మేలు మేలు పాండవుల గాచి నావు
కంసుని మద మణచినావు
వసుదేవ, దేవకీల, చెరవిడిపించినావు
పదహారువేల, రమా మణుల సుబ్రోచినావు
(సా.పు. 107)
కృష్ణుడు అంత నలుపూ కాదు, అంత తెలుపూ కాదు! మూడు భాగాలు నలుపు, ఒక భాగము తెలుపు, కలిపితే ఎంతో అంత, అతనిది శ్యామల రూపము! నందుడు వైష్ణవుడు కాబట్టి, అబ్బాయికి, స్నానము చేయించి ఒకే ఒక గీత కస్తూరీ తిలకము పెట్టేవాడు. నందుని తల్లి ఆమె యొక్క కంఠాభరణమున శ్రీకృష్ణునికి ధరింపచేసినది. అదే కౌస్తుభము. ఆ కాలములో దానికి చాల గొప్ప వెల! ఆ పతకము మధ్య ఒక పెద్ద పచ్చ. మరకత రత్నము వుండెను. దాని చుట్టూ విలువైన వజ్రములు పొదగబడినవి. అది శ్రీకృష్ణుని వక్షస్థలమందు తళతళ లాడుతూ వుండేది.
చేతికి కంకణములు, అంటే వెండి కడియములు, పల్లెలోవాళ్ళు, గొల్లపిల్లలు ఆ కాలములో వేసుకొనే వారు. అయితే కృష్ణుడు వేసుకున్న కంకణములకు వేరే అంతరార్థమున్నది. యజ్ఞ సమయమందు, పెండ్లి సమయమందు కట్టుకునే దీక్షా కంకణములు కావు. అవి ప్రతిజ్ఞా కంకణములు-మూడు! గీతలో వాటిని గురించి కృష్ణుడు వెల్లడించినాడు. మొదటిది: పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. రెండవది: అనన్యాశ్చింత యంతోమాం - యే జనాః పర్యుపాసతే: తేషాం నిత్యాభియుక్తనాం యోగక్షేమం వహామ్యహం. మూడవది: సధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహంత్యా సర్వపాపాభ్యో మోక్షయిష్యామి మాశుచ.చూడండి, రెండవదాంట్లో యేజనాః అంటాడు! ఎవరినైనా సరే, అనన్యభక్తితో భగవంతుని భజించిన, ఉపాసన చేసిన, వాని యోగక్షేమమును వహిస్తాడు. ఏదేశము వారైనా, ఏమతము వారైనా, పండితులైనా, పామరులైనా సరే, అని దీని కర్థము. "నేను జగత్తును సంరక్షిస్తాను: ధర్మసంస్థాపన చేస్తాను, అన్యాయ అక్రమ అసత్యములనే అహంకారజన్య కల్మషము లన్నియునూ నాశనము చేస్తాను. భక్త రక్షణ సలుపుతాను, అనేది కంకణముల భావార్థము. దానివలననే శ్రీకృష్ణుని ప్రేమావతారము అంటారు. తిరిగి అట్టి పూర్ణ ప్రేమావతారము వచ్చి నప్పుడు, మీరందరూ దర్శనభాగ్యమునందుకొంటున్నా రంటే, మీ జన్మములు ఎంత పుణ్యము, ఎంత సార్థకము! దానికే! ఇదిగో! పరమ పవిత్రమైన ఈ కౌస్తుభమాల, శ్రీకృష్ణుడు తన మెడలో వేసుకున్న పతకము! చూసి ఆనందపడండి! (శ్రీవారి హస్త మందు ప్రత్యక్షమైన ఆ దివ్య కంఠాభరణమును, విద్యార్థులందరికీ, ఉపాధ్యాయులకు, సమావేశమైన ఇతర భక్తులకు శ్రీవారే సమీపమునకు వచ్చి, చూపించి ఆనంద పరచిరి. తరువాత, శ్రీవారే దానిని శ్రీకృష్ణుని చందన విగ్రహము యొక్క మెడలో వేసిరి),
