సూర్యుని ప్రకాశములోని ఏడువర్గములు సమానమైనపుడు తెల్లదనమే కనిపించును. త్రిగుణములు సమానముగా ఉండిన శాంతి చేరును. ప్రశాంతి నిలయ మనునది మీ హృదయమే కాని ఈ కట్టడము కాదు. ధన వ్యయము చేసి ఇక్కడికి మీరు అనేక పర్యాయములు రానక్కరలేదు. ఉన్నచోటనే ఉండి ప్రేమతో భజించిన, దీనుల సేవచేసిన అనుగ్రహము ఆనందము దొరుకును.
స్వామి అంతటా ఉన్నాడు. ఎక్కడ చూచిన కనిపించేవన్నీ ఈ పరమాత్ముని స్వరూపమే. పరబ్రహ్మము తప్ప వేరేమియూ ఎక్కడనూ లేదు. సర్వమూ భగవంతుడే. సర్వ భూతాంతరాత్మ అంటే అదే అర్థము. తనది కాని రూపము లేదు. తనదికాని పేరు లేదు. రాతిలోనూ భగవంతుని చూడవలెను కాని రాతినే భగవంతుని చేయకూడదు.
(జ. పు. 186)