మృత్యువును కాలుడు అందురు. కాలునకు (కాలమునకు) దయా దాక్షిణ్యములు లేవు. నీ జీవితములోని క్షణక్షణము కాలుని కత్తెరతో కత్తిరింపబడు చుండును. అందుచే సమయ మాసన్నమైనపుడు ఈ ప్రపంచమును వీడవలసి యుండును. ప్రతి దినము నీ జీవిత కాలములో (ఆయుర్దాయములో) 24 గంటలు తరిగిపోవు చుండును. మృత్యువు కూడ సర్వశక్తిమంతుడు. సర్వాంతర్యామియే. అనుక్షణము మరణించు అనేక లక్షల మానవులను కొనిపోవుటకు అతడు త్రాళ్ళను తయారుచేయు కర్మాగారమును నడుపుటలేదు. మృత్యువు వాతబడనున్న మానవుడే ఆ త్రాటిని మెలి పెట్టి, మెడచుట్టూ సిద్ధ పెట్టుకొని యుండును. కాలుడు వచ్చి దానిని లాగటమే చేయుపని. మానవుడు ఆజన్మాంతము, గత జన్మలోను చేయు ప్రతిపనివల్లనే ఈ త్రాటిని తయారు చేసికొనుచున్నాడు. అహంకారబద్ధమైన అన్ని కార్యములు, స్వలాభాపేక్ష, ప్రతిఫలా పేక్ష మొదలగునవి ఈ త్రాటికి మరికొంత మెలిని, పొడవును ఇచ్చుచుండును.
(శ్రీ స.సూ.పు.76/77)
మృత్యువు యెల్లప్పుడూ జీవిని ఆంటియేయున్నది. మృత్యువు అను శబ్దమును వినగానే మానవుడు సహించడు. ఎంత వెఱ్ఱిః ఎట్టినైనా శుభకార్యములు జరుగుచున్నప్పుడు మృత్యువు అన్న శబ్దము విన్న అశుభమని అనుచున్నారు. కానీ యెంత శుభమనుకొన్ననూ జీవివేయు ప్రతి అడుగున మృత్యువువైపునకే పడుచున్నదికదా! మానవుడు ఏ వూరైనా ప్రయాణమై టిక్కెట్టుకొని ఆ రైలులో ఊరక కూర్చున్ననూ పండుకొన్ననూ, ఆరైలు యెట్లు తాను చేరవలసిన ప్రదేశమునకు చేర్చునో, అట్లే జీవుడు పుట్టుకతోనే మృత్యువను వూరికి టిక్కెట్టుతీసుకొన్నాడు. మీరెన్ని ప్రయత్నములు చేసిననూ, యెంత జాగరూకతతో నుండినను అది ఏనాటికయినా రాక తప్పదు కదా! ఏది నిశ్చయము కాక పోయినా మృత్యువు మాత్రము నిశ్చయము. దానిని మరచుటకు ప్రయత్నింప వీలేలేదు.
(ప్రే.వా.పు.4)
మృత్యువు యెదుట అన్ని గర్వములు, అన్ని హా దాలును, అణిగిపోవును. కాన అహర్నిశము దేహమును గూర్చి యోచించక పారమార్థమును పొందగోరి త్రికరణశుద్ధిగా సర్వజీవుల కొరకు పాటుపడుటకు ఈ కాయమును కాపాడుకొనవలెనే కాని, నీవు ఈ దేహము కావు, ఆత్మవు.
(ప్రే.. పు. 26)
(చూ! నేను యెవరు?, వర్తమానము, హితభాష)