అనేకమంది టీ, కాఫీలను అధికంగా త్రాగుతుంటారు. ఇవి శరీరమునందలి నిద్రాశక్తిని చంపివేస్తాయి. రాత్రిపూట లారీలను, బస్సులను డ్రైవ్ చేసేవారే ఎక్కువగా టీ, కాఫీలను త్రాగుతుంటారు. అంతేకాదు. పరీక్షల కోసం చదివే పిల్లలు కూడా వీటిని ఎక్కువగా త్రాగుతుంటారు. ఇది చాలా తప్పు. నిద్ర రాకుండా ఉండడానికి వీటిని త్రాగుతున్నారు. కాని, మానవునికి నిద్ర ఎంత ఉండాలో, అంత ఉండాలి. ఆహారం లేకపోయినా జీవించవచ్చును గాని, నిద్రలేకపోతే జీవించటానికి వీలు కాదు. అయితే నిద్ర ఎక్కువగా రాకుండా ఉండటానికి మనం సరియైన మార్గాన్ని అవలంబించాలి.
విద్యార్థులకు ఇంకొక విషయం. రాత్రి పదిగంటల తరువాత చదవటం ప్రారంభించకూడదు. రాత్రంతా చదవటం, తెల్లవారు ఝామున నిద్రపోవటం - ఇది చాలామందికి ఒక దురభ్యాసమయిపోయింది. అసలు రాత్రిపూట పశు పక్షి మృగాదులు కూడా నిద్రిస్తుంటాయి. ప్రకృతి అంతా నిద్రిస్తూ ఉంటుంది. ప్రకృతి నిద్రించే సమయంలో మేలుకొని ఉండేవాడు. ఎవడు? రాక్షసుడే. కనక, రాత్రిపూట చదివేవాడు రాక్షసుడనే చెప్పవచ్చును. ఇది కొంతమందికి అలవాటైపోయినది. ఈ అభ్యాసమును కొంత వరకు తగ్గించుకోవాలి. ఇది రజోగుణ,తమోగుణముల చేరికయే. రాత్రంతా చదివి తెల్లవారున నిద్రిస్తే, చదివినందంతా పోతుంది. వీరు చదువుకోవాలని అంత ఇష్టముంటే ఉదయం 3 గంటలకు లేచి చదువుకో, అయితే, చదువుకొన్న తరువాత తిరిగి నిద్రించరాదు. ఇది సరియైన సాత్విక పద్ధతి. ఈ పద్ధతిలో మితమైన ఆహారం ఉంటుండాలి.
(శ్రీ భ.ఉ.పు.139/140)
నిద్ర ప్రతి జీవునకు అత్యవసరము. నిద్రలేకున్న, మనిషి కానీ, మరే జీవి కాని జీవించలేడు. ప్రపంచ భోగము లన్నింటికంటే నిద్ర ప్రధాన భోగము. దీని ముందు సర్వ భోగములును నిరుపయోగమైనవిగా అల్పమైనవిగా గోచరించును. నిద్రపోకున్న ప్రాణిలో పంచ ప్రాణములు అనగా - ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ప్రాణములు - పంచాగ్నులవలె మేలుకొని యుండును. ఉఛ్వాస నిశ్వాసలు సమాన వాయువును సంచరింపజేయును. ప్రాణవాయువు అహవన్నీయాగ్నివలె ప్రసరించుచుండును. వ్యాన వాయువు దక్షిణాగ్నివలె వెలుగుచుండును ఉదాన వాయువు యజమాని యైన మనస్సును, కర్మ ఫలము ననుసరించి బ్రహ్మలోకమునకు తీసికొనిపోయి, అనగా తదాత్మ్య భావములోనికి తీసుకొనిపోయి, బ్రహ్మానంద మన నేమియో రుచి చూపును.
అనగా నిద్రలో హాయిని, విశ్రాంతిని, ఆనందమును, సుఖమును అనుభవించేది జీవుడే. దేహమనే దేవాలయానికి అతనే దేవుడు. బాహ్య జగత్తులో చూచినది, వినినది, అనుభవించినది. దానితోపాటు చూడనివి. విననివి అనుభవించనివి కూడా జీవుడు అనుభవించును. అంతేకాదు, పూర్వజన్మములో అనుభవించినవికూడా ఈ జన్మలో, కలలో కనుపించవచ్చును. అంతియే కాదు, రాబోవు జన్మల అనుభవములను కూడా అనుభవించ వచ్చును. ఇవి వారి వారి మనోకర్మ ఫలములపై ఆధారపడి యుండును. ఒకొకతూరి నిద్రలో దేహేంద్రియాదులతో సంబంధమును వదలి, ఆధారస్వరూపుడైన పరమాత్ముని లో లయమగును. అందువలననే జీవుడు హాయి ననుభవించును. ఆహాయియే పరమాత్ముని యొక్క స్వరూపము. కలలుకూడా రాని గాఢ నిద్రలో జీవుడు ఉదానములోని తేజస్సును పురస్కరించుకొని ఆనంద లోకములోనికి ప్రవేశించును. అదే బ్రహ్మలోకము, అదే ఆనందలోకము, పంచభూతములకు, పంచేద్రియములకుఅంతః కరణములకు, మూలకారణమైన పరమాత్మను, సమీపముగా చూచి ఆనందించుటకు, జీవునికి అప్రయత్నముగా లభించే సదవకాశము.
ఈ నిద్రలో తన స్వరూపము తెలియని అజ్ఞానము తమోగుణ రూపమున ఉండును. జ్ఞానులైనవారికి ఈ స్వప్నములో కూడా జాగ్రదావస్థలో నుండినట్లు ఆనందానుభూతి ఉండును. ఎరుక కలిగినవాడు దేహేంద్రియ బుద్దులతోడి తన సంబంధమును విరమించుకొని స్వస్వరూపాభవముచే అట్టి ఆనందము సహజముగా జాగ్రతలో అనుభవించును.
(సూ.వా.పు.43/44)
నిద్రకు కూడా ఒక సమయం , ఒక పరిమితి అవసరం. మానవునికి పని ఆహారం ఎంత అవసరమో నిద్రకూడా అంత అవసరము.
(వ.61-62 పు.60)
(చూ|| ప్రార్థన)