(చూ॥ హనుమంతుడు)