శ్రవణము

పవిత్ర ప్రదేశమున, దేవాలయములందో, లేక మందిరము లందో, పూజా గృహములందో లేక మహనీయుల ఆశ్రమములందో, సాధుసజ్జనుల సంఘములందో, యేదియును లేక, విశాలమైన ప్రదేశములందో, యేకాంత స్థానములందో, కృష్ణకథా లోలురై కీర్తనలు చేసిన, ఆనందమున మునిగి అన్నియూ మరతురు. అటులకానిదేని భగవత్ కథాలోలురగు మహాపురుషుల సమీపమున నుండి వారిని శ్రద్ధాభక్తి పూర్వముగ సేవా సత్కారములచే ప్రసన్నల గావించి అట్టివారితో గూడి భగవత్ కథా శ్రవణము చేయవలెను.

 

ఇట్టి అభిరుచి కలుగుట జన్మాంతర పుణ్యఫలము, అట్టిఫలము లేనివారికి పవిత్ర పరమాత్మ కథల శ్రవణప్రాప్తి లభించదు. ప్రారంభమున జిజ్ఞాసునకు పవిత్ర కథల యందు మనసు లగ్నము కాకపోయినప్పటికిని సాధు సంఘముల మధ్యకూర్చొని శ్రవణమయిననూ చేసిన చాలును. మెల్లమెల్లగా కథమీద రుచి పెరిగి విషయమును తెలిసికొనుటకు మొదలిడును; విషయ విచారణ పై మనసు తిరుగును.

 

పఠన కంటెను కథాశ్రవణము అధిక రుచిని కలిగించును. లేక శ్రవణ పఠనలు కూడనూ చేయవచ్చును. శ్రవణముపైరుచి గలవారు వంటరిగా వినుటకంటె కొంతమంది జిజ్ఞాసువులతో చేరి వినుట మంచిది. సామాన్య జిజ్ఞాసువులతో చేరి వినుటకంటె మహనీయుల జతచేరి వినుట మరింత మంచిది. మహనీయుల జతయందుండి వినుట కంటెను, మహనీయుల నోటినుండియే వినుట మరింత ఫలము. ఎందుకన మహనీయులు అనుభవ స్వరూపులై ఆనంద భాష్పములతో వికసిత ముఖమున వివరించుచుండగ శ్రోతలు కూడను మరింత రస సహితమై పరవశమంద గలరు,ఎట్లన దుఃఖముతో కొందరు కుమిలి కుమిలి యేడ్చుచుండ, అట్టివారలను చూచువారల కన్నులు యందునూ నీరుకారును. నవ్వుచున్న పిల్లలను చూచిన చూచు వారలకు కూడనూ నవ్వు వచ్చును. అటులనే, రసపూరితమైన హృదయముగల మహనీయుల వచనములు శ్రోతల హృదయములను కూడనూ రసభరితము చేయును. మహనీయుల చెంతచేరి స్వయముగా వారు చెప్పు భగవత్ కధలను శ్రవణము చేయుటచే కలుగు లాభము ఇంతా అంతాయని తెలుప సాధ్యము కాదు.

 

ఆట్టి పవిత్రమైన శ్రవణముచే కలుషపూరితమైన హృదయములు శాంతి రూపమై స్వచ్ఛ ప్రకాశమును పొందును. విషయవాసనలనబడు దుర్వాసనలకు విశ్వేశ్వర కథా శ్రవణము దివ్యసువాసన. ఎట్లన, కథాశ్రవణము కర్ణముల ద్వారా మనసున చేరి హృదయమును శుద్ధము చేయును.

 

అట్టి శుద్దమయిన హృదయమే భగవంతునకు యోగ్య మయిన స్థానము; పీఠము. అట్టి హృదయ కుహరమున భగవంతుడెపుడు నివాసము చేయునో, నివాసమేర్పరచు కొనునో, అప్పుడు అంతకు పూర్వము ఆ హృదయమున స్థానమేర్పరచుకొని వుండిన అరిషడ్వర్గములనబడు కామ క్రోధ మోహాదులు నెత్తిన బట్టవేసుకొని కాలికి బుద్ది చెప్పి కదలిపోదురు.

(భా.వా. పు.5/7)

(చూ॥ ఆనందము, నరక చతుర్దశి, భగవంతుని దృష్టి భృగువల్లి)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage