సీతాన్వేషణలో హనుమంతుడు లంకకు పోవలసి వచ్చింది. అప్పుడు హమమంతుని దగ్గరకు జాంబవంతుడు, సుగ్రీవుడు వచ్చి, "ఇంత పెద్ద సముద్రాన్ని నీవు ఏరీతిగా దాటగలవు?" అన్నారు. నవ్వుతూ చెప్పాడు హనుమంతుడు, పిచ్చివాడా! భగవంతుడు చెప్పాడంటే ఆ శక్తి కూడా తానే ఇస్తాడు. ఆ శక్తియే తానివ్వకున్న నేను ఏవిధంగా పోగలను? ఆజ్ఞ యిచ్చాడు కనుక తగిన శక్తి తానే ఇస్తాడు. తప్పక నేను వెళుతున్నాను అన్నాడు. ఒక్కసారి రామా అని ఎగిరాడు. ఆ రామనామ మహిమతో లంకకు చేరిపోయాడు. కమక భగవంతుడు ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడంటే "ఏమో, నేను చేయగలనా?" అనే సందేహమునకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఆజ్ఞ ఇచ్చినవాడు దానికి తగిన శక్తికూడా ఇస్తాడు. ఆ నమ్మకం నీలో లేకపోవటం చేత వెనుకంజ వేస్తున్నావు. నిజముగా చెప్పినట్లు చేసి చూడు. తప్పక విజయాన్ని సాధించగలవు. ఏ మాత్రము అనుమానమునకు అవకాశము ఇవ్వవద్దు.
(ద.స.98 పు.96)
నెహ్రూ ఒక ఉపన్యాసంలో, వ్యక్తి చేసే పనులతో నిమిత్తం లేకుండా సంఘటనలను జరిపించే అదృష్టశక్తి ఒకటి వుందని అంగీకరించారు. కాస్త ముందుగానో, వెనకగానో ప్రతి వ్యక్తి అంగీకరించక తప్పదు. సంఘటనలను అదుపు చేయటంలో పురుష శక్తికి కొన్ని పరిమితులున్నాయి. దానిని నీవు అదృష్టం అనవచ్చు. మరొకరు దానినే దైవం అనవచ్చు పేరేదైతేనేం! మనిషిని మించిన శక్తి ఒకటి యీ సంఘటనల క్రమాన్ని కంట్రోల్ చేస్తున్నదన్నది యదార్థం. ఆసంగతి తలుచుకుంటే మనిషిలో అహం తగ్గి వినయం పెరగాలి. ఆశ్చర్యంతో, అద్భుతంతో మనసు చకితం కావాలి.
(శ్రీసా.గీపు 7/8)
(చూ: దివ్యత్వం)