ఈశ్వర అనగా సకలైశ్వర్య స్వరూపుడు. ఐశ్వర్యమనగా ఏమిటి? కేవలం ధన కనక వస్తు వాహనాదులు మాత్రమే కాదు. ఆరోగ్యము ఒక ఐశ్వర్యమే. మేధాశక్తి ఐశ్వర్యమే. భుజబలమూ ఐశ్వర్యమే. కాబట్టి మానవుని యందున్న సర్వస్వమూ ఐశ్వర స్వరూపమే. కనుకనే ‘ఈశ్వర’ అనగా సకల ఐశ్వర్యములను చేకూర్చేటటు వంటిది ఈశ్వర తత్వము.
(శ్రీవా. ఏ 1995 - పు. 8)
ఈశ్వరః అనగా నిఖిలైశ్వర్యము కలవాడు. ఏమిటి ఈ ఐశ్వర్యము? ధనము ఒక ధనమే. ఆరోగ్యము ఒక విధమైన ధనమే. విద్య ఒక ధనమే. గుణము ఒక ధనమే. తెలివి ఒక ధనమే. సర్వము ధనముల క్రిందనే పోల్చు కుంటూ వచ్చారు. ఇవన్నీ ధనములే. సకలైశ్వర్యస్వరూపుడు ఈశ్వరుడు అనే సత్యానికి దిగారు. తరువాత యిందులో వున్న రహస్యాన్ని గుర్తించి శివః అన్నారు. శివ అనగా త్రైగుణ్యరహితుడని అర్థము. సత్వరజస్తమోగుణములకు అతీతమైనవాడు, గుణములు లేనివాడు కనుక శుద్ధసత్వుడు అనియు పిలుచుకుంటూ వచ్చారు. శుద్ధసత్వుడే శివుడు. అదే మంగళకరమైన తత్వము. గుణములు లేనప్పుడే మంగళత్వము. గుణము లుండినప్పుడే అమంగళము ఏర్పడుతుంది కనుక శివః అనగా మంగళ స్వరూపుడు. క్రమక్రమేణా మానవుడు ఇంకా వున్నతస్థాయికి వెడుతూ వచ్చాడు. సంభవ: అని నాల్గవ పేరు. తన యిష్ట ప్రకారము ఏ నియమములు లేకుండా ఎప్పుడు అవసరమో ఎక్కడ అవసరమో ఏ కాలములో అవసరమో అప్పుడంతా తాను ఉద్భవించే భావము కలవాడిని సంభవః అన్నారు. అందువల్లనే భగవద్గీతలో
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత,
అభ్యుత్ధాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్...
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్,
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
ఎక్కెడెక్కడ అవసరమో అక్కడక్కడంతా తాను ఉద్భవిస్తూ వుంటాడు. అలాంటి స్వాతంత్ర్యము కలవాడు కనుకనే ఆతనికి సంభవః అని పేరు. ఈ విధముగా ఒక్కొక్క ఆంతరార్థమును పురస్కరించుకొని పేర్లు పెడుతూ వచ్చారు. ఈశ అని మరొక పేరు పెట్టారు. మానవుని తెలివితేటలు ఎంత ఘనముగా అభివృద్ధి పొందుతూ వచ్చాయో ఆనాటి ఋషులయొక్క తత్వము చక్కగా గుర్తించి ప్రయత్నించాలి. ఐశ్వర్యము, ధనము, కీర్తి, యశస్సు, జ్ఞానము, వైరాగ్యము షడైశ్వర్యస్వరూపుడే ఈశుడు. ఈ షడైశ్వర్యస్వరూపుడు అనే తత్వానికి ఈశ అని పేరు పెట్టినారు.
(ఉ. బ్మ.పు, 17/18)