మానవునియందున్న దివ్యశక్తి ఇట్టిది, అట్టిది అని వర్ణించుటకు వీలుకాదు. అదియే విష్ణుశక్తి, అదియే బ్రహ్మశక్తి. వేదము "సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ " అన్నది. త్రికాలములందు మార్పు చెందని, కూర్పు చెందని జ్ఞానమే బ్రహ్మతత్త్యము. వేదము “ప్రజ్ఞానం బ్రహ్మ" అని కూడా తెల్పి౦ది. దీనినే ఈ బ్రహ్మ నుండియే ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని. అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వి, పృథ్వి నుండి ఓషదులు, ఓషధుల నుండి అన్నము ఆవిర్భవించాయి. అన్నము నుండియే మానవుడు పుట్టాడు. ఈ విధంగా విచారణ చేసినప్పుడు మానవునికి, బ్రహ్మకు సన్నిహిత సంబంధ బాంధవ్యమున్నదని స్పష్టమవుతుంది. కనుకనే కృష్ణుడు “మమైవాంశో జీవలోకే జీవభూత: సనాతనః" (ఈ ప్రపంచమునందలి జీవులందరూ నా శాశ్వతాంశములే) అన్నాడు. బ్రహ్మయే లేక ఆకాశమే లేదు; ఆకాశమే లేక గాలియే లేదు; గాలియే లేక అగ్నియే లేదు; అగ్నియే లేక జలమే లేదు; జలమే లేక పృథ్వియే లేదు; పృథ్వియే లేక ఓషధులే పండవు: ఓషధుల పంట లేక అన్నము లభించదు. మానవునికి అన్నమే మూలాధారం. దీనిని పురస్కరించు కొనియే వేదము “అన్నం బ్రహ్మ" అన్నది. బ్రహ్మ అనగా ఎవరు? మీరు పిక్చర్లలో చూసే చతుర్ముఖ బ్రహ్మ కాదు. బృహత్తరమైన శక్తియే బ్రహ్మ, సర్వత్ర వ్యాపించిన శక్తియే బ్రహ్మ, శబ్దమే బ్రహ్మ, గాలియే బ్రహ్మ, నీరే బ్రహ్మ, భూమియే బ్రహ్మ, అగ్నియే బ్రహ్మ స్వరూపములు, అవన్నీ మానవ దేహమునందే ఉన్నవి. కనుక, మానవుని కంటే దైవం ప్రత్యేకంగా లేడు. మానవుడే సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు. మానవుడే సత్యస్వరూపుడు. మానవత్వమునందే దైవత్వాన్ని ప్రకటించాలి. దైవత్వాన్ని ప్రకటించడమే మానవుడు చేయవలసిన సాధన. "
(స.సా. ఫి.2000 పు. 34)
(చూ॥ ఆనృత పుత్రుడు. ఆదర్శం. అధర్వవేదము, జీవించాలి)