(స.సా.ఆ. 77 పు. 181/182)
బలరాముడు ఇంటికి వచ్చి, "అమ్మా! తమ్ముడు బజార్లో మట్టితింటున్నాడు" అని తంటాలు చెప్పినప్పుడు యశోద కృష్ణుని చెవి పట్టుకొని మందలించగా కృష్ణుడు, “అమ్మా! మన్ను తినడానికి నేనేమైనా చిన్నపిల్లవాడినా? వెఱ్ఱవాడినా?" అన్నాడట. అనగా, నేను చిన్న పిల్లవాడను కాదు సుమా, సాక్షాత్ భగవంతుడినే నని ఇన్ డైరెక్ట్ గా తెలియజేశాడు. భగవంతుని మాటలు చాల విచిత్రంగా ఉంటాయి. అంతేకాదు, అనేక అంతరార్థములతో కూడి యుంటాయి. భగవంతుని చర్యలన్నీ నివృత్తికి సంబంధించినవి. ప్రవృత్తిలో జీవితాన్ని గడిపే మానవులకు అవి అర్థం కావు. కొందరు తమ ప్రాకృత బుద్ధిని ఆధారంగా చేసుకొని, కృష్ణుడు వ్రేపల్లెయందు గోపికలతో అసభ్యంగా ప్రవర్తించాడని విమర్శిస్తూ వచ్చారు. ఇది చాల పొరపాటు. కృష్ణుడు వ్రేపల్లెలో ఉన్నది ఐదవ సంవత్సరం వరకు మాత్రమే, తరువాత మధురకు వెళ్ళి పోయాడు. తిరిగి వ్రేపల్లెకు రానేలేదు. ఐదు సంవత్సరాల బాలుడు అసభ్యంగా, సంఘవిరుద్ధంగా ప్రవర్తించాడనటంలో అర్థం లేదు. “యద్భావం తద్భవతి." పవిత్రమైన దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక కొందరు తమ భావాలనే భగవంతునిపై ఆరోపించి తద్వారా భగవంతునికి దూరమై పోతున్నారు. కృష్ణుడు తమాషాగా చెప్పినా, ఇంకే విధంగా చెప్పినా అంతా సత్యమే. నవ్వులకైనా అసత్యం చెప్పలేదు. అర్థం చేసుకోలేనివారు కృష్ణుడు అబద్ధాలు చెప్పాడని అనుకుంటున్నారు. ఇది అన్ని యుగములందు ఉన్న రోగమే. ఒకనాడు గోపికలు వచ్చి యశోదకు ఫిర్యాదు చేశారు.
“అర్థరాత్రి వేళ మా మిద్దెలెక్కి వచ్చి
నిద్రపోవు స్త్రీల జడలెత్తి కట్టి వచ్చె
అడుగవే తల్లి ! అడుగవే."
కృష్ణుడు యశోదతో నవ్వుతూ చెబుతున్నాడు.
"అమ్మా! నేను నీదు పక్కలో
కదలక మెదలక పడుకొనియుంటినె
అర్థరాత్రి వేళలొ నేనెపుడు
వెళ్ళివస్తినో తెలుపవే తల్లీ! తెలుపవే"
"నేను నీ పక్కలోనే పడుకుని ఉన్నాను కదా! నేనెప్పుడు వెళ్ళి వచ్చాను?నీవే చెప్పు" అన్నాడు. దీని అంతరార్థ మేమిటి? తాను ఇక్కడా ఉన్నాడు. అక్కడా ఉన్నాడు. ఇక్కడ అక్కడ ఎక్కడ చూపిన ఒక్కడే ఉన్నాడనే మహత్తర తత్వాన్ని నిరూపించాడు.
