ప్రతి మానవుని యందు షడ్ చక్రములు ఉంటున్నాయి. వీటిలో రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి. 1. హృదయ చక్రము 2. సహస్రార చక్రము. ఈ హృదయ చక్రమునే హృదయ కమలము" అన్నారు. సహస్రారచక్రమును సహస్ర కమలము" అన్నారు. ఈ రెండు చక్రముల యొక్క తత్త్వమును చక్కగా గుర్తించుకున్నప్పుడు, భగవంతుడు వారికి వశుడవుతాడు. ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ షడ్చక్రము" ఒక్కొక్క రేఖకు ఒక ప్రత్యేకత ఉంటుంటుంది. సహస్రార చక్రము పైన ఒక్కొక్క దళము పైన ఒక్కొక్క దళమువాలి వుంటుంది. ఒక్కొక్క దళమునకు కూడనూ షోడశకళలలో నిండివుంటాడు భగవంతుడు. ఈ షోడశ కళాపరి పూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు. కనుక వేయి దళములను ఒక్కొక్క దానిని పదహారు దళములతో వెచ్చించినప్పుడు పదహారువేల గోపికలుగా మారిపోయినారు. వీరు భగవంతునికి అర్పితమై పోయినారు. అయితే వీరికినాయకుడెవరు? భగవంతుడే. ఆ భగవంతుని ఆజ్ఞచేత ఈ దళములను తీసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంటుంది. అయితే భగవంతుని హక్కు అయినటువంటి ఈ దళములను, భగవంతుని ఆజ్ఞలేకుండా పుచ్చుకోవటం ఎవరికి సాధ్యంకాదు.
ఒక చిన్న ఉదాహరణ. సీత భూజాత, ఈమె రాముని పత్ని. ఆమెపై రామునికి సర్వహక్కులు వున్నాయి. కనకనే అతను సీతకు పతి అయినాడు. కనుక సీతాపతి రాముడు, పతి ఆజ్ఞను తీసుకోకుండా, ఆమెను రావణుడు దొంగిలించుకొని పోయినాడు. పతి ఆజ్ఞను తీసుకోకుండ, తీసుకొనిపోవటంచేత రావణుడు ఏమి అనుభవించాడు? అన్ని కష్టములకూ గురియైపోయినాడు. కడకు భార్య మండోదరి కూడా రావణునికి హితవు పల్కింది. రావణా! రామచంద్రుడు సాక్షాత్ నారాయణమూర్తి. ఈమెసీతామాత. ఈ పతివ్రతురాలు ఈమెను తీసుకొనిరావటం చాలా పొరపాటు. పొరపాటేకాదు తప్పు కూడాను. రాముని ఆజ్ఞలేకుండా ఈమెను ఎందుకు తీసుకొని వచ్చావు? కనుక ఇప్పుడైనా ఈమెను తీసుకొనివెళ్ళి రామునికి వప్పజెప్పిరా! అంటుంది. "వినాశకాలే విపరీత బుద్ధిః". అతను ఏ మాత్రం అంగీకరించలేదు. అదే విధముగా ఈ పదహారు వేలమంది గోపికలు కూడనూ, షోడశ కళలతో నిండినటువంటి పరమాత్ముని సొత్తులే. సహస్రార పద్మములన్ని కూడనూ, అష్టదళములతో కూడినటువంటి ఆకారములే. యోగులంతా ఈ అష్టదళములను ఆశ్రయించుకొని, సహస్రార పద్మములో ప్రవేశించి పరమానందమును అనుభవించారు. ఈ ఆనందము సహస్రార పద్మము నుండే వచ్చింది. కనుక ఈ విధమైనటువంటి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు, దైవాజ్ఞను మనం పాటించినప్పుడే, సమానమైనటువంటి, పరిపూర్ణమైనటు వంటి ఆనందం మనకు లభిస్తుంది.
అష్టదళములయందు అష్టరాణులను పెట్టాడు. సహస్రార దళములయందు పదహారువేల గోపికలు ఉన్నారు. అంతా చేరినప్పుడు, అది అంతా కృష్ణుని యొక్క హృదయ కమలమే. కమలములలో అనేక రేఖలుగా వుంటున్నాయి. రేఖలు వేరు కమలము వేరుకాదు. కనుక దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు, దైవహృదయంలో మనం రేఖలుగా తయారు కావాలి. ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి? కర్మఫల రహితమైనటువంటి యొక్క పరమశాంతమై నటువంటి రూపకంగా ఉండాలి. మీ ప్రేమను అంతనూ ఆ రేఖలలో ఇమడ్చాలి. ప్రేమను నింపుకోవాలి. ఆనందమును అనుభవించాలి.
(శ్రీ పి. 2000 పు. 21, 22)
(చూ|| అద్వైత దర్శనము, గమ్యస్థానము)