మానవులలో దైవత్వము, పశుత్వము యీ రెండు ఉన్నాయి. మానవునిలో కోతి,ఎద్దు, నక్క, పాము, నెమలి, ఎలుగ గొడ్డు, తోడేలు ఇవన్ని ఉన్నాయి. వీటి అన్నిటి క్రిందా దైవత్వమున్నది. కళలే యీ దైవత్వాన్ని ప్రకటించాలి. దృశ్యము, నాటకము, లలిత కళలు ఇవి అన్ని దైవత్వానికి దారి చూపాలి. ఆత్మను ప్రతిష్ఠింప చేయాలి. మానవులకు లక్ష్యము దగ్గరకు తీసుకొని వెళ్ళాలి. అప్పుడే ప్రేమ వస్తుంది. సత్యము, ధర్మము, శాంతి ఎచ్చట నుండునో అచ్చట ప్రేమ యుండును. అందులకే నేను ప్రేమ స్వరూపుడు.
(సా. పు. 503)
మానవుడు కేవలము తన తత్వము తాను నమ్మలేని స్థితిలో, దుర్భలుడైపోతున్నాడు. దీనినే మానవత్వముగా మనము భావిస్తున్నాము. ఇమిటేషన్ (Imitation) మానవత్వము. క్రియేషన్ (Creation) దైవత్వము. Imitation is human. Creation is divine.కాని ఈ కృత్రిమమైనటువంటి అనుకరణ మనలను ఎంత బలహీనులను గావిస్తుందో విచారణ చేయాలి. ,
(ఆ.రా.పు.47)
బీజం మాం సర్వభూతనాం! కొమ్మలు రెమ్మలు పూవులు కాయలు. అన్నీ ఒక బీజమునుండి బయలుదేరినవే. దైవత్వమే బీజం. ప్రకృతి, వృక్షం: జీవజంతువులు పుష్పములు; కొమ్మలు రెమ్మలు సన్నిహిత సంబంధములు, బంధు బాంధవులు, ఆనందమే ఫలము: దానిలోని తీయదనమే. శీలము! ఆత్మ విశ్వాసమే, దాని వేరు. వేరులేక వృక్షము జీవించదు; కాయలో తీయదనము లేనియెడల అది ఎంత పెరిగి పెద్దదైననూ, పొయ్యిలో వెయునట్టి కట్టి క్రింద పనికి వచ్చును. కానీ వేరెట్టి ఉపయోగము దానినుండి వుండదు. కనుక, ఆత్మను ఆధారముగా స్వీకరించి, దైవజీవులుగా బ్రతుకవలెను.
(స.పా.ఆ. 75 పు.133)
(చూ|| అయస్కాంత శక్తి, దివ్య ప్రకటనలు, పుణ్యకర్మలు, వివాహము)