ఒక రోగి నావద్దకు వచ్చును. నేను విభూతిని కాని మరేదైన వస్తువును కాని సృష్టించి అతనికిచ్చెదను. దాని దివ్యశక్తిని గ్రహించగలుగుతాడు. మనశ్శాంతి పొందుతాడు. వ్యాధి తగ్గుతుంది. ఆ విశ్వాసమువలన ఎన్నో సత్పలితములను పొందుతాడు. నా యెడల భక్తిగలవారికి మాత్రమే వీటిని యిచ్చెదనని అనుకొనకుడు: ఎవరి బాధలు తీరుటకు దైవచింతన అవసరమో అట్టి వారందరికీ యిచ్చెదను.
వీటిని అద్భుతములు, చమత్కారములు అనుచుందురు. అది తప్పు. ఇవి అద్భుతములూ కాదు, నమస్కారము లందు కొనుటకు చేయు చమత్కారములు కాదు. ఇది నాకు సహజం; నా వినోదం: నా ఆనందం. ఇది నిదర్శనే కాని ప్రదర్శన కాదు. మానవుల మనస్సులను భక్తి, విశ్వాసము, విచారణ, ఆత్మజ్ఞానము వైపు మళ్ళించుటకు సహాయపడు గుర్తులే నేనిచ్చు వస్తువులు, మనస్సులో సంకలము కలుగగానే ఆ వస్తువు తయారగును. కావలెననుకున్న క్షణములో నా చేతిలో యుండును; లేదా నేనెక్కడ ఏది జరుగవలెనని సంకల్పించెదనో అక్కడ అది ఆ క్షణములోనే జరుగును.
(స.శి.సు.తృ, పు. 65)