శంకరులవారు కాశీ క్షేత్రము నుండి తిరిగి వచ్చేటప్పుడు ఎవరో ఒక పండితుడు ఒక చెట్టు క్రింద కూర్చొని "డుకృణ్ కరణే, డుకృణ్ కరణే" అని పాణిని వ్యాకరణాన్నివల్లిస్తున్నాడు. శంకరులవారు అతని వద్దకు వెళ్ళి "నాయనా! దీనివల్ల నీకు కలిగే ఫలితమేమిటి?" అని ప్రశ్నించారు. "నేను గొప్ప పండితుడనై రాజుగారి కొలువులో ప్రవేశించి కావలసినంత ధనం సంపాదిస్తానను" అన్నాడు. "ధనంవల్ల నీకు కలిగే ఫలిత మేమిటి?" అని అడిగారు. "నేను ఉన్నంత వరకు నాకుటుంబంలో సుఖంగా జీవిస్తాను " అన్నాడు. "తదుపరి?", "నాకు తెలియదు" అన్నాడు. అప్పుడు శంకరులవారు "పిచ్చివాడా! ధనం, వ్యాకరణం భౌతిక మైనవి. అంత్యసమయములో ఇవేవీ నిన్ను రక్షించలేవు. నీవు మరణించిన తరువాత కూడా అనుభ వించగలిగే నిత్యసత్యమైన ఆనందాన్ని మొట్టమొదట సంపాదించుకో.
భజగోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
సహి నహి రక్షతి డుకృణ్ కరణే
ఈ లౌకికమైన విద్యలతో కాలాన్ని వ్యర్థం చేసి, నీ జీవితాన్ని నిరర్థకం చేసుకోవద్దు" అని బోధించారు. శంకరులవారు ఎట్టి స్వార్థమూ లేక సర్వ కర్మలను లోకోద్ధరణ నిమిత్తమై లోకకల్యాణ నిమిత్తమై ఆచరిస్తూ వచ్చారు. శంకరులవారు మాత్రమే కాదు. కృష్ణుడు కూడా అట్లే చేశాడు.
నమే పార్థాస్థి కర్తవ్యం త్రిశులోకేషు కించన
నా నవాప్త మవాప్తవ్యం వర్తయేవచ కర్మణి
“అర్జునా! ఈ ముల్లోకములలో నేను చేయవలసిన పని ఏమీ లేదు. నాకు వచ్చే ఆదాయము కూడా ఏమీ లేదు. అయినప్పటికీ నేను నిరంతరము కర్మాచరణలో నిమగ్పుడనై ఉన్నాను. ఎవరికోసం? ఎందుకోసం? లోకోద్ధరణకోసమే. పెద్దలను చూసి పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతరులు నన్ను అనుసరించి తద్ద్వారా తరించుటకు ప్రయత్నం చేస్తారు. నేనే కర్మలను ఆచరిస్తున్నాను. నీవు కూడా ఆచరించు. కర్మచేతనే జన్మ సార్థకమవుతుంది" అన్నాడు.
(స.సా. మా. 99పు.76/77)