దేవి అనగా స్త్రీ స్వరూపం. ఆ జగత్తంతా త్రిగుణాత్మక స్వరూపం. అయితే ఈ స్త్రీ అను నది స కార, త కార, ర కారములతో చేరియుంటున్నది. స కారము సాత్వికమును గుర్తింపజేస్తున్నది. సాత్వికగుణము ప్రప్రథమంగా ఆవిర్భవించేది తల్లి నుండియే. తల్లి తన రక్తమును ప్రేమ మయంగా మార్చి బిడ్డలకందిస్తుంది. కనుకనే తల్లి ప్రేమను వర్ణించి చెప్పుటకు వీలుకాదు. రెండవది, తకారము. బిడియము, అభిమానముమొదలగునవి తకారమునకు చెందిన లక్షణాలు. స్త్రీలలో సిగ్గుపడే గుణము అమితంగా ఉంటుంది. వారు తమ గౌరవ మర్యాదల కోసం నిరంతరం పాటుపడుతుంటారు. స్త్రీలు ఇట్టి పవిత్రమైన గుణములను కలిగినటువంటివారు. అని ఈ తకారము సూచిస్తుంది. అంతేగాని, తినడం - నిద్రించడం వంటి లక్షణాలను కలిగియుండుట కాదు.మూడవది: రకారము. ఇది రాజసిక లక్షణాన్ని గుర్తింపజేస్తుంది. యందు అమితంగా ఉండే త్యాగము, ఔదార్యము వంటి గుణాలు రకారమునకు సంబంధించినవే. స్త్రీలు కష్టనష్టాలకు విచారించక, తమ గౌరవాన్ని నిలుపుకొనే నిమిత్తమై నట్టి త్యాగానికైనా పాల్పడుతారు. అవసరం వస్తే ప్రాణ త్యాగానికైనా పాల్పడుతారు. అవసరం వస్తే ప్రాణ త్యాగానికైనా వెనుదీయరు. సాత్వికమునకు విరుద్ధముగా దండెత్తి వచ్చే తమోగుణములను నిర్మూలించడానికి తాము నిరంతరం సంసిద్ధులై ఉంటారు. కనుక దేవి - అనగా రజోగుణాన్ని ధరించి దుర్గుణాలను నిర్మూలం గావించి, సాత్వికమును పోషించే శక్తి స్వరూపిణియే..
(స.సా.శ.91.పు.305)
దయ, త్యాగము, సహనము, సానుభూతి, ప్రేమ ఇత్యాది సద్గుణములు స్త్రీలయందే ఎక్కువగా ఉంటాయి. స్త్రీలు ప్రకృతి స్వరూపులు, చాల పుణ్యవంతులు చాలమంది అనుకుంటూ ఉంటారు - స్త్రీ జన్మ ఎత్తే బదులు పురుష జన్మ ఎత్తి ఉంటే స్వేచ్చగా తిరిగేవారమని. ఇది చాల పొరపాటు. పురుషులకంటే స్త్రీలయందే గొప్ప శక్తి ఉంటున్నది. స్త్రీ లే గొప్ప ప్రాప్తిని పొందగల్గుతున్నారు. కనుక, స్త్రీ లను చులకనగా చూడకూడదు. పవిత్రమైన హృదయంలో వారిని గౌరవించాలి. ఎన్ని కష్ట నష్టములు కలిగినప్పటికీ స్త్రీ లలో సత్య ధర్యములకు విరుద్ధంగా నడుచుకునేవారు చాల తక్కువు.
