ఒకనాడు గాంధీ చాలా విచారంగా కూర్చొని యుండగా ఒక విదేశీయుడొచ్చి - "గాంధీజీ! ఏమిటి మీరు విచారిస్తున్నారు? మిమ్మల్ని విచారపరుస్తున్న సమస్య ఏమిటి?" అని అడిగాడు. అప్పుడాయన చెప్పాడు - "ఈనాటి విద్య మానవునికి మృదు మధురమైన జీవితాన్ని లేకుండా చేసి కఠినమైన శిలాహృదయునిగా మారుస్తున్నది" అన్నాడు. ఇలాంటి విద్యలు నేర్చి ప్రయోజనమేమిటి? పల్లెలలో పూర్వం అనేవారు - "చదువు కున్న వాళ్ళ కంటె చాకలివాడు మేలు" నీవు రెండు ట్రౌజర్లు, రెండు ప్యాంట్లు, రెండు టవల్సు చాకలి వానికి వేస్తే ఒక బుక్ లో వ్రాసుకుంటావు. కాని, చాకలివాడు ఎంత మంది గుడ్డలో తీసుకొని పోతాడు కాని, ఎక్కడా వ్రాసుకోడు, వాటిని తిరిగి జాగ్రత్తగా తెచ్చి ఇస్తాడు. వాని తెలివి తేటలు ఎంత గొప్పవి! ఈ చదివిన వానికి, ఆ చదవని వానికి ఎంత వ్యత్యాసమో తెలుసుకోండి.
(స.సా.డి.93 పు.317/318)
ఈనాటి విద్యావిధానంలోని పొరపాట్లను అధికారులు గుర్తించి కొంత మార్పులు తెప్పించాలి. ఏమి మార్పులు తెప్పిస్తున్నారు? ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి రూల్స్ అన్నింటినీ మారుస్తున్నారు. కనుక మారని, కూడని, చెరగని ఒక్క సిద్ధాంతమును మనం స్థిరం చేసుకోవాలి. విద్యా విధానమును మార్చటానికి వీరు అనేక కమిటీలను పెడుతూ వచ్చారు. ఏమిటి ఈ కమిటీ? "కమ్ ఫర్ టీ" (come for tea)! ఇంత కంటే మించి లేనే లేదు. ఏ కమిటీయైనా ఒక్కదానిని స్థిరంగా ఉంచిందా? ఏమీ లేదు. కమిటీ వేసి నందుకు ఒక మీటింగు ... ఒక రిపోర్టు!! ఆ రిపోర్టు ఎక్కడ పోతున్నదో ఏమో ప్రజలకు తెలియటం లేదు. ప్రపంచమంతా విద్యా రంగంపై ఆధారపడి యున్నది. ఆఫీసర్ కావాలన్నా, క్లర్కు కావాలన్నా, బ్యాంకుకు పోవాలన్నా, వ్యాపారం చేయాలన్నా విద్య చాలా అవసరం. అట్టి ప్రాణ సమానమైన విద్యను ఈనాడు సరిగా అర్థం చేసుకోవటం లేదు.
(ఏ.సా.డి.93 పు.318/319)