ఎద్ది కలదని యంటి మో అద్ది లేదు
ఎద్ది లేదని యంటి మో అద్ది కలదు.
ఉన్న దొక్కటే దైవంబు ఎన్నటికని
లేనిదయ్యెను లోకంబు కానరయ్యా
(సా. పు. 415)
మనకు, దైవానికి ఎంత దూరమో, దైవానికి మనకు అంతే దూరము నీకు నీ వెంత దూరము? దగ్గరే కదా? దైవానికి, నీకు కూడా అంతే దగ్గర. "దూరాత్ దూరే అంతి కేచ" అని చెప్పింది వేదము. నేనెంత దూరము లో నున్నానని భావిస్తే అంత దూరములో వుంటాను. ఎంత దగ్గరగా భావిస్తే అంత దగ్గరగా యుంటాను.దూరానికి దగ్గరికి మీ భావమే కారణం నేను కాదు-ఒక్క మనస్సును చక్కగ చేసుకుంటే చాలు. సర్వము సరి అయిపోతాయి.
(సా..పు. 417)
యజ్ఞయాగాదులను ఏ లక్ష్యముంచుకొని యాచరించు చున్నాము? స్వర్గ ప్రాప్తి నిమిత్తము. స్వర్గ ప్రాప్తి కూడా శాశ్వతము కాదు " క్ఞీణేపుణ్యేమర్త్య లోకం విశంతి" యసంబ్లీకి ఎన్నిక అయిన వారు 5 సంవత్సరములు యసంబ్లీ సభ్యులుగా యుంటారు. 5 సంవత్సరములు అయ్యాక వారు వెనుకకు తిరిగి రావలసినదే. అదే విధముగా స్వర్గమునకు వెళ్ళిన మానవుడు తన పుణ్యము తీరగనే స్వర్గము వదలి పెట్టవలసినదే. చివరకు స్వర్గము కూడా శాశ్వతము కాదు. శ్రౌతకర్మలే శాశ్వతములు కానపుడు, స్మార్త కర్మలు, పౌరాణిక కర్మలు ఎట్లు శాశ్వతములగును? వేదములు మానవుని భగవంతుని సమీపమునకు మాత్రమే తీసుకొని పోగలవు "నకర్మణా నప్రజయాధనేన! త్యాగేనైకే అమృతత్వమానశు:" అని వేదాలు చెప్పుచున్నవి. నీవు ఎటువంటి కర్మల నాచరించినప్పటికిని ఎటువంటి ధర్మము లాచరించినప్పటికిని త్యాగము లేక అమృతత్వము అందుకోలేవు. కర్మలు, చిత్తశుద్ధి కలిగించును. కాని శాశ్వత ఆనందాన్ని ఇయ్యలేవు. దైవత్వమనేది బయట ప్రపంచములో లేదు. దైవము తనలో వున్నదను తత్త్వము అభివృద్ధి చేసుకోవాలి.
(సా. పు. 578)
శైలే శైలే విహరద్దైవం, విపినే విపినే విచరద్దైవమ్
గ్రామే గ్రామే ఖ్యాతందైవం, నగరే నగరే ప్రచలద్దైవమ్,
పర్వతములందు, ఉన్నతమైన స్థాయియందు, ఉత్తేజమైన భావములతో ఉర్రూతలూగుతూ విహరించేదంతా దైవమే. అడవుల యందు ప్రశాంతమైన వాతావరణమునందు దివ్యమైన విను వీధులందు, చల్లని గాలులయందు, పిల్ల వాయువునందు విహరించేది దైవము. ప్రతి గ్రామము నందు, దివ్య ప్రకాశముతో, మానవత్వముతో అన్యోన్యమైన అనుకూలముతో దివ్య వాతావరణమున గడిపే వాడు దైవమే. పట్టణములయందు, అందచందముల అనుకూల వాతావరణముతో, దివ్యానుభూతులతో, మానవులను వికసింపజేసి, ప్రకటింపజేసి దివ్యమైన తత్త్యాని వెదల్లెవాడు దైవమే. కర్నాటక దేశమున మల్లమ్మ దైవము యొక్క సర్వాంతర్యామి తత్త్యాన్ని చక్కగా ప్రకటింప జేసింది.
నిరిగినైదిలెశృంగార, ఊరింగె ఆదరవె శృంగార
గగనక్కె చంద్రమనే శృంగార, సముద్రక్కఆలయె శృంగార
కొలనుకు తామరపుష్పమే శృంగారము. గ్రామమునకు గృహములే శృంగారము. సముద్రమునకు తరంగములే శృంగారము. ఆకాశమునకు చంద్రుడే శృంగారము అన్నది. సర్వత్ర సౌందర్యవంతమైన శృంగారమే దైవస్వరూపము. కనుకనే ఉపనిషత్తులు సత్యం. శివం, సుందరం అని వర్ణిస్తున్నాయి.
(బ్ర త్ర పు, ౧౬౯)
మృదుహృదయానాదం సౌమ్యం దైవం
ప్రియ రూపాణాం రమ్యం దైవమ్
తత్వ జ్ఞానాం విశ్వందైవము
గుణరుచిహేనాం శూన్యందైవము.
(బృత్ర.పు. ౧౨౩)
భాస్కరచిందే దీపం దైవం
లోచనమధ్యే సుప్తం దైవమ్
సిత కరమండల గుప్తందైవం
త్రిగుణిత భువనం వ్యాప్తం దైవము.
“స్వరం ఖ ల్విదం బ్రహ్మ - విశ్వం విష్ణుస్వరూపం” సూర్యుని కిరణములయందు ప్రకాశించేవాడు. ప్రకటించేవాడు దైవము. ప్రతి మానవుని యొక్క నేత్రముల మధ్య జగత్తును చూపించి ప్రకటింపజేసి వికసింపజేసి ప్రకాశింపజేసేవాడు దైవము. చంద్రుని మధ్య నున్న చల్లదనము తెల్లదనములోనే శాంతిని అందించేవాడు దైవము. త్రికాలాత్మకమైన యీ జగత్తునందు త్రిమూర్త్యాత్మకమైన యీ జగత్తునందు త్రిగుణ స్వరూపములో ప్రకటించే దివ్యత్వము భగవంతుడే. ప్రకృతి మహావిచిత్రమైనది. ఎవ్వరును దీని రహస్యమును గుర్తించ లేరు. ముంచినా, తేల్చినా, అనుగ్రహించినా, ఆగ్రహించినా ప్రకృతియే. జీవికోటిపైన ఆధిపత్యము ప్రకృతియే. ఈ ప్రకృతి త్రిగుణాత్మకమైనది. త్రిగుణాత్మకమైన ప్రపంచమే త్రిమూర్తి స్వరూపము. సృష్టిస్థితి లయములకు త్రిగుణములే మూల కారణము. తమ స్వరూప స్వభావములతో, విశేషములతో, వికారములతో లోకాలను ప్రకాశింపచేసేది ప్రకటింపచేసేది త్రిగుణములే.
(బ్బ.త్ర.పు. ౧౧౧)
మీ కర్మలు పరిహారం కావాలంటే దివ్యమైన ఆత్మతత్త్వాన్ని చింతించాలి. పుట్టించునదీ తానే, పోషించునదీ తానే, అంత్యం గావించునదీ తానే. దైవమును ఆంగ్లంలో God అంటారు. G అనగా, Generation (సృష్టి. సృష్టి దైవము నుండియే జరుగుతున్నది. 0 అనగా Organisation (స్థితి). ఈ సృష్టి దైవంచేలనే పోషింపబడుతున్నది. D అనగా Destruction (లయము) ఇది దైవం చేతనే లయం గావింపబడుతున్నది. కనుక సృష్టి స్థితి. లయములన్నీ God అనే పదమునందే లీనమైయున్నవి. ఈ మూడింటిచేతనే జగత్తు జరుగుచున్నది.
(స.సా.ఆ.99 పు. 266)
తిలమధ్యే యథాతైలం క్షీరమధ్యేయథాఘృతమ్
పుష్పమధ్యే యధాగంధం ఫలమద్యే యధారసమ్
కష్టాగ్ని వత్ర్పకాశంల్లింగ మచలం ప్రభో!
తిలల యందు తైలము ఉండినట్లు పాలలో వెన్న ఉండినట్లు, పుష్పము నందు చక్కని సుగంధము ఉండినట్లు, ఫలములో రసము ఉండినట్లు కట్టెలలో నిప్పు ఉండినట్లు విశాలమైన, అనంతమైన ఈ జగత్తునందు దైవము కూడా ఉన్నాడు. జగత్తునందున్న మాధవుడు మానవ శరీరమందు కూడా ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు మానవుని యందు? కన్నులలో చూపు ఉండినట్లుగా, చెవులలో శబ్దము ఉండినట్లుగా దేహమునందు చైతన్యస్వరూపుడై ఉంటున్నాడు. సృష్టి అనగా ఈశ్వరేచ్చకు రూపమే. దీని పేరే ప్రకృతి. ఈ ప్రకృతి ఈశ్వరుని నుండియే ఆవిర్భవించింది. ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి మానవుడు ఈశ్వరభావమునే కలి ఉండాలి. మానవుని యందున్న చైతన్యమును ఆవిర్భవింపచేసే నిమిత్తమై మూర్తీభవించినవాడే మానవుడు. మానవునకు ప్రధానమైన గుణములు కూడా ఉండాలి. ప్రకృతిలో సత్వ, రజో, తమో గుణములుండినట్లు, ప్రకృతి నుండి ఆవిర్భవించిన మానవునకు యీ మూడు గుణములు ఉండాలి. అవియే డ కారత్రయములు, Devotion మొదటిది Discipline రెండవది Duty మూడవది.
(శ్రీస. పు. 50)
జీవితమును అనంతములో హెచ్చించినప్పుడు అదే దైవత్వముగా మారిపోతుంది. Life x 00 = God ఇంకా విరాట స్వరూపుడనగా ఏమి? Body x 00 = విరాట స్వరూపము Mind x 00 = హిరణ్యగర్భుడు. కనుక దైవము, విరాట స్వరూపుడు, హిరణ్య గర్భుడు అనేవి ప్రత్యేకముగా ఎక్కడో ఒక లోకములో లేవు. అన్ని మానవుని యందే ఇమిడి ఉన్నాయి.
(శ్రీవ.1991 పు.84)
(చూ॥ అనంహకారము, అసూయ, ఆధ్యాత్మికము, ఏది, ఒక్కటే, కర్మ, కోరికలు, చదువు. త్రిగుణములు, ప్రత్యక్షదైవము, రోగ విముక్తుడు, విద్య, సమాజ సేవ)