ఈనాడు స్త్రీలు చాలా మంది విద్యావంతులుగా, విద్యాభిమానులుగా, విద్యాధికారులుగా రూపొందు తున్నారు. కానీ వీరివలన లోకానికి కలుగుతున్న మేలు ఏమిటి? అనే విషయాన్ని ఆలోచిస్తే ... కేవలం వీరిలో 100 కి నూరుశాతం స్వార్థమే నిండియున్నది వీరిలో స్వార్థమును వీడి, దివ్యభావముతో సేవ చేసెడి వారు అరుదు. జీవితములో కొంత సుఖాన్ని, ఆనందాన్ని అందుకోవాలనే భావనలో ఉద్యోగము లందు ప్రవేశించి విద్యాలయాలకు వస్తున్నారు. ఈ నాటి స్త్రీలు.
ఉద్యోగము చేయ ముదితలందరు పోగ
గృహ కృత్యములను తీర్చు గృహిణు లేరి?
ఆలు మగ లిరువురును ఆఫీసులకు పోవ
బిడ్డలను పోషించు తల్లు లేరి?
పుస్తకాల్ చేబట్టి పురుషులవలె పోవ
వంట యింటిని దిద్దు వనిత లేరి?
దుడ్డు వలన గలుగు ఇబ్బంది తీరిన
ఇంటిలోని పనుల కొఱత లెంతయుండు?
సుఖము చూడబోగ సున్నయే
ఉద్యోగ పదవియం దున్న పడతికి.
ఇట్లు ఉద్యోగము చేయు స్త్రీలకు సుఖము కరువగుచున్నది. ఇంట గెలచి రచ్చ గెలువ మన్నారు. మన పెద్దలు. గృహ కృత్యాలు సక్రమంగా నిర్వర్తించుకొన్న తరువాత ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలి. వివాహితయైన స్త్రీని గృహిణి, ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి అని అంటారు. ఇల్లాలున్నది దేనికోసం? ఆమె విద్యకు ఉపయోగం ఏమిటి? తన బిడ్డలకు వినయం, విధేయత, క్రమశిక్షణ, విద్యా బుద్ధులను గరపాలి, వారిని పవిత్రభావాలతో ఆదర్శపారులుగా తీర్చిదిద్ది దేశానికి అందించాలి. కుటుంబ గౌరవాన్ని కాపాడాలి. తమ కుటుంబాన్ని ఆదర్శవంతమైన కుటుంబంగా నిరూపించాలి. అంతేగాని కేవలం ధనం సంపాదించడము ముఖ్యాంశము కాదు. ఈనాడు మానవునిలో నీతినిజాయితీలు బొత్తిగా కనిపించక పోవుటకు గల ముఖ్యకారణం దురాశ. అధికంగా ధనం సంపాదించాలనే కోరిక.
ధనము హెచ్చిన మదము హెచ్చును
మదము హెచ్చిన దుర్గుణము మానక హెచ్చు
ధన ముడిగిన మదముడుగును
మద ముడిగిన దుర్గుణంబు మానును వేమా!
"అసంతృప్తి ద్విజో నష్టః"
(స.సా. ఆ. 78 పు.179)