మరొకనాడు మరికొందరు గోపికలు వచ్చి కృష్ణునిపై మళ్ళీ ఫిర్యాదు చేశారు.
"గొల్ల భామలంత గూడి చల్లనమ్మబోవుచుండ
చల్లబానలకు సుంకమిమ్మని చిల్లుల పడగొట్టినవాడు అడుగవె తల్లీ అడుగ"
అప్పుడు యశోదతో కృష్ణుడు చెబుతున్నాడు.
"దేవుడేమొ కొట్టిపోతే తెలియక నా మీద వైచిరి
ఇందు నా దోసమేమి చెప్పవే తల్లీ! చెప్పవే"
"దేవుడే కొట్టేవాడుకాని, నేను కొట్టలేదు" అన్నాడు. అనగా తానే దేవుడనని ఇన్ డైరెక్ట్ (పరోక్షం) గా చెబుతూ వచ్చాడు. అనేక పర్యాయములు కృష్ణుడు గొల్ల ఇండ్లకు పోయి వెన్న దొంగలించి తప్పించుకుని వచ్చేవాడు. ఒకనాడు యశోద అతనిని పట్టుకున్నది.
"పెట్టినవి తినవు గొల్లల
పట్టుల కుంబోయి వెన్న పట్టెడులుగ లో
గుట్టున తినెదపు నీతో
పుట్టెను రట్టులు కృష్ణా..."
"నోరంతయు వెన్న వాసన
ఊరంతయు ఆగడంబు ఒకటే రద్దుల్
గోరంతయు లేవు బాలా
గారాబము మానుమింక కట్టెద రోటన్"
"మన ఇంట్లో వెన్న నీకు రుచించదా? పరుల ఇంట్లో వెన్న నెందుకు దొంగిలిస్తున్నావు? అని దండించింది. అప్పుడు కృష్ణుడు, "అమ్మా! నీహృదయం వాత్సల్యమనే స్వార్థంతో నిండినది. కాని, గోపికల హృదయం నిస్స్వార్థమైనది, పవిత్రమైనది. కనుకనే, నేను వారి హృదయమనే వెన్నను దొంగిలిస్తున్నాను. నీ ఇంటి వెన్న నాకు అక్కర లేదు" అన్నాడు. లోకులు సరిగా అర్థం చేసుకోలేదు కాని కృష్ణుడు అపహరించింది. వెన్న కాదు. పవిత్రమైన గోపికల చిత్తమును. మీరు భజనలో కూడా చిత్త చోర యశోదాకె బాల్ నవనీత చోర గోపాల్..." అని పాడుతున్నారు కదా!
ఒకనాడు కృష్ణునికి గోపికలపై జాలి కలిగింది. "అయ్యో పాపం! గోపికలు చిత్తశుద్ధి గలవారు, స్వార్థ రహితులు, అమాయకులు. అలాంటి భక్తులను కష్టపెట్టడం మంచిది కాదు. నేను భక్త పరాధీనుడను కదా! ఈ తూరి వారికి తప్పక చిక్కిపోవాలి" అని సంకల్పించుకున్నాడు.
ఒక గోపిక ఇంట్లో ప్రవేశించి ఉట్టి పైనున్న పాలన్నీ క్రిందపోశాడు. అందులో తన రెండు పాదములను తడుపుకొన్నాడు. గోపికలు తనను పట్టుకోవడానికి వచ్చేసరికి పరుగెత్తి పాయాడు. గోపికలు కృష్ణుని పాదముద్రలను ఆధారంగా చేసుకొని వెతుకుతూ పోయేసరికి కృష్ణుడు దొరికి పోయాడు. "గోపికలారా! మీరు నా పాదములను ఆశ్రయించండి. అప్పుడే నేను మీకు చిక్కుతాను" అని ప్రబోధించే నిమిత్తమై కృష్ణుడు ఈ నాటక మాడాడు.
