దైవము కూడా దేహధారి అవుతున్నాడు. మానవత్వము అవతార తత్వము సమానముగా గుర్తించినప్పటికినీ, అంతర్భావములందు వ్యత్యాసమున్నది. దేహదారియైన మానవుడు అపేక్షతో నిండి ఉంటాడు. ఫలాపేక్షతో కూడి ఉంటాడు. దేహధారియైన దైవత్వము నిరపేక్షలో నిండి ఉంటుంది. మమత్వముతో కూడి ఉంటుంది మానవత్వము. బ్రహ్మత్వముతో అర్థమయ్యేదేగానీ, దృశ్యములో గాని, ఆలకింపులతోగాని అర్థమయ్యేది కాదు. రాగద్వేషములకు అతీతమైనది; అభీష్టమమకారములకు దూరమైనది; నిరంతరము బ్రహ్మలక్ష్యమునందే ఉండేది అవతార తత్వము. ఇది ఎట్లనగా!
ఫిలుము రికార్డగు ప్లేటును చూచిన
ఒక్క రీతిగానే ఒనరియుండు
సౌండు బాక్సు నందు సవరించి చూచిన
పదములెన్నో రీతుల పలుకుచుండు
అదే విధముగనే బాహ్యదృష్టిలో విషయంలో ఇరువురూ రెండుగా కనిపించవచ్చును. కానీ అంతర్భావములు వేరువేరుగా ఉంటాయి. అవతార తత్వము పూర్ణత్వము. మానవత్వము శూన్యత్వము. కనుకనే మానవత్వమందు పూర్ణత్వమున్నదనే సత్యాన్ని గుర్తించినప్పుడు మానవత్వము దైవత్వముగా రూపొందుతుంది.
(త.శ.మ.పు.267)