ఒకానొక సమయంలో రుక్మిణి రాధను తన ఇంటికి ఆహ్వానించింది. ఆనాడు ఇంటికి వచ్చిన అతిథులకు పెట్టడానికి ఇడ్లీ దోసెలవంటి టిఫిన్లు లేవు. అందరి ఇళ్ళలో పాలు, పెరుగు, వెన్న సమృద్ధిగా ఉండేవి గనుక, వాటినే ఇచ్చేవారు. రాధ ఇంటికి వచ్చిన ఆనందంలో రుక్మిణి తానేమి చేస్తున్నదో తనకే తెలియక వేడివేడి పాలను గ్లాసులో పోసి రాధకు అందించింది. రాధకు దేనినైనా ముందు కృష్ణునికి అర్పించి తరువాత తాను తీసుకోవడం అలవాటు. అదే ప్రకారంగా కృష్ణార్పణం" అని ఆ ఉడుకుడుకు పాలను త్రాగేసింది. సాయంకాలము కృష్ణుడు పవళించగా రుక్మిణి పాదసేవ చేస్తున్నప్పుడు పాదాలపై బొబ్బలు కనిపించాయి. "ఏమిటిది స్వామీ! ఏమి జరిగింది? ఎవరు నిన్ని విధంగా హింసించారు?" అంటూ ఆదుర్దాగా ప్రశ్నించింది. "ఇది నీపనే! ప్రొద్దున్న రాధ ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు వేడివేడి పాలు ఇచ్చావు. వాటిని రాధ నాకు అర్పితం చేసింది. దానిలో నా కాళ్ళు కాలి పోయాయి" అన్నాడు. కొంతమంది ఇవన్నీ కట్టుకథలని భావిస్తారు. కాని, కథలు కానివి, భక్తుల వ్యథలను నిర్మూలించే నిమిత్తమై కృష్ణుడు చేసిన లీలలు. మీరా అక్బర్ చక్రవర్తి నుండి కృష్ణునికోసం పూల మాలను స్వీకరించిందని మహారాణాకు కోపం వచ్చి ఆమెకు పాలలో విషం కలిపి పంపించాడు. అది త్రాగిన తక్షణమే దేహమంతా నీలంగా మారిపోయి రక్తం నిల్చిపోతుంది. మీరా ఆ పాలను కృష్ణార్పణం అని త్రాగింది.” విషమంతా కృష్ణుడు తీసుకున్నాడు. మధురమైన పాలను మీరాకు అందించాడు. కనుకనే, మనం ఏ పదార్థమునైనా భుజించే ముందు బ్రహ్మార్పణం చేయాలి. అప్పుడది పదార్థముగా ఉండదు, ప్రసాదంగా మారుతుంది.
(సా.స...ఆ 96 పు. 255/256)