(స.సా. ఆ 96 పు.253/255)
నరరూపముతో వచ్చిన భారతస్వరూపమే శ్రీకృష్ణుడు. హిందూ మతమునకు, హిందూసమాజమునకు, హిందూజాతికి అంతరాత్మగా ఉండేవాడే శ్రీకృష్ణుడు, ఈ కృష్ణతత్వమును రాజకీయ, సాంఘిక, నైతిక, భౌతిక మార్గములలో సామాన్యులకు కూడ విషయములను సామాన్య మార్గములో ప్రబోధించిన వ్యక్తి కృష్ణుడు.
కృష్ణ అనగా యశోదకుమారుడని, నందుని కుమారుడని భావిస్తున్నారు. ఇది బాహ్యమైనది మాత్రమే. “కర్షతీతి కృష్ణః " అనగా ఆకర్షించువాడు కృష్ణుడని అర్థము: "కృషతీతి కృష్ణః" అనగా సేద్యము చేసేవాడు కృష్ణుడు. హృదయమనే ధర్మక్షేత్రమును సాగుచేసి ఆనందమనే పంటను పండించి శాంతిఅనే ఫలమును సమాజమునకు అందించువాడు కృష్ణుడని రెండవ అర్దము. మానవకోటి మధ్య ప్రేమ బీజములను నాటి సహస్రప్రసూనములను వికసింప చేసి శాంతి ఫలములను సమాజమునకు అందించిన మహా తపస్వరూపుడు కృష్ణమూర్తి. ఇతని దీక్షయే ఆనాడు పవిత్రమైన తపస్సుగా మారింది. ఇదియే భారతీయ మతమని, కృష్ణుని అభిమతమని, ఉత్తమ వ్రతమని బోధించిన మహావీరుడు. "కృశ్యతీతి కృశ్న:" - ఎన్ని విధములైన కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించినను, యుద్ధభూమియందు, రుద్రభూమి యందు, భద్రభూమియందును నిరంతరము ఆనందముగా ఉండే ఉల్లాన స్వరూపమును థరించినవాడని అర్థము. యుద్ధభూమిలో అర్జునకు బోధించినది గీత.
(నీ.వే.వె. పు. 16/17)
"(దేవకీవసుదేవులకు కారాగారమున జన్మించి, నందయశోదల యింట వ్రేపల్లెలో పెరిగిన వెన్నదొంగ ఈ కృష్ణుడు. పుట్టినదాదిగా ఇతని చర్యలు మానవాతీతములై, ఆశ్చర్యకరములై కన్నవారికీ విన్నవారికీ వింతలు కలిగించుచుండెడివి. రూపమునకు బాలుడుగాని ప్రతాపమునకు మహావీరుడు తనను పట్టుటకై కంసుడు పంపిన అనేక దూతలను హతమార్చి గుట్టును కనిపెట్టి పొట్టలు చీల్చెను. వ్రేపల్లెలో నిత్యమొక ఆశ్చర్య అద్భుత లీలను జరుపుచుండెను. రాళ్లవర్షముచే బాధపడుచున్న గోపగోపికలను, గోవులను రక్షించుటకై బుజ్జి చిటికిన వేలుపై కొండనెత్తి గోకుల వాసులకు గోపాలుడిట్టి మానవాతీతుడను సత్యమును నిరూపించెను. కాళీయుని గర్వమణచి తలపై నృత్యము చేసెను . కంసభూపాలుని బంతివలె యెగరవేసి చంపెను. మహామహా పరాక్రమశాలురు, రాక్షసశక్తి సంపన్నులు అయిన జరాసంధ, దంతవక్త, శిశుపాల, నరకాసుర యిత్యాది రాక్షసశూరులను డొక్కలుచించి డోలువలె వాయించెను. ప్రజలను రాక్షస రాజులనుండి రక్షించెను. ధూర్తులైన ధృతరాష్ట్ర పుత్రులను రూపుమాపుటకై పార్థునకు సారథిగా నిరాయుధుడై నిలచి ధర్మమూర్తులైన పాండవుల విజయమునకు కీర్తిని సార్థకము గావించెను. అన్యాయ, అక్రమ, అధర్మ, అనాచార ప్రవర్తనలను అణుమాత్రములో అణగదొక్కి నమ్మిన పాండవులను కంటికి రెప్పవలె కాపాడెను. రుద్ర భూమియందూ, భద్రభూమియందూ రౌద్రమనునది లేక, విచారమనునది చూపక ఉల్లాసముతో చెల్లాటమాడుచుండెడివాడు. సర్వోపనిషత్ సారమైన గీతను, యుద్ధమునకు పూర్వము అర్జునుని నిమిత్తమాత్రునిగా చేసుకొని లోకానికి అందించిన జ్ఞానమూర్తి ఈ కృష్ణమూర్తి.
