అసూయరహితుడే కాక శ్రద్ధావంతుడు కూడనూ కావలెను. శ్రద్ధ లేక యే చిన్న కార్యమును కూడనూ మానవులు సాధించలేరు. మానవులేకాదు: క్రిమికీటకాదులు, పశుపక్షి మృగాదులు కూడనూ కార్యములు సాధించలేవు. శ్రద్ధలేక, కర్మ చేసిన దాని ఫలము నైనను అందుకొన లేరు. ఒకవేళ ఫలముకూడనూ లభించిన ఆది శుద్ధముగా వుండియుండదు. శ్రద్ధ ఇంతటి మహత్తరమైనది. అదిలేనిది శుద్ధ ఫలమును యెట్టివాడునూ పొందలేడు.
(గీ..పు. 161)
శ్రద్ధ అనగా, శాస్త్రములయందూ, గురువులయందూ, జ్ఞానార్జనయందూ, ఇంతియేకాదు వీటన్నింటికినీ మించినది నీకై నీకు శ్రద్ధ ప్రధానంగా వుంచవలెను. శ్రద్ధలేక యెట్టి చిన్న కార్యమును కూడనూసాధింపలేడు మానవుడు. ఇక ఇట్టి పవిత్రమైన జీవనాధారమైన జ్ఞానమునకు శ్రద్ధయెంత ప్రధానమో యోచించు. ఈ శ్రద్ధఅనునది సామాన్యమైనది కాదు; శమ, దమ, ఉపరతి. తితీక్ష, సమాధానమను పవిత్ర పదార్థములను భద్రపరచు నట్టి ఇనుప పెట్టె వంటిది శ్రద్ధ.
(గీ.పు.95)
ఆస్థా అనగా ఆసక్తి స్వాస్థా అనగా స్థిరత్వము, ఆసక్తి స్థిరత్వము లేని మేధ నిరుపయోగము కదా. చాలమంది. మేధావంతులు ఉండవచ్చును. శ్రద్ధలేక పోతేవారు మేధాశక్తితో యేమి సాధించగలరు? శ్రద్ధ స్థిరత్వము రెండూ ఉండినప్పుడే ఆసక్తి బలపడుతుంది. ఆసక్తి స్థిరత్వము రెండూ కూడినట్టిదే బుద్ధి. కనుక మానవుడు తెలివి తేటల పైననే ఆధారపడి, తెలివితేటలనే నమ్ముకొని జీవించటము వెఱ్ఱితనము. దీనికి పైన ఆసక్తిని పెంచుకోవాలి. ఆసక్తి స్థిరత్వంగా రూపొందించుకోవాలి. అప్పుడే మానవుడు ఎట్టి ఘనకార్యమునైననూ సులభముగా సాధించగలడు. కనుకనే వేదాంతము "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అన్నది
(బృ త్ర.పు,96)
శ్రద్ధవాన్ లభతే జ్ఞానం
త త్పర స్పంయతేంద్రియః!
జ్ఞానం ల బ్ధ్వా పరాం శాంతిం
అచిరణాధిగచ్ఛతి |
అజ్ఞశ్చా శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి!
నాయం లోకోనస్తి నపరో న సుఖం సంశయాత్మః
శ్రద్ధ గలవానికే జ్ఞానము లభించును. ఇంద్రియములను స్వాధీనము చేసుకొని, ఆసక్తితో జ్ఞానమును పొందినవాడు మోక్షమును, శాంతిని పొందును. అట్లుగాక, ఆత్మజ్ఞానము లేక గురువాక్యములు నమ్మక, సంశయించు చిత్తము గలవాడు నశించును. సంశయాత్మునకు ఈ లోకమున గాని, పరలోకమున గాని సుఖశాంతులుండవు. శ్రద్ధ యనగా శాస్త్రములయందు, శాస్త్ర వాక్యములయందు, ఆత్మయందు, గురువుల యందు ఆచంచలమైన విశ్వాసము, నమ్మకము ఉండవలెను. నమ్మకమే శ్రద్ధలక్షణము. గురువులు పూజనీయులు, శ్రేయోమార్గమును జూపువారు. శాస్త్రములు లోకక్షేమమును, ప్రజాశ్రేయస్సును గోరునవి. చూపించునవి. కనుక అట్టి పవిత్రమైన వాటిపై నమ్మకము, శ్రద్ధ ఉండవలెను. అట్టి వానికే జ్ఞానము లభించును.
(శ్రీభ.ఉపు.20)
ప్రాచీనార్యుల యొక్క ప్రధానమగు అనుష్ఠానము, ధర్మము. అదియే యజ్ఞము. వారియొక్క యజ్ఞాద్యనుష్ఠానములు, అర్చనలు, వందనములు, నమస్కారములు మొదలగు భక్త్యంగములతో కూడియున్నవి. వేదసంహితలతో భక్తి శబ్ద ప్రయోగము సుస్పష్టముగా కనబడక పోయిననూ ఆ అర్థములో "శ్రద్ధ” అను శబ్ద ప్రయోగము తరుచుగా కనబడుచుండును కదా!
శ్రద్ధయాగ్ని: సమిధ్యతే శ్రద్ధ యాహూ యతేహవిః!
శ్రద్ధా భగస్యమూర్తిని వచసా వేదయామసి!
శ్రద్ధ ద్వారా మాత్రమే యజ్ఞాగ్ని ప్రజ్వలితమగుచున్నది. శ్రద్ధ వలననే హవిర్భాగముల ఆహుతులందబడుచున్నవి. సమస్తమగు ఆరాధనలకూ ప్రధానాంగమైన శ్రద్ధను మేము స్తుతించుచున్నాము అని పై శ్లోకార్థము. చూడుడు! శ్రద్ధ యెంత పవిత్రశక్తి కలిగినదో యోచించుడు,
(ధ.వా. పు. 84)
(చూ: అధాతో బ్రహ్మ జిజ్ఞాస, బుద్ధి, భవానీశంకర, లీలలు, శ్రేష్టుడు)