ఒక ఉదాహరణ: ఒక గ్రామంలో ఒక పేదవాడున్నాడు. అతనికి ఒక కుమారుడు, భార్య ఉన్నారు. సంపాదనకోసం ప్రక్క గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఒకనాడు అలసి పరుండగా తాను ఆ దేశానికి రాజైనట్లు, తనకు ఐదుగురు కుమారులున్నట్లు కల గన్నాడు. అతను ఇంటికి వచ్చిన తరువాత తండ్రి దూరంగా ఉండటం భరించలేక కుమారుడు మరణించాడని భార్య విలపిస్తూ చెబుతుంది. స్తబ్ధుడై నిలచిన భర్తను చూసి భార్య అంటున్నది. “స్వామి! మీ కుమారుని మరణం మీకు బాధ కలిగించడం లేదా?
-ఇలా ఉన్నారేమిటి? దానికి అతడు చెబుతున్నాడు, "దేవీ! దేనికోసం విలపించేది? నిన్న నాకు కలలో ఐదుగురు కుమారులున్నారు. వారిప్పుడు లేరు. ఇక్కడ ఈ కుమారుడు లేడు. ఆ ఐదుగురు కోసం ఏడ్చేదా? ఈ ఒక్కడికోసం ఏడ్చేదా?" ఒకటి రాత్రి కల, మరొకటి పగటి కల. ఒకదానిలో మరొకటి లేదు. కాని, రెండిటిలో నీవున్నావు. అందువల్ల నీవు నిత్యుడవు. అయితే, పగలుకు, రాత్రికి ఉన్న తేడా ఏమి? కాల, కర్మ, కారణ, కర్తవ్యములతో కూడినది పగటి అనుభవం. ఉదాహరణకు, నీవు గుంటూరు వెళ్ళావు. ఉదయం 10 గంటలకు బయలుదేరి మరునాడుదయం నాల్గు గంటలకు చేరినావు. ఎట్లా వెళ్ళినావు (కర్మ)? బస్సులో వెళ్ళినావు. దేనికోసం (కారణం? నీ భార్యకు ఇక్కడి వివరాలను, స్వామి విషయాలను చెప్పడానికి. ఇది నీ కర్తవ్యం. కాని, కలలో అలా ఉండదు. కలలో గుంటూరు వెళ్ళినావనుకో, ఎంతకాలం పట్టింది? ఎట్లా ప్రయాణించావు? ఎందుకోసం వెళ్ళావు? నీ కాయము మంచం మీదే ఉందే! ఏది గుంటూరు చేరింది? ఈ ప్రకారం జాగ్రదవస్థకు, స్వప్నావస్థకు తేడాలున్నప్పటికీ రెండిటిలోను నీవు ఉండటంచేత నిత్యుడవు అని గ్రహించాలి.
(స.సా.జ.2000వు. 191)