గోపికలంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలను నిగ్రహించుకున్న వాళ్ళు గోపికలు. గోపిక స్త్రీ పేరుకాదు.
(స.పా.ఏ. 1988 పు. 137)
మానవులను భగవంతుని సన్నిధికి తోడ్కానిపోగల గ్రంథము భాగవతము. దుఃఖం నుంచి వేదన నుంచి విముక్తి కలిగించగల బోధ అంతా ఈ ఒక్క గ్రంథంలో లభిస్తుంది. ఇందులో ప్రేమ మాధుర్యం తొణికిసలాడు తున్నది.
పరమాత్మునికోసం గోపికలు ఏవిధంగా పరితపించేవారో పరిశీలించండి. వారు ప్రభువును నిరంతరం స్మరించేవారు. భక్తిమార్గమును ఎన్నడూ వీడలేదు. మీకు ఏదైనా బాధకలిగితే ఆయ్యో అబ్బా అంటారు. కాని గోపికలు సుఖంలో దుఃఖంలో కూడా "కృష్ణా! కృష్ణా!" అనేవారు. ఒక గోపిక బృందావన వీధుల్లో ఒకనాడు నెయ్యీపాలు, పెరుగు అమ్ముతూ పోతున్నది. తాను అమ్ముతున్న వస్తువుల పేర్లకు బదులుగా, "గోవిందా! దామోదరా! మాధవా!" అంటూ బిగ్గరగా కేకలు పెడుతున్నది. బృందావనమునకు ఎందుకు వచ్చామనే విషయం కాని, పాలు పెరుగు అమ్ముకొని జీవనోపాధి సంపాదించు కోవాలనే సంగతి కాని వాళ్ళకు స్పృహలో ఉండేది కాదు. కృష్ణుని గురించి తప్ప మరే విషయం మీదా వాళ్ళు మాట్లాడలేరు. వేదనపడే గోపిక చుట్టూ చేరి వారు కృష్ణనామ కీర్తనం సాగించేవారు. ఆ తృష్ణను చల్లార్పగలవాడు కృష్ణుడే. తపించిపోయే దాహంతో “కృష్ణా!" అని మొర పెట్టుకొంటే ఆ నీలమేఘశ్యాముడు కనికరించి కనబడతాడు.
ఆ తృష్ణ ఎంత తీవ్రమో తెలిసి కొన్నప్పుడే మీకు రాధాతత్త్వం అర్థమవుతుంది. కృష్ణుడే ఆధారమని గ్రహించి నిరంతరధారగా ఆరాధన చేసింది రాధ. ఆమె ధర. అంటే ప్రకృతి. కృష్ణుని మాధుర్యం ప్రకృతిలో నిండారి ఉన్నది. ఆ మధురిమను రాధ ఆస్వాదించి పరవశురాలయింది. ఆమె మాయాశక్తి, శ్రీకృష్ణసంభూతమైన హ్లాదినీ శక్తి. ఆమె కృష్ణుని మహాభావము. ప్రకృతి రూపంలో ప్రకటితమైన కృష్ణుని ఆనందమును రాధ తన హృదయంలో భద్రపరచుకున్నది. దుష్ట ప్రవృత్తులతో మలినవాంఛలతో నిండిన మనస్సులకు ఈ సంబంధం ఎలా అర్థమవుతుంది? కృష్ణుడు పరమాత్ముడనే విశ్వాసం పెంచుకుంటే ఆయన లీలలకు భౌతికమైన వ్యాఖ్యానాలు చెప్పే వైఖరి నుంచి కాపాడగల కవచం మీకు దొరుకుతుంది.
అసలీ గోపికలెవరు? అవతారమహిమలో పాల్గొనుటకు, భగవంతుని సేవించుటకు, భగవల్లీలలకు సాక్షులై అందులో తాము భాగస్వాములై ఆనందమను భవించుటకు భూలోకమునకు వచ్చిన దేవతలు. వారొక ప్రత్యేక ప్రయోజనార్థము పుట్టిన దివ్యకాంతలు. కృష్ణుడు గోపకాంతల యిండ్లలో దొంగిలించినది మామూలు వెన్న కాదు, భక్తి భావితమైన హృదయమను వెన్న. కృష్ణుడు చిత్త చోరుడు, చోరుడు యజమానికి తెలియకుండా దొంగిలిస్తాడు. యజమాని దుఃఖంపొందుతాడు. కాని ఈ చోరుడు యజమాని మెలకువగా నున్నప్పుడే దోచుకుంటాడు. ఆ దోచుకొనబడినవాడు పరమానంద భరితుడౌతాడు.
కృష్ణుడు తమకు గుర్తుకురావటానికై గోపికలు నిలవర్ణపు కుంకుమ పెట్టుకొనేవారు. నీలమణుల హారమునే నిత్యము ధరించేవారు. ఆమణులలో కృష్ణుని రూపం వారికి కనులపండువుగా కనిపిస్తూ ఉండేది. (ఈ మాటలు చెప్తూ సత్యసాయి భగవానుడు భక్తులు తన కర్పించిన ఒక దండలోని మల్లెపూల రేకులు కొన్ని లాగి పైకి ఎత్తి రెండవ చేతిలో పోయగా అవి నీలమణులుగా మారిపోయినాయి. "గోపికలేరికోరి అలంకరించుకొన్న మణులివే" అని అక్కడి వేలాది భక్తులకామణులను చూపించారు. ప్రతిమణిలోను స్పష్టంగా అందంగా కనబడుతున్న శ్రీకృష్ణుని రూపం చూచి అందరూ అపూర్వానందమును పొందారు. ఆ పల్లెటూరి గొల్లభామ లేకాదు, వృద్ధుడును జ్ఞానియు మహావీరుడునైన భీష్మునకు కూడా కృష్ణుడటువంటి ప్రేమస్వరూపుడే, ఆనాడు అన్ని జాతుల, అన్ని తరగతుల, అన్ని వృత్తులవారును ఆయన నట్లే భజించి కృతార్థులయ్యారు. అదే కృష్ణుడవతారమనుటకు గుర్తు!
