యాజ్ఞవల్క్యుని భక్తి శ్రద్ధలకు సూర్యభగవానుడు సంతసించి వాజి రూపమున వచ్చి యజుర్గణములను యాజ్ఞవల్క్యునికి బోధించెను. ఈ యజుర్గణములనే యాజ్ఞవల్క్యుడు తనశిష్యులకు బోధించెను. ఈ కారణముచేతనే ఈ శాఖకు వాజసనేయి అని పేరు వచ్చెను. వేదవ్యాస ప్రవర్ధితమగు యజుర్వేదశాఖ కృష్ణ యజర్వేదమనియు. యాజ్ఞవల్క్య సంవర్ధితమగు యజుశ్శాఖ శుక్లయజుర్వేదమనియు పిలువబడుచున్నవి. వీనియందలి మొదటికొన్ని అధ్యాయములు కర్మకాండ సంబంధమగు మంత్రములతోనూ, చివరి అధ్యాయములు జ్ఞానకాండలోనూ సమన్వయింపబడినవి. ఈశావాస్యము జ్ఞానకాండలో చేరినది. ఈ ఉపనిషత్తునందు మొదటి మంత్రమున ఈశావాస్యమును రెండు పదములచేత ప్రారంభించుటచే ఈ ఉపనిషత్తుకు ఈశావాస్యమును పేరు వచ్చినది.
ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భు న్జీ థా మాగృధ: కస్య స్విద్ధనమ్ "
నశ్వరభావముగల వస్తువులు ఏవేవి కలవో ఈ భూమియందు అవి అన్నియు స్వస్వరూపముగు భగవంతునిచే ఆచ్చాదింపబడి యున్న వనియు, అట్టివానిని త్యాగబుద్ధితో అనుభవించవలెననియు, పరుల ధనమును ఏ మాత్రము ఆశించహడదనియూ, ధనము ఎవ్వరిదీ కాదనియు పై శ్లోకము తెలుపుచున్నది. అనగా బ్రహ్మాండమంతయు ఈశ్వర స్వరూపము, ఈశ్వరుడు కానీ, అతనిచే శాసించబడిన బ్రహ్మాండముకాని, వేరువేరని, భావించుట కేవలము భ్రాంతి. నీటియందు కనిపించు ప్రతిబింబము ఎట్లు బింబము కంటే భిన్నము కాదో అటులనే ఈశ్వరుడునూ అతనిచే శాసించబడిన బ్రహ్మాండమును వేరుకాదు.
(ఉ.వా. పు.9)
ఈశావాస్యోపనిషత్తు, అజ్ఞానము మహాపాపమని చెప్పుచున్నది. అదే గీత పేర్కొన్న కార్పణ్యదోషము. మానవజాతిలో - అధికభాగమును బాధించుచున్న - యజ్ఞానమనెడి ఈ క్రూరవ్యాధికి, గీతయే తగినమందు . మీరందరును గీతను శ్రద్ధతో చదువనలె. ప్రతిదినమును, కొన్ని శ్లోకములు చదివి, వాటి యర్థమును చక్కగా మనసున కెక్కించుకొనుడు. ఆ యలవాటు మీ హృదయములను ప్రశాంత మొనర్చి, మీ బుద్ధికి వికాసము గల్గించును. మీరు పెద్ద పెద్ద వ్యాఖ్యానములు చదువనక్కరలేదు. గీతలోని యొక్కొక్క శ్లోక మొక్కొక్క రత్నము. మీరు చెవికి, ముక్కుకు, మెడకు-రత్నపురాళ్ళను తగిలించుకొనుట వలన ప్రయోజనము లేదు. మీ హృదయమును గీతాశ్లోక రత్నములతో నలంకరించుకొనుడు. అవి మీకు శాశ్వతానందము నిచ్చును; మీ మనసును, హస్తములను మంచి మార్గమున పనిచేయించును. , (శ్రీ సత్య సాయి వచనా మృ తము 1964 పు 64)