సర్వసృష్టి తనయందే ఉన్నదనియు, సృష్టికి తానే కర్తననియు విశ్వవిరాట్ రూపమున అర్జునునకు సాక్షాత్కరించెను. జగత్తు, జగదీశుడు వేరుకాదనియు రెండింటికి బింబప్రతిబింబ సంబంధమనియూ నిదర్శన రూపములైన ప్రదర్శనలు జరిపించెను. ధర్మమును కర్మల ద్వారా నిరూపించమని బోధించి తాను చేసి చూపించెను. గోపాలుడు నిరంతరమూ కిలకిల, కళకళలాడుచుండెడివాడేగానీ పొంగి కృంగెడివాడు కాదు. అన్నింటియందూ ఉండియూ దేనితోనూ చేరక అంటక ఉండెడివాడు. అతని అన్ని చర్యలూ ఆధ్యాత్మికములే, అంతరార్థములే, - అద్భుతములే. లోకాలనేలే గోపాలుడు భూపాలనకై ఈ రూపమును దాల్చెను.లేకున్న ఆకారమే లేనివానికి యే పేరని చెప్పవీలగును! భక్తిప్రపత్తులు గోపాలుని ద్వారానే లోకానికి ప్రాకెను. గోపికలు తరించిరి. లోకులు స్మరించిరి. అట్టి యాదవకుల భూషణుడు, బృందావన సంచారకుడు, గోపీజనవల్లభుడు, మధురాపురవిహారి, ద్వారకస్థాపకుడు ఈ కృష్ణుడే. ఇతడే లోకుల కష్టములను - తీర్చి జన్మలు సార్థకము గావించు సమర్థుడు, గీతా స్థాపకుడు), అవతారమూర్తి శ్రీకృష్ణునికి ఎంత చక్కని పేరు! దానికి ఎంతో పవిత్రమైన అర్ధమున్నది. కృషి, ఆకర్షణ, త్రికాలాబాధితానందము. ఈ మూడు అర్థములు ఆ పదమునకున్నవి. హృదయభూమిని దున్ని, ప్రేమబీజములు నాటి, ఆనందమును పండించేది కృష్ణావతార కార్యము. ఆబాలగోపాలము అందరినీ ఆకర్షించి, వారి చిత్తములనపహరించి, మనోలయమొనగూర్చి కాపాడే మూర్తి అని మరొక అర్థము. సచ్చిదానందస్వరూపుడు, మాటలతో పాటలతో ఆటలతో వేణుగాన మాధుర్యముతో ఆనందమునందించాడు కృష్ణుడు. భద్రభూమిలోను, రుద్రభూమిలోను ఆనందగానమే ఆయనకలవాటు. మహాభయంకరమైన భారత యుద్ధ క్షేత్రమున చక్కగా, శాంతముగా, నెమ్మదిగా గీతను పాడినాడు. కృష్ణుడు ఆనంద స్వరూపుడే! (దివ్య జ్ఞాన దీపికలు ద్వితీయ భాగం పు 1-3)