కృష్ణావతారం పదహారు కళలు నిండినటువంటి సంపూర్ణావతారము. నీ మనసును కృష్ణుని లీలలతోను, ఆయన మహిమలతోను నింపుకో. ఆయన ప్రేమమూర్తి, భక్తవత్సలుడు. నీవు నీ హృదయమును ఆ ప్రభువునకు పీఠము గావించు. అప్పుడు దానికి విలువ హెచ్చు. ఆభ్రకపు చాళ్ళుగల భూమికి విలువ హెచ్చు. బంగారు చాళ్ళుగల భూమి కంతకంటెను విలువ హెచ్చు. భూమి విలువ దానిలో నుండు లోహముల ననుసరించి ఉంటుంది. అలాగే హృదయం విలువ దానిలోని విషయముల సమసరించి ఉంటుంది. మీరు మీ హృదయంలో భగవంతుని నిలుపుకుంటే అది అత్యధికమైన విలువగల స్థితిని పొందుతుంది.
ఈ కలియుగంలో ప్రేమ తత్త్యం ఎక్కడా కనబడదు. ఈ వ్యాసంగంలో కాలం గడిపితే మాకు జీవనోపాధి ఎట్లా దొరుకుతుంది? అని మీరు అడుగవచ్చు. భగవంతుని పట్ల నిర్మలనిశ్చల విశ్వాసం మీకు ఏర్పడితే ఆయన మీకు అన్నమే కాదు, అమృతం కూడా అందింపగలడని నేను అభయమిస్తున్నాను.
(గ.భా.కృ. జ .ప్రశాంతి నిలయం 12.8.63)
యాదవులకు, గోపికలకు ఉన్న వ్యత్యాసము గుర్తించాలి. యాదవులు కేవలము కృష్ణుడు మావాడు, మా బంధువు, మా మిత్రుడు అనే అభిమానము చేత కృష్ణుని ఆహంకారముగా అనుభవించేవారు. మేము కృష్ణుని బంధువులము. కృష్ణుడు మావాడు అనే అభిమానము పెంచుకుంటూ వచ్చారు. ఆ అభిమానముచేత ఆహంకారము పెరుగుతూ వచ్చింది. ఆ ఆహంకారము చేత యాదవులు క్షీణించటానికి మార్గము ఏర్పడింది. కానీ గోకులము వారు అట్లు కాదు. కృష్ణా! మేము నీవారము" అని అర్పితము గావించుకుంటూ వచ్చారు. మేము మీ వారమని అర్పితము గావించుకోవటంచేత గోపికలందరూ సుక్షేమంగా ఉండగలిగారు. వినయవిధేయతలు వారి యందు ఉట్టిపడ్డాయి. మానవునకు ప్రధానమైనది వినయ విధేయతలు.
(భ. స. మ. పు. 172)
ఈ ప్రపంచంలో జలమునకు ఏ మాత్రము కొదువ లేదు. ఎక్కడ చూసినా ట్యాంకులున్నాయి. నదులున్నాయి,సముద్రాలున్నాయి. కానీ చకోర పక్షులు ఈ మలిన జలము నాశించక కేవలం ఆకాశం నుండి పడే స్వచ్ఛమైన, నిర్మలమైన జలమును మాత్రమే గ్రోలి తృప్తి పడతాయి. అదేవిధంగా గోపికలు కూడా తమ లక్ష్యమును నీల మేఘశ్యాముడైన కృష్ణుని పైనే పెట్టుకొని జీవిస్తూ వచ్చారు. నీలిరంగులో మేఘం కనిపించినా సరే, ఆది కృష్ణుడే అని భావించేవారు. అసలు గోపికలనగా ఎవరు? గుహ్ అనే ధాతువు నుండి గో అనే అక్షరం ఏర్పడింది. గో అనగా వేదమని, గోవు అని, భూమండలమనీ, వాక్కు అని నాలుగర్థములున్నాయి.కనక గోపికలనగా వేదము నుచ్చరించినవారని, గోవులను సంరక్షించినవారని, భూమిని పోషించినవారని, వాక్కు చేత భగవత్స్వ రూపాన్ని నిరూపించిన వారని నాలుగు రకములైన అర్దములను తీసుకోవచ్చు. "క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా" అని వారు కృష్ణుణ్ణి వర్ణిస్తూ వచ్చారు. ఈ ఐదు పదములకు వారు ఏ అర్థములను స్వీకరించారనేది మనం కొంత విచారించాలి. క్లీం - అనగా భూమి, కృష్ణాయ - జలము, గోవిందాయ - అగ్ని గోపీజనవల్లభాయ - వాయువు, స్వాహా - ఇది ఆకాశము. అనగా భగవంతుడు లేని స్థానం లేదు. ప్రతి కణమునందు, ప్రతి అణువునందు చిద్రూపుడైన భగవంతుణ్ణి దర్శించారు గోపికలు..
(స.పా.పి.98 పు. 43)
(చూ॥అనన్యభక్తి, కృష్ణుడు. నరకాసురుడు, నరుడు, ప్రేమ, ప్రేమతత్త్యము, భక్తిపరమావధి, మెస్పెంజర్స్ఆఫ్ సత్యసాయి. రాధాకృష్ణులు, లింగము, విశ్వాసము, వేణుగానము.)