తక్కిన బాలురతో పాటు రాముడు కూడా వశిష్టుని పాదాల చెంత కూర్చుని విద్యనభ్యసించాడు. కృష్ణుడు కూడా సుదాముడు మొదలైన మిత్రులతో కలసి సాందీపుని గురువుగా స్వీకరించి విద్యనభ్యసించాడు. నిర్గుణనిరాకార పరబ్రహ్మము, మానవాకృతి ధరించి భూమిపై అవతరించినప్పుడు, ఆ అవతారము యొక్క ప్రవర్తన తక్కిన వారికి ఆదర్శప్రాయంగా ఉండాలి.
(స.శి.సు.నా, పు.5)
అవతారపురుషులు కూడా అధ్యాపకుల వద్ద శిక్షణ పొంది, విద్య నేర్చి గురువుల ఆదేశానుబద్ధులై యుండవలెను. దైవ స్వరూపులైన వారు స్వతస్సిద్ధముగా సర్వజ్ఞులై యున్ననూ, వారు విద్యార్థులుగా వ్యవహరించి నంతకాలము విద్యార్థి విధులను, కర్తవ్యములను చక్కగా పాటించి ప్రపంచమునకు ఆదర్శముగా నుండెదరు. శ్రీరామచంద్రుడు వసిష్ట మహామునివద్ద, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షి వద్ద గురుకులవాసము చేసి విద్యనభ్యసించిరి. స్వామియూ, అదే విధముగా నాలుగు ఊళ్ళలో పుట్టపర్తిలో, బుక్కుపట్టణంలో, కమలాపురములో, ఉరవకొండ స్కూళ్ళలో చదివారు.
(లీ. నా. సా.పు.49)
భూకంపములు, వరదలూ, అనావృష్టి, కరువులూ, అంటువ్యాధులు అటువంటి విపత్తులను ఎదుర్కొనగల దివ్యశక్తిని మానవులలో ఆవిర్భవింపచేయటమే ఇప్పుడు నేను కొనసాగిస్తున్న ఉద్యమము. తాత్కాలిక సమస్యలను పరిష్కరించటము. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించటమూ, ప్రజలకు అలవరచటంద్వారా అవతారపురుషుడు రెండు విధాలుగా మానవజాతికి సాయపడగలడు. తాత్కాలికమైన పరిష్కారము అన్నిటికీ మూలమైన కర్మసూత్రమునకు భిన్నంగా వర్తించవలసి వస్తుంది. ప్రజలలో అధిక సంఖ్యాకులు స్వార్థముతో కోరికలతో కూడిన కర్మ సూత్రమునకు లోబడిన భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నారు. తమ కర్మఫలమును అనుభవిస్తున్నారు. దీనినిబట్టి వారికి పురోగతికానీ, అధోగతికానీ లభిస్తున్నవి. అవతార పురుషుడు తాత్కాలిక సమస్యల పరిష్కారంలో జోక్యం కల్పించుకుంటే ప్రజలకార్యకలాపములు,అభ్యున్నతి,పరిణామమూనిరోధించినట్లుఅవుతుంది.సహజమయినప్రకృతినియమాలకు ఆటంకం కలిగించే ఇటువంటి తాత్కాలిక పరిష్కారాలు పనికిరావు.
ఇంతకంటే ప్రయోజనకరమైన మార్గము ఇంకొకటి వున్నది. అవతారపురుషుడు ప్రజల చైతన్యస్థాయిని పెంచి ఆధ్యాత్మిక సూత్రముల స్వరూపమును గుర్తింపజేయాలి. అప్పుడు ప్రజలు ధర్మమార్గమును అనుసరించి ఉత్తమ మైన పరిస్థితులను ఏర్పరుచుకోటానికి దృఢ సంకల్పముతో కృషి చేయగలరు. అప్పుడు వారికృషి ప్రకృతి నియమములతో కర్మ సూత్రములతో సమన్వయము పొందుతుంది. అప్పుడు వాళ్లు యీ కారణ కర్మల చక్ర పరిధిని దాటుకుని, ప్రకృతి శక్తులను వశపరచుకొని, యీ విపత్తుల నుంచి తప్పించుకో గలుగుతారు.
సరిగ్గా వాళ్లు నా సంకల్పశక్తిలో భాగస్వాములౌతారు. నేను వాళ్ల ద్వారా పనిచేసి, వారిలో అంతర్గతంగా ఉన్న దివ్యత్వాన్ని మేల్కొలిపి, ప్రకృతిశక్తులను వశపరచుకునే విధంగా వున్నతమైన సత్యం వైపు వాళ్లని మళ్లించాల్సి వుంటుంది, అట్లాగాక, వున్నపాటుగా ప్రజల్నీ స్థితిలోనే వుంచి, అన్నీ నేనే సరిచేసినట్లయితే, అన్ని వ్యవహారాలు అస్తవ్యస్తం అయి వెనకటి సందిగ్ధ పరిస్థితి తిరిగి నెలకొంటుంది. కష్టాలు, బాధలూ దివ్యలీలలోని భాగాలే. ఇవి భగవంతుడు కల్పించేవి కావు. మానవులే తమ పాపకార్యాలకు ప్రతిఫలంగా వీటిని ఆహ్వానిస్తారు. ఇది మానవుని బాగుచేసే శిక్ష. దీనివల్ల మానవుడు దుర్మార్గాన్ని విడిచి, సచ్చిదానంద తత్వం వైపు పయనిస్తాడు. ఇదంతా మహాసమ్మేళనంలోని భాగం. దాన్లోని ప్రతికూలాలన్నీ అనుకూలాల్ని పెంచటానికి దోహదం చేస్తాయి. మృత్యువువల్ల అమృతత్వం, అజ్ఞానం వల్ల జ్ఞానం, బాధలవల్ల సంతోషం, రాత్రివల్ల పగలూ విశేషంగా ప్రకాశిస్తున్నాయి.
అందువల్ల, ఒకవేళ అవతారాలు యీ విపత్తులన్నీ తొలగించేటట్లయితే, కర్మసూత్రంలో కూడిన యీ సృష్టి నాటకమంతా ఆగి పోతుంది. అయితే అవసరం వచ్చినప్పుడు నేనేదైనా చెయ్యగలను. చేస్తాను. కానీ, యీ ఆపదలన్నీ మానవుడు కల్పించేవే గాని, దేవుడు కల్పించేవి కావనిమాత్రం జ్ఞాపకం వుంచుకో. అందువల్ల మనిషిలోని ఆహంకారం తొలగించి, కర్మచక్రాన్ని అతిక్రమించే విధంగా అతనిలో చైతన్యం వికసించి, ప్రకృతిని వశపరచుకునే విధంగా దానిని పునర్నిర్మించాలి. ఇదే అవతారం యొక్క కార్యక్రమం. దీన్నే నేనిప్పుడు అమలు పరుస్తున్నాను.
(స.ప్ర.పు.21/23)
(చూ॥ ఆత్మ/ఆత్మారామాయణము)