రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ పత్నులతో కూడి ప్రయాణానికి సిద్ధమయ్యారు. మాండవీ శ్రుతకీర్తిలు కొంతకాలం తరువాత వస్తామన్నారు. కాని, దశరథుడు నల్లురూ ఒకే పర్యాయము వెళ్ళాలని ఆదేశించాడు. శ్రుతకీర్తికి శకునముల గురించి తెలుసు. ఆమె మెల్లగా మాండవి తో, “ఈనాడు వెళ్ళడం మంచిది కాదు" అని చెప్పింది. మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది. ఊర్మిళ సీతతో చెప్పింది. అప్పుడు సీత, "పిచ్చిదానా! కాల స్వరూపుడైన పరమాత్ముడే మన వెంటనుండగా ఇంక ముహూర్తాల గొడవ మన కెందుకు! ఒక వేళేదైనా ఆటంకం కల్గినా రాముడు చూసుకుంటాడులే" అని ధైర్యం చెప్పింది. అందరూ అయోధ్యకు ప్రయాణమయ్యారు. మిథిలాపుర ప్రజలంతా కన్నీటితో వీడ్కోలు చెప్పారు. ప్రకృతి పరమాత్మల కల్యాణం తన ద్వారా జరిగింది కదా అని జనకుడు ఆనందబాష్పాలు రాల్చాడు. అనేక రథములు, గజములు, తురగములు మిథిలాపురం నుండి కదిలినాయి. మార్గమధ్యంలో హఠాత్తుగా, " నిలు, నిలు...." అనే గర్జన దిక్కుల్లో పిక్కిటిల్లింది. ఎవరబ్బా అని రాముడు రథము దిగి చూస్తే ఎదురుగా నిలిచాడు పరుశురాముడు. అతడిని చూడగానే ఏ ఉపద్రవమును ఎదుర్కోవలసి వస్తుందోనని దశరథుడు, వశిష్టుడు మున్నగువారు చాల భయపడ్డారు. కాని, రాముని మోముపై మాత్రం చిరునవ్వులు చిందులు వేశాయి. ఎలాంటి ఉపద్రవం వచ్చినా భగవంతుని తేజస్సు మారదు. ఎల్లప్పుడు ఆనందంగానే ఉంటాడు. పరశురాముడు, "రామా! నీవుపుచ్చిపోయిన ధనస్సును విరిచావు. నిజంగా నీకు శక్తి ఉంటే ఈ పరశుని విరుచు చూద్దాం" అని సవాలు చేశాడు. రాముడు దానిని కూడా విరగగొట్టాడు. తక్షణమే పరుశురాముడు శ్రీరాముని పాదాలపై పడ్డాడు. దీని అంతరార్థమేమిటి? భగవంతునికి 16 కళలు ఉన్నాయి. అందులో 12 కళలు శ్రీరామచంద్రునిలో ఉన్నాయి. మూడు కళలు లక్ష్మణ భరత శత్రుఘ్నులు. మిగిలిన ఒక్క కళ పరుశురాముని దగ్గర ఉండినది. దానిని శ్రీరామచంద్రునికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
రామాయణం వ్రాసేవారుకాని, వినేవారు కాని పరుశురాముడు రామునిపై ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. కాని, ద్వేషంతో కాదు, తన వద్దనున్న కళను అప్పజెప్పడానికి వచ్చాడు.
(శ్రీ.భ.ఉ.పు.60/61)