సీత అశోక వనంలో ఉన్నప్పుడు హనుమంతుడు వెళ్ళి ఆమెను దర్శించాడు. ఆమె చుట్టూ ఉన్న రాక్షసులు ఆమెను అనేక విధాలుగా బాధ పెట్టడం కన్నులారా చూశాడు. తిరిగి రామునివద్దకు వచ్చి సీత పడుతున్న బాధలను గురించి హృదయం కరిగేటట్లుగా చెప్పాడు. లక్షణమే రామలక్ష్మణులు వానరులతో కలసి లంకకు వచ్చి రావణ వధ చేశారు. రామాజ్ఞను శిరసావహించి హనుమంతుడు సీత దగ్గరకు వెళ్ళి, "తల్లీ! రావణుడు హతమైపోయాడు.రాములవారు విజయం సాధించారు.మీరు వచ్చి రాములవారిని దర్శించండి" అని చెప్పాడు. "తల్లీ! మీ చుట్టూ ఉన్న ఈ రాక్షసులందరూ ఇంతకాలం మిమ్మల్ని చాల హింసించారు. కనుక, మీరు అనుమతిస్తే వీరినందరిని ఒక్క క్షణంలో భష్మం చేస్తాను" అన్నాడు. అప్పుడు సీత, "నాయనా! ప్రభువు యొక్క ఆజ్ఞను పాలించటం ప్రజల కర్తవ్యం నీవు నీ ప్రభువు యొక్కఆజ్ఞను ఏవిధంగా శిరసావహిస్తున్నావో అదేరీతిగా, ఈ రాక్షసులు కూడా తమ ప్రభువుయొక్క ఆజ్ఞను పాలిస్తూ వచ్చారు. ఇది వీరిదోషం కాదు. కనుక, వీరిని హింసించటం న్యాయం కాదు" అని పలుకుతూ, ఒక చిన్న కథ చెప్పింది. ఒక పులి ఒక వేటగానిని తరుముకుంటూ రాగా అతడు అలసిపోయి ఒక చెట్టు ఎక్కాడు. ఆ పులి వచ్చి చెట్టు క్రింద కూర్చుంది. అతనిని ఏవిధంగానైనా ఆరగించాలని పట్టుదలతో ఉంది. ఆ చెట్టుపైన ఒక కరడి (ఎలుగుబంటు) నివసిస్తున్నది. దానిని చూసి ఈ పులి చెపుతున్నది - "ఓ కరడీ! నాకు చాల ఆకలిగా ఉండటంచేత ఆ వేటగానిని తరుముకుంటూ వచ్చాను వానిని క్రిందికి నెట్టు, నేను భుజించి వెళ్ళిపోతాను" అప్పుడా కరడి "ఇతడు నా ఇంటికి అతిథిగా వచ్చాడు. అతిధి, అభ్యాగతులను ఆదరించటం నా ధర్మం . కనుక, నితనిని క్రిందికి నెట్టను" అన్నది. సరే, ఇంక చేసేదేమీ లేక వేటగాడుక్రిందికి దిగకపోతాడా, అని పులి కాచుకొని ఉన్నది. కొంత సేపు అయిన తరువాత కరడికి నిద్ర వచ్చింది. అప్పుడా పులి వేటగాడిని ఉద్దేశించి, ఆయ్యా! ఇంతవరకు నిన్ను తరుము కుంటూ వచ్చాను. నాకు ఆకలి తీరటం ప్రధానంగాని, నీవైతే నేమి, ఆ కరడి అయితే నేమి! నా కడుపు నిండితే చాలు. కనుక, నిద్రలో ఉన్న ఆ కరడిని క్రిందికి నెట్టు. నేను దానిని భుజించి నిన్ను వదలి పెట్టి వెళ్ళిపోతాను" అన్నది. కరడికున్న నీతి కూడా ఆ వేటగానికి లేకపోయింది. అది తనకు చేసిన ఉపకారమును మరచిపోయి, కృతఘ్నుడై దానిని క్రిందికి నెట్టివేశాడు. ఐతే ఆది క్రింద పడిపోతూ ఆదృష్టవశాత్తు ఒక చిన్న కొమ్మను చిక్కించుకొని తిరిగి పైకి ఎగబ్రాకి తన ప్రాణాన్నిరక్షించుకుంది. అప్పుడు పులి. "ఓ కరడి! నీవు ఎంతో దయలో వేటగానిని రక్షించావు. కాని, అతడు కృతఘ్నుడై నీకు ద్రోహం తలపెట్టాడు. మనుష్యులను నీవు నమ్మరాదు. కనుక, అతనిని తక్షణమే క్రిందికి నెట్టివేయ్" అన్నది. అప్పుడు కరడి చెప్పింది- "ఎవరి పాపం వారిది. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను. ఉపకారం చేయడమే నా స్వభావం,అతడు నాకు అపకారం తల పెట్టినాడని నేను తిరిగి అతనికి అపకారం చేయను." ఈ కథ చెప్పి సీత, "హనుమంతా! ఈ రాక్షసులందరూ నన్ను హింసించిన మాట నిజమే. కాని సాక్షాత్తు శ్రీరామచంద్రుని పత్ని నైయుండి నేను కూడా ప్రతీకారం కోసం ప్రాకులాడతానా? వారిని హింసించడానికి ఏనాటికీ అంగీకరించను" అన్నది. అప్పుడు హనుమంతుడు, "తల్లీ! గొప్పవారి హృదయం కూడా గొప్పగానే ఉంటుంది. దివ్యతేజోవంతుడైన శ్రీరామచంద్రుని ధర్మపత్ని ఇంత ధర్మస్వరూపురాలని నేను గుర్తించుకోలేకపోయాను నమ్ము క్షమించు" అన్నాడు. అప్పుడు సీత, "నాయనా! నాకు మాత్రమే కాదు, మా స్త్రీజాతి అంతటికీ కరుణ, దయ సహజము" అన్నది.
(స. సా.జ.99పు. 142/143)
ఒక దేశము యొక్క గౌరవ ప్రతిష్ఠలు ఆదేశములోనిస్త్రీల చేతులలో ఉంటాయి. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సాంప్రదాయములలో స్త్రీలకు ఎప్పుడు ఒక విశిష్టమైన స్థానము కల్పించబడింది. సమాజము యొక్క శక్తి సామర్థ్యములన్ని పై ఆధారపడియున్నాయి. స్త్రీ తన భర్తకు తోడునీడగా, మార్గదర్శిగా ఉంటూ, తన పిల్లలకు మొట్టమొదటి గురువై సమాజంపట్ల వారికి సరియైన వైఖరిని పెంపొందిస్తూ, వారికి ఆదర్శవంతమైన సంభాషణ నేర్పుతూ, వారి మానసికానందమును సంరక్షిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే,స్త్రీలు బాల్యదశలో భావి భారత పౌరులను తీర్చి దిద్దే ఆదర్శగురువులు".
(దై.ది.పు.361)
స్త్రీలు గాయత్రీ మంత్రాన్ని జపించవచ్చా? అని చాలమంది అడుగుతుంటారు. తప్పక జపించవచ్చు. అసలుగాయత్రియే స్త్రీ కదా! అలాంటప్పుడు స్త్రీలు గాయత్రీ మంత్రాన్ని జపించకూడదనడంలో అర్థం లేదు. ప్రాచీన కాలంలో స్త్రీలకు కూడ ఉపనయనాలు జరిగేవి. కానీ తమతో పాటు స్త్రీలు కూడా మూడు వేళల సంధ్యవార్చుతూ పూజాపునస్కారాలలో మునిగి ఉంటే ఇంటి పనులెవరు చేస్తారని భావించి మగవారు స్వార్థంతో యజ్ఞోపవీతాన్ని మంగళ సూత్రంగా మార్చి స్త్రీల మెడలో కట్టడంప్రారంభించారు.
(స. సా.జులై 98పు.172)
స్త్రీలు త్రిగుణాత్మకమైన స్త్రీ తత్వము. స్త్రీ అనే పదమునందు మూడు అక్షరాలున్నాయి. స. త. ర. సత్వగుణ సూచకం: స్త్రీలలో సాత్విక గుణము ప్రధానమైనది. దానివలనే వారికి సహనము, వినయము, విధేయత సహజముగానే అలవడును. తదుపరి, త-అక్షరము తమోగుణ సూచకము, దీనివలన, స్త్రీలలో భయము, సిగ్గు, లజ్జ మొదలగు స్వభావములు ప్రకటితమగును. రజోగుణమును సూచించునది ర అనే మూడవ అక్షరము. స్త్రీలలో రజోగుణము అభివృద్ధి అయినపుడు సర్వనాశము స్వతస్సిద్ధము. పురుషునికి ఒకే గృహము. స్త్రీకి రెండు గృహములున్నవి. స్త్రీ పుట్టిన ఇల్లు, మెట్టిన ఇల్లు రెండింటి గౌరవములను, సత్కీర్తిని నిలబెట్టి పోషించవలసి యున్నది. స్వేచ్ఛావిహారము వలన స్త్రీలు రెండు కుటుంబములకూ అపకీర్తి తెస్తారు. కాబట్టి, స్త్రీ లలో సాత్విక గుణము అతి ప్రధానము. రజోగుణము అప్రధానము.
(స. సా.ఆ.78 పు.125)
(చూ" అర్ధనారీశ్వరుడు. ఈనాటి స్త్రీలు, గాయత్రి, గృహలక్ష్మి, రోగము, వరలక్ష్మి వ్రతము. సమానులే, హనుమంతుడు)