అవతరించుట యనుటలో అర్థమేమి?
ప్రజలపై ప్రేమవాత్సల్య పరతతోడ
వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి
జీవ ప్రజ్ఞతో బాటుగా దైవ ప్రజ్ఞ.
(శ్రీ. స.వా. పు.98)
అవతరించటం అనగా దైవము మానవస్థాయికి దిగి రావటమే. ఆ స్థాయికి దిగినంత మాత్రమున అవతార తత్వమునకు ఎట్టి కళంకము ఉండదు. అవతారములకు ఎట్టి విలువలు, ఏమాత్రమూ క్షీణించవు. దీని కొక ఉదాహరణ. చంటిబిడ్డ భూమిపై ఆడుకుంటూ ఉంటుంది. ఆబిడ్డ యొక్క తల్లి తాను పెద్దదాన్ని కదా! అని అహంకరించి ఆ బిడ్డతో "నీవు ఎగిరితే" నేను ఎత్తుకుంటాను అంటే? అబిడ్డ ఎగర గలదా? కాని, ఆ బిడ్డపైన ఉన్న ప్రేమతో ఆ తల్లియే వంగి బిడ్డను ఎత్తుకుంటుంది. కేవలము ఆ తల్లి వంగినంత మాత్రమున, ఆబిడ్డకు, ఆ తల్లి లొంగిపోయినట్లవుతుందా? కాదు. కాబట్టి, దివ్యస్థానాన్ని పొందలేని అశక్తులైన మానవులను అను గ్రహించే నిమిత్తమై, దైవం మానవాకారమును ధరించి వారి స్థాయికి దిగి వస్తుంది. దైవము మానవాకారమునుధరించి, వాని స్థాయికి దిగి వచ్చినంత మాత్రమున ఆ అజ్ఞాని కేవలం తన కోసమే లొంగి వచ్చినట్లుగా భావిస్తాడు. ఆ రీతిగా వచ్చుట "వంగటమే" కాని "లొంగటం" కాదు.
(శ్రీ 4.ఉ.పు.112)