మీ అనుభవమే మీకు ప్రధానము. మీ ఆనందమే మీకు ఆధారం. ఒక ద్రౌపదిని రక్షించాడు. ఒక అహల్యను ఉద్ధరించాడు. ఒక ప్రహ్లాడుని కాపాడినాడు అని చెప్తారే. కాని ఇంక ఎంతమంది ద్రౌపదులున్నారో, యెంతమంది అహల్యలున్నారో, యెంత మంది ప్రహ్లాదులున్నారో యెన్ని గజేంద్రులున్నారో, అనుగ్రహము పొందినవారు. మీకే తెలుసు? పరమాత్ముని ప్రేమ ప్రవాహము ప్రవహిస్తూనే వుంటుంది. అది అంతులేని విషయము. అయితే మీరు -హార్టులో చూస్తారు.
(సు. పు. 49/50)
నాయనా! నదిమూలము, ఋషిమూలము వెతుకరాదు. కావలసిన వాటి సారము, అనుభవము ప్రధానము. వాటి ఫలమును అనుభవించిన ధమ్యలగుదురు మూలము వెతుకుటలో సారము అనుభవించలేరు. కాని, నీవు అడుగుచున్నావు కనుక తెలుపుచున్నాను వినుము!
వ్యాసమహర్షి జాలరి కులమున పుట్టెను. వసిష్ట మహాఋషి వేశ్యయగు ఊర్వశికి జన్మించెను. శౌనక మహాముని శునక వంశమున పుట్టెను. అగస్త్యుడు ఘటమున జన్మించెను. విశ్వామిత్రుడు క్షత్రియ కులమున పుట్టెను, ఖగోళ మహాముని వైశ్యవంశమున జన్మించెను. సూతమహాముని చతుర్ధ వంశమున (శూద్ర) జన్మించెను. ఇక సహజాలుగా జన్మించి, సద్గుణములలో జాతి ధర్మమును దేహ ధర్మములను కొంతకాలము పాటించి సత్యమును యెరింగి తదుపరి సర్వమునూ దూరీకరించి సర్వదా ముక్తిని స్వవశము చేసుకొన్న విదురుడు, సంజయుడు, సత్యకాముడు మొదలగు వారలు కూడా అనేక మంది వున్నారు. నాయనా! పురుష ప్రయత్నము, వివేకము, తపస్సు దీనివలన కలుగు గుణములే మహోన్న స్థితికి కారణములు. మానవ జాతికి ఆత్మశుద్ధి లేకయే జాతియందు జన్మించిననూ ముక్తిని పొందలేరు. మలినమైన రాగిలో కూడిన బంగారము వెల తగ్గినదగుచున్నది. అలాగుననే తాను శుద్ధ విరాడ్రూపుడయినను, సంసార సంసర్గములచే అహంకారముతో కూడిన జీవుడగును. జీవుడును , తపోవ్రత సంస్కృతుడై శుద్ధ బుద్ధియుతుడై నిజస్థానమగు పరమాత్మ స్వరూపమును పొందును. కాలని కుండ జలస్పర్శముచే కరిగి మట్టి యగునటుల తపస్సుచే పరిపక్వము కాని వారి మనసు విషయ దోషముల సంబంధముచే విషయములో ప్రవేశించుచున్నది. తపోగ్నిచే దహించబడిన కుండను సముద్రమున పడవేసిననూ కరుగక వుండును. తీవ్ర తపోవహ్నిచే నిశ్శషముగా దహింపబడిన కర్మ బీజములు కలవారు గనుకనే జ్ఞానసంపత్తి గలవారై, నిర్మల తత్త్వముచే ముక్తులై జనన మరణముల జెందనివారగుచున్నారు.
(ప్రశ్నోవా. పు.58/39)
(చూ: ప్రబోధము